logo

మద్యం అమ్మకాలతోనే పింఛన్లు, రైతుబంధు: రాజగోపాల్‌రెడ్డి

సీఎం కేసీఆర్‌ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వకుండా అవమానిస్తున్నారని తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యేని అవమానిస్తే గెలిపించిన ప్రజలను అవమానించినట్టేనని తెలిపారు.

Published : 26 Sep 2022 04:24 IST

మందోల్లగూడెంలో బతుకమ్మను ఎత్తుకున్న రాజగోపాల్‌రెడ్డి

చౌటుప్పల్‌గ్రామీణం,న్యూస్‌టుడే: సీఎం కేసీఆర్‌ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వకుండా అవమానిస్తున్నారని తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యేని అవమానిస్తే గెలిపించిన ప్రజలను అవమానించినట్టేనని తెలిపారు. చౌటుప్పల్‌ మండలం కైతాపురం, కొయ్యలగూడెం, మందోల్లగూడెం గ్రామాల్లో ఆదివారం ఆయన పర్యటించారు. ఆయన మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ భవిష్యత్తును మార్చబోతుందని పేర్కొన్నారు. మద్యం విక్రయాలు, బెల్టు దుకాణాలను ప్రోత్సహిస్తూ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. మద్యం విక్రయాలతోనే పింఛన్లు, రైతుబంధు ఇచ్చే పరిస్థితి నెలకొందన్నారు. మిగులు బడ్జెట్‌తో ఏర్పడిన రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని, మునుగోడులో తెరాసను ఓడిస్తేనే తెలంగాణకు పట్టిన పీడ విరగడవుతుందన్నారు. గజ్వేల్‌, సిరిసిల్ల, సిద్దిపేట ప్రాంతాలకే నిధులు కేటాయిస్తూ ఇతర ప్రాంతాలపై సీఎం కేసీఆర్‌ వివక్ష చూపుతున్నారని ఆరోపించారు.

చేరికలు.. ఆర్థిక సాయాలు

కైతాపురంలో ఉపసర్పంచి మంజుల, మందోల్లగూడెం మాజీ సర్పంచి యాదయ్యతో పాటు పలువురు భాజపాలో చేరారు. కైతాపురంలో లారీ డ్రైవర్‌ శ్రీశైలం గాయపడటంతో పరామర్శించి రూ.లక్ష, అతని కుమార్తె విద్యకు రూ.లక్ష సాయాన్ని అందించారు. ఇటీవల కొయ్యలగూడేనికి చెందిన కుడికాల పాండు రోడ్డు ప్రమాదంలో గాయపడగా రాజగోపాల్‌రెడ్డి తన వాహనంలో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ యశోద ఆసుపత్రికి తరలించి అతని వైద్యానికి రూ.ఐదు లక్షలు చెల్లించారు. కోలుకొని ఇంటికి వచ్చిన పాండును పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు రిక్కల సుధాకర్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ ఉప్పు భద్రయ్య, సర్పంచి గుడ్డెటి యాదయ్య, పబ్బు రాజుగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Nalgonda News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts