logo

భత్యం అందక.. భవిత లేదిక..!

భవిత కేంద్రాల పరిధిలోని పిల్లలకు నెలనెలా చెల్లించాల్సిన భత్యాల చెల్లింపు ఉమ్మడి జిల్లా పరిధిలో కొన్నేళ్లుగా నిలిచిపోయింది. ప్రత్యేక అవసరాల పిల్లలు పాఠశాలకు వెళ్లేలా సన్నద్థం చేసేందుకు (స్కూల్‌ రెడీనెస్‌ ప్రోగ్రాం) భవిత కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

Updated : 27 Sep 2022 05:48 IST

భువనగిరి పట్టణం, నల్గొండ అర్బన్‌ న్యూస్‌టుడే

భువనగిరి: కేంద్రంలో కొనసాగుతున్న బోధన

భవిత కేంద్రాల పరిధిలోని పిల్లలకు నెలనెలా చెల్లించాల్సిన భత్యాల చెల్లింపు ఉమ్మడి జిల్లా పరిధిలో కొన్నేళ్లుగా నిలిచిపోయింది. ప్రత్యేక అవసరాల పిల్లలు పాఠశాలకు వెళ్లేలా సన్నద్థం చేసేందుకు (స్కూల్‌ రెడీనెస్‌ ప్రోగ్రాం) భవిత కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో ప్రాథమికంగా చదువుకు వారిని సన్నద్థం చేశాక వారి పరిధిలోని పాఠశాలల్లో చేర్పించి విద్యను కొనసాగిస్తారు. ఉమ్మడి జిల్లా పరిధిలో వంద భవిత కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాల పరిధిలో 7,563 విద్యార్థులు ఉన్నారు. వీరందరికీ ప్రభుత్వం నెలనెలా భత్యాలు ఎస్కార్ట్‌ అలవెన్స్‌, ట్రావెలింగ్‌ అలవెన్స్‌, స్టయిఫండ్‌తో పాటు బ్లైండ్‌ రీడర్‌ అలవెన్స్‌లు చెల్లించాల్సి ఉంది. నల్గొండ జిల్లా పరిధిలో 2018 నుంచి విద్యార్థులకు చెల్లింపులు నిలిచిపోవడం గమనార్హం. యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లో ఏడాదిగా చెల్లింపులు నిలిచిపోయాయి.  దీంతో విద్యార్థులు భవిత కేంద్రాలకు, పాఠశాలలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. వారి తల్లిదండ్రులు వారిని కేంద్రాలకు, పాఠశాలలకు చేర్చేందుకు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఆర్థిక పరిస్థితి బాగాలేని కొందరు తల్లిదండ్రులు పిల్లలను కేంద్రాలకు, పాఠశాలలకు పంపించేందుకు విముఖత చూపుతున్నారు.

ప్రత్యేక అవసరాల పిల్లలను బడికి పంపించేలా సన్నద్ధం చేయడానికి భవిత కేంద్రాలు ఉపయుక్తంగా ఉన్నాయి. చిన్నారులు తొలుత కేంద్రాల్లో తర్ఫీదు పొందిన తదుపరి పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. మరి కొందరు పిల్లలకు అధికారులు ఇంటివద్దే ఫిజియోథెరపీ సేవలతో పాటు విద్యావిషయక సేవలు అందిస్తున్నారు. భవిత కేంద్రాల నిర్వహణకు ఐఈఆర్టీలు, ఆయాలను ప్రభుత్వం నియమించింది. ఐఈఆర్టీలకు నెలకు రూ.19,350, ఆయాలకు నెలకు రూ.1600 వేతనంగా నెలనెలా చెల్లిస్తున్న ప్రభుత్వం విద్యార్థుల భత్యాల చెల్లింపులు నిలిపివేయడం గమనార్హం. ప్రత్యేక అవసరాల పిల్లలకు ప్రతి నెలా ఎస్కార్ట్‌ అలవెన్స్‌ కింద రూ.350, ట్రావెలింగ్‌ అలవెన్స్‌ రూ.350, ఆడపిల్లలకు స్టైఫండ్‌ రూ.200, బ్లైండ్‌ రీడర్‌ అలవెన్స్‌ రూ.600 చెల్లించాల్సి ఉంది. ఈ డబ్బులను విద్యార్థి, విద్యార్థి తల్లిదండ్రుల పేరిట సంయుక్త ఖాతాలో  అధికారులు జమచేసే వారు. ప్రస్తుతం ఆయా భత్యాల మంజూరు కొన్నేళ్లుగా నిలిచిపోయాయి. ఈ విషయమై భవిత ప్రత్యేక అధికారి జోసెఫ్‌ను వివరణ కోరగా నెలనెలా పిల్లలకు చెల్లించాల్సిన బిల్లులను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు పంపిస్తున్నామని అన్నారు. మంజూరు అయిన వెంటనే వారి ఖాతాల్లో నేరుగా జమచేస్తామని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని