logo

దోమల నివారణకు చర్యలేవి..?

భువనగిరి నియోజకవర్గంలో మూడు నెలలుగా జ్వరాలు విజృంభిస్తున్నాయి. వందలాది మంది ప్రజలు దోమకాటుతో జ్వరాల బారిన పడి ఆసుపత్రుల పాలయ్యారు. ఎక్కువగా మలేరియా, చికున్‌ గన్యా, డెంగీ, టైఫాయిడ్‌ లక్షణాలతో మంచంపట్టిన వారే ఉన్నారు.

Published : 30 Sep 2022 04:43 IST

బీబీనగర్‌, న్యూస్‌టుడే: భువనగిరి నియోజకవర్గంలో మూడు నెలలుగా జ్వరాలు విజృంభిస్తున్నాయి. వందలాది మంది ప్రజలు దోమకాటుతో జ్వరాల బారిన పడి ఆసుపత్రుల పాలయ్యారు. ఎక్కువగా మలేరియా, చికున్‌ గన్యా, డెంగీ, టైఫాయిడ్‌ లక్షణాలతో మంచంపట్టిన వారే ఉన్నారు. దోమల వల్ల రోగాలు వ్యాపిస్తున్నా.. పల్లెల్లో నివారణ చర్యలు తీసుకోవడంపై ప్రజాప్రతినిధులు, అధికారులు శ్రద్ధచూపడం లేదు. ఇందుకు నిదర్శనం సరిపడా ఫాగింగ్‌ యంత్రాలు లేకపోవడం. భువనగిరి నియోజకవర్గంలో 112 గ్రామ పంచాయతీలో 30 గ్రామాల్లోనే ఫాగింగ్‌ యంత్రాలు ఉన్నాయి. మిగతా చోట యంత్రాలు లేవనే సాకుతో మశకాలను నియంత్రించకపోవడంతో గ్రామీణులు సీజనల్‌ వ్యాధుల బారిన పడుతున్నారు.

బీబీనగర్‌లో పోచంపల్లి రోడ్డు వైపు కాలనీలో నిలిచిన మురుగు

పరిశుభ్రతతో సరి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గ్రామాల్లో కంప చెట్ల తొలగించి, శిథిలావస్థకు చేరిన పూరిళ్లను కూల్చేశారు. పరిసరాలను శుభ్రం చేయించారు. కానీ, దోమల నియంత్రణకు గ్రామాల్లో ఫాగింగ్‌ చేయించడం లేదు. ఇటీవల తరచూ వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాల్లో వరద నిలిచి మడుగులను తలపిస్తున్నాయి. అలాంటి మురుగు ప్రాంతాలు దోమలకు ఆవాసంగా మారి జ్వరాల వ్యాప్తికి కారణమవుతున్నాయి. గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులను పలకరిస్తే ఫాగింగ్‌ యంత్రాలు అందుబాటులో లేవని చెబుతూ దాటవేస్తున్నారని గ్రామీణలు వాపోతున్నారు.

మూసీ పరివాహక ప్రాంతంలో ముప్పు

మూసీ పరివాహక ప్రాంతమైన బీబీనగర్‌ మండలంలోని మక్తఅనంతారం, రుద్రవెళ్లి, పల్లెగూడెం, భట్టుగూడెం, చిన్నరావులపల్లి, గుర్రాలదండి, బ్రాహ్మణపల్లి, భూదాన్‌పోచంపల్లి మండలంలోని పిలాయిపల్లి, జూలూరు, పెద్దగూడెం, పెద్దరావులపల్లి, భువనగిరి మండలంలోని బొల్లెపల్లి, వలిగొండ మండలంలోని టేకులసోమారం, సంగెం తదితర గ్రామాల్లో పదుల సంఖ్యలో ప్రజలు జ్వరాలతో ఆసుపత్రి పాలయ్యారు. వీరిలో ఎక్కువ మంది దోమకాటుతో రోగాల బారిన పడ్డవారే ఉన్నారు. అధికారులు స్పందించి ఫాగింగ్‌ చేసి మశకాలను నియంత్రించాలని గ్రామీణులు కోరుతున్నారు.


లార్వా దశలోనే నియంత్రణ చర్యలు
-సునంద, జిల్లా పంచాయతీ అధికారిణి

జిల్లాలో దోమల నివారణకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. మశకాలు వృద్ధి చెందకుండా లార్వ దశలోనే నియంత్రించేందుకు నిల్వ ఉండే నీటిలో ఆయిల్‌ బాల్స్‌ వేయించాం. చాలా గ్రామాల్లో యంత్రాల ద్వారా ఫాగింగ్‌ చేయిస్తున్నాం. యంత్రాలు అందుబాటులో లేకున్నా. మరమ్మతులకు గురైనా పక్క గ్రామాల నుంచి తెప్పిస్తున్నాం. ప్రతి గ్రామపంచాయతీలో ఫాగింగ్‌ యంత్రం ఏర్పాటుచేసేలా చర్యలు తీసుకుంటున్నాం.


నిధుల కొరత..
-రమేష్‌, సర్పంచి, గొల్లగూడెం

మా గ్రామ పంచాయతీలో పరిసరాలను శుభ్రం చేశాం. శిథిలావస్థకు చేరిన పూరిళ్లకు నోటీసులు ఇచ్చి కూల్చేశాం. దోమల నివారణకు యంత్రాలు లేక ఫాగింగ్‌ చేయించలేకపోయాం. గ్రామపంచాయతీలో నిధుల కొరతతో ఆ యంత్రాన్ని కొనుగోలు చేయలేకపోయాం. దోమల నివారణకు ముందస్తుగా నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ఆయిల్‌ బాల్స్‌ వేయించాం.


ఫాగింగ్‌ చేపట్టాలి
-మన్నే సంజీవరావు, జియాపల్లి

మా గ్రామంలో దోమలు కుట్టడంతో విష జ్వరాల బారిన పడి సుమారు ఇరవై మందికిపైగా ఆసుపత్రి పాలయ్యారు. ఒక్కొక్కరికి రూ.10 వేల వరకు ఖర్చయ్యాయి. నేటికీ గ్రామంలో దోమల నివారణకు చర్యలు తీసుకోవడం లేదు. ఫాగింగ్‌ చేపట్టాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు