logo

మహిళలకు బతుకమ్మ కానుకగా చీరలు

రూ.90ల చీరను ఇస్తూ సీఎం కేసీఆర్‌ మహిళలను అవమాన పరుస్తున్నారని ప్రతిపక్ష నేతలు విమర్శించడం సరికాదని, చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తూ బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులకు ఇచ్చే కానుకని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే సునీత అన్నారు.

Published : 30 Sep 2022 04:43 IST

ఆలేరు: అగరుబత్తుల తయారీని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే గొంగిడి సునీత

యాదగిరిగుట్ట అర్బన్‌: రూ.90ల చీరను ఇస్తూ సీఎం కేసీఆర్‌ మహిళలను అవమాన పరుస్తున్నారని ప్రతిపక్ష నేతలు విమర్శించడం సరికాదని, చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తూ బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులకు ఇచ్చే కానుకని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే సునీత అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలో బతుకమ్మ చీరలను గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలను దృష్టిలో ఉంచుకొని కేసీఆర్‌ సంక్షేమ పథకాల రూపకల్పన ఉంటుందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతాయని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఏంసీ ఛైర్మన్‌ గడ్డమీది రవీదర్‌ గౌడ్‌, జడ్పీటీసీ సభ్యురాలు తోటకూరి అనురాధ, పురపాలక అధ్యక్షురాలు ఏరుకల సుధా, కమిషనర్‌ శ్రవణ్‌కుమార్‌ రెడ్డి, తెరాస మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, మదర్‌ డెయిరీ డైరెక్టర్లు, నాయకులు పాల్గొన్నారు.

అగరుబత్తుల తయారీ పరిశ్రమ పరిశీలన.. ఆలేరు:   ఆలేరులోని ప్రభుత్వ ఇండోర్‌ స్టేడియంలో ‘వాగ్మీ’ మహిళా సంఘం ఆధ్వర్యంలో ప్రారంభమైన అగరుబత్తుల తయారీ పరిశ్రమను ఎమ్మెల్యే గొంగిడి సునీత గురువారం సాయంత్రం పరిశీలించారు. జిల్లా పాలనాధికారి, యాదాద్రి దేవస్థానం సహకారంతో అగరు బత్తుల తయారీని చేపట్టారని రానున్న రోజుల్లో వాగ్మీ పేరిట కుంకుమ, పసుపు, కొబ్బరి చిప్పలతో ఆకృతి రకాలను తయారు చేస్తామని తహసీల్దార్‌ రామకృష్ణ వివరించారు. యాదాద్రి కొండపైన, త్వరలో జిల్లా కలెక్టరేట్‌ సమీపంలో ఏర్పాటు కానున్న స్టాళ్లలో విక్రయిస్తామన్నారు. తహసీల్దారు రామకృష్ణను, రిసోర్స్‌ పర్సన్లను ఎమ్మెల్యే అభినందించారు. మాజీ సర్పంచి దాసి సంతోష్‌, పుట్ట మల్లేశం, గంగుల శ్రీనివాస్‌, మామిడాల భాను, పత్తి వెంకటేశ్‌, పయాజ్‌ తదితరులు ఉన్నారు.

వాగ్వాదం... ఆలేరు: పట్టణంలో గురువారం సాయంత్రం ఎమ్మెల్యే గొంగిడి సునీత బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. కరోనా సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పేదల బ్యాంకు ఖాతాల్లో రూ.1,500 చొప్పున జమ చేసిందని అనగా..తనకు డబ్బులు రాలేదని ఓ మహిళ ఎమ్మెల్యేతో వాదించారు. అక్కడున్న తెరాస నాయకులు మహిళలకు సర్దిచెప్పడంతో వాగ్వాదం సద్దు మణిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని