logo

జీవన శైలి మార్పుతోనే సంపూర్ణ ఆరోగ్యం

వయస్సు పెరుగుతున్నకొద్దీ కీళ్ల నొప్పులు, నరాల సంబంధిత సమస్యలు అధికమవుతున్నాయని.. నడక, యోగా, ధ్యానం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోనే ఈ సమస్యలకు స్వస్తి చెప్పొచ్చని సీనియర్‌ న్యూరో ఫిజీషియన్‌ డాక్టర్‌ కోన చిరంజీవి,

Published : 30 Sep 2022 04:43 IST

ప్రాథమిక దశలోనే సమస్యలు గుర్తించాలి
‘ఈనాడు-ఈటీవీ’ అవగాహన సదస్సులో వైద్యనిపుణులు

సూర్యాపేటలో అవగాహన సదస్సుకు హాజరైన ప్రజలు

సూర్యాపేట (తాళ్లగడ్డ), న్యూస్‌టుడే: వయస్సు పెరుగుతున్నకొద్దీ కీళ్ల నొప్పులు, నరాల సంబంధిత సమస్యలు అధికమవుతున్నాయని.. నడక, యోగా, ధ్యానం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోనే ఈ సమస్యలకు స్వస్తి చెప్పొచ్చని సీనియర్‌ న్యూరో ఫిజీషియన్‌ డాక్టర్‌ కోన చిరంజీవి, ప్రముఖ ఆర్థోసర్జన్‌ డాక్టర్‌ సందీప్‌కుమార్‌ మీలా అభిప్రాయపడ్డారు. ‘ఈనాడు - ఈటీవీ’ ఆధ్వర్యంలో కీళ్లు, నరాల సంబంధిత సమస్యలపై సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మమత బ్యాంకెట్‌ హాల్‌లో గురువారం నిర్వహించిన అవగాహన సదస్సులో ప్రసంగించారు. స్థానికులు, బాధితులు సదస్సులో పాల్గొని వైద్యులకు తమ సమస్యలు వివరించి సందేహాలు నివృత్తి చేసుకున్నారు. వైద్యులు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వ్యాధుల కారకాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. సదస్సులో సూర్యాపేట ‘ఈనాడు’ యూనిట్‌ ఇన్‌ఛార్జి పి.ప్రభాకర్‌ పాల్గొన్నారు.


మెదడులో అసాధారణ చర్యలతోనే మూర్ఛ వ్యాధి: డాక్టర్‌ కోన చిరంజీవి

నరాల సమస్యల్లో ప్రధానమైంది మూర్ఛ వ్యాధి. నరాలు ఒత్తిడికిలోనై మెదడులో అసాధారణ చర్యలు జరిగినప్పుడు మూర్ఛ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధిపై ప్రజల్లో అపోహలు ఉన్నాయి. ఎవరికైనా మూర్ఛ వచ్చి పడిపోయిన వెంటనే చేతుల్లో తాళాలు లేదా ఇతర వస్తువులను పెడితే త్వరగా లేచి కూర్చుంటారని నమ్ముతుంటారు. ఇది సరికాదు. మూర్ఛవ్యాధి కలిగిన ప్రతి వ్యక్తి స్పృహ కోల్పోకపోవచ్చు. వయస్సుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల్లోనూ ఫిట్స్‌ లక్షణాలు కనిపిస్తుంటాయి. వీటిని గుర్తించడం క్లిష్టంగానే ఉంటుంది. ప్రాథమికంగా గుర్తించి వైద్యులను సంప్రదించాలి.


 నడకతో ఆరోగ్యం పదిలం - డాక్టర్‌ సందీప్‌కుమార్‌ మీలా

రోజూ కనీసం 30 నిమిషాలు విరామం లేకుండా నడిస్తే ఆరోగ్యంగా జీవించవచ్చు. ప్రస్తుతం నడుము నొప్పి (బ్యాక్‌ పెయిన్‌) అందరినీ బాధిస్తోంది. బరువైన పనులు చేసినా, కూర్చునే, పడుకునే విధానం సక్రమంగా లేకపోయినా బ్యాక్‌ పెయిన్‌ వస్తుందని గుర్తించాలి. ఎక్కువ సేపు కుర్చీలో కూర్చొని పనిచేస్తుంటారు. పెద్దవయస్సు వారికి ఎముకలు అరిగిపోయి సమస్యలు ఎదురవుతుంటాయి. సరైన విశ్రాంతి తీసుకోకపోయినా.. ఎక్కువసేపు చరవాణి చూసినా.. బ్యాక్‌ పెయిన్‌, మెడ నొప్పులు వస్తుంటాయి. ఒక్కోసారి కండరాల నొప్పులు బాధిస్తుంటాయి. ఇలాంటి సమయాల్లో అడ్డగోలుగా ఔషధాలు వినియోగించడం సరికాదు. వైద్యులను సంప్రదించి సరైన చికిత్స పొందాలి. 95 శాతం నొప్పులు ఔషధాలతోనే తగ్గిపోతాయి. కీళ్లవాతంతో కాళ్లు, చేతులు వంకర్లు పోతుంటాయి. ఇలాంటి వాటిని శస్త్రచికిత్స ద్వారా నయం చేయవచ్చు.


సందేహం: ఫిట్స్‌ వచ్చిన సమయంలోనే ఈఈజీ పరీక్ష చేయడం సాధ్యమవుతుందా.. సాధారణ సమయంలో ఈ పరీక్ష నిర్వహించడం వల్ల ప్రయోజనమేంటి?- విద్యాసాగర్‌, విశ్రాంత అధ్యాపకుడు, సూర్యాపేట

డా.చిరంజీవి: ఫిట్స్‌ వచ్చే సమయంలోనే ఈఈజీ పరీక్షలు చేయడం సాధ్యం కాదు. సాధారణంగా ఫిట్స్‌ నిర్ధారణ కోసం వైద్యులు రోగికి ఈఈజీ పరీక్షలు చేయిస్తుంటారు. ప్రాథమికంగా వ్యాధిని గుర్తించినప్పుడు వైద్యులను సంప్రదించి లక్షణాలుచెప్పాలి. వైద్యుల సలహా మేరకే ఈ పరీక్ష చేయించుకోవాలి. పరీక్షల్లో నార్మల్‌ వచ్చినా ఫిట్స్‌ లేదని అర్థం కాదు.


 నాలుగు నెలల్లోపు శిశువులకు  ఫిట్స్‌ వస్తాయా? గుర్తించడమెలా? - పి.వి.లక్ష్మీనారాయణ, విశ్రాంత ఉద్యోగి, సూర్యాపేట
డా.చిరంజీవి: శిశువులకు సైతం ఫిట్స్‌ వచ్చే ఆస్కారముంది. తల్లిపాలు తాగుతున్న సమయంలో అకస్మాత్తుగా కాళ్లు, చేతులు కదపటం లాంటి వాటిని నిశితంగా గమనించాలి. ఎదుగుదల లోపాలుంటే గుర్తించి వైద్యులను సంప్రదించాలి.


సందేహం: నా వయస్సు 67 ఏళ్లు. రోజూ 6 నుంచి 7 కిలోమీటర్లు నడుస్తాను. బూట్లు వేసుకొని నడవాలా.. లేక సాధారణ పాదాలతోనే నడవాలా..?ఎక్కువ సేపు వ్యాయామం చేస్తే ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా..?
- శ్యాంసుందర్‌రెడ్డి, సూర్యాపేట
డా.సందీప్‌: ఎంత సేపు నడిచినా పరవాలేదు. సాధ్యమైనంత వరకు వ్యాయామం చేయవచ్చు. నడిచే సమయంలో బూట్లు విధిగా వేసుకోవాలి. దీనివల్ల పాదాలకు గాయాలు కావు. బూట్ల లోపలి భాగం మృదువుగా ఉండేలా చూసుకోవాలి.


మహిళలు ఎక్కువగా వెన్నునొప్పికి గురవుతుంటారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. - దేవరశెట్టి ఉమారాణి, సూర్యాపేట  
డా.సందీప్‌: మహిళలు నిత్యం వంటింట్లో పనిచేస్తుండటం, సరైన విశ్రాంతి తీసుకోకపోవడంతో ఎక్కువగా వెన్నునొప్పికి గురవుతుంటారు. ముఖ్యంగా 45 ఏళ్లపైబడిన వారిలో ఈస్ట్రోజన్‌ లెవల్స్‌ పెరుగుతాయి. ఈ వయస్సులో విశ్రాంతి ఎక్కువగా తీసుకోవాలి. పడుకునేందుకు వినియోగించే పరుపు బాగుండాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని