logo

ప్రజారోగ్య వ్యవస్థ ప్రక్షాళనకే తనిఖీలు

ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని వైద్య వ్యవస్థలో లోపాలను సవరించి నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్‌

Published : 30 Sep 2022 04:43 IST

దేవరకొండ పట్టణంలోని ఓ ప్రైవేటు  ఆసుపత్రిని తనిఖీ చేస్తున్న జిల్లా వైద్యాధికారి కొండల్‌రావు, తదితరులు

దేవరకొండ, న్యూస్‌టుడే: ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని వైద్య వ్యవస్థలో లోపాలను సవరించి నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్‌ ఎం.కొండల్‌రావు తెలిపారు. జిల్లాలోని మిర్యాలగూడ, నల్గొండ, దేవరకొండ డివిజన్లలో పది రోజులు నిర్వహించే స్పైషల్‌డ్రైవ్‌లో భాగంగా గురువారం దేవరకొండలో తనిఖీలు చేశారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో లోపాలను గుర్తించి వారికి షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తున్నట్లు చెప్పారు. ప్రైవేటు రంగంలోని సేవల్లో మార్పు తెచ్చేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నల్గొండ జిల్లాలోని 542 ప్రైవేటు ఆస్పత్రుల్లో ఐదు రోజుల్లో పది ల్యాబ్‌లు, రెండు ఎక్స్‌రే కేంద్రాలు సీజ్‌ చేశామని, 14 హాస్పిటల్స్‌కు షోకాజ్‌ నోటీసులు జారీచేసినట్లు తెలిపారు. లోపాలున్న ఆస్పత్రులను మూసివేయించి నాణ్యమైన సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో తగిన వైద్య, విద్యార్హతలు లేకపోవడం, సంబంధిత రంగం కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్‌ చేయించుకోకపోవడంలాంటి లోపాలను గుర్తించినట్లు తెలిపారు. ఒక డాక్టర్‌ పేరుతో అనుమతి పొంది మరొకరు విజిటింగ్‌ సేవలు అందించే వారికి కూడా షోకాజ్‌ నోటీసులు జారీచేస్తామన్నారు. ప్రతి ఆస్పత్రిలో విధిగా ధరల పట్టికను బహిరంగంగా ఉంచాలన్నారు. ఏ వైద్యసేవలకు ఎంత రుసుము తీసుకుంటారో స్పష్టంగా పేర్కొనాలని ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో కృష్ణకుమారి, డెమో రవిశంకర్‌, సామి, జిల్లా వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని