logo

రాష్ట్రంలో ఎటుచూసినా పచ్చదనమే: మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో దూసుకెళ్తున్న తెలంగాణ రాష్ట్రం జాతీయస్థాయిలో అనేక అవార్డులు సాధిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాకేంద్రం భువనగిరిలో

Published : 30 Sep 2022 04:43 IST

జిల్లా అటవీశాఖ అధికారిణి పద్మజారాణిని కుర్చీలో కూర్చోబెడుతున్న మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌, విప్‌ సునీత, ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి, తదితరులు

భువనగిరి, న్యూస్‌టుడే: అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో దూసుకెళ్తున్న తెలంగాణ రాష్ట్రం జాతీయస్థాయిలో అనేక అవార్డులు సాధిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాకేంద్రం భువనగిరిలో రెండెకరాల విస్తీర్ణంలో రూ.3.50 కోట్లతో నూతనంగా నిర్మించిన అటవీ అధికారుల కార్యాలయ సముదాయ భవనాన్ని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి గురువారం ఆయన ప్రారంభించారు. జిల్లా అటవీశాఖ అధికారిణి పద్మజారాణిని కుర్చీలో కూర్చోబెట్టారు. ఆవరణలో మొక్కలు నాటి నీళ్లు పోశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో 33 శాతం పచ్చదనం ఉండాలన్న సీఎం సంకల్పాన్ని పూర్తి చేసే దిశగా అటవీశాఖ యజ్ఞంలా తెలంగాణకు హరితహారం చేపడుతోందని, ఇప్పటికీ 24 నుంచి నాలుగు శాతం అడవులు పెరిగాయని, మిగిలిన శాతాన్ని పూర్తిచేసే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 17వేల నర్సరీలు ఏర్పాటుచేశామని, 230 కోట్ల మొక్కలు పెంచాలన్న లక్ష్యానికి 249 కోట్ల మొక్కలు నాటామని, వాటిలో 80శాతం బతికి ఉన్నట్లు చెప్పారు. ఫలితంగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా పచ్చదనం కనిపిస్తోందన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతంగా అమలుచేస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులను అభినందించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, పుర అధ్యక్షుడు ఎనబోయిన ఆంజనేయులు, రాష్ట్ర అటవీశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, రాష్ట్ర అటవీశాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ రాకేశ్‌మోహన్‌ డోబ్రియాల్‌, కలెక్టర్‌ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్‌ దీపక్‌తివారి, యాదాద్రి సర్కిల్‌ ఫారెస్ట్‌ కన్జర్వేటర్‌ శివాని డోగ్రా, రేంజ్‌ ఆఫీసర్‌ కిరణ్‌కుమార్‌ పాల్గొన్నారు.
ప్రొటోకాల్‌ పాటించలేదని నిరసన.. ప్రారంభోత్సవంలో అధికారులు ప్రొటోకాల్‌ పాటించలేదని భువనగిరికి చెందిన ప్రజాప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయమై భువనగిరి మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎనబోయిన ఆంజనేయులు అటవీశాఖ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఆహ్వాన పత్రికలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి పేరు పెట్టకపోవడంపై తెరాస శ్రేణులు మండిపడ్డారు. ఇదే విషయమై ఎమ్మెల్యే కూడా మంత్రుల వద్ద అసంతృప్తి వ్యక్తంచేసినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని