logo

పంపిణీ స్థలం ఓ చోట.. స్వాధీనం మరోచోట!

ప్రభుత్వ నిబంధనల ప్రకారం అసైన్డ్‌ కమిటీ సూచన మేరకు భూమి లేని నిరుపేదలు సేద్యం చేసుకుంటూ జీవనం పొందేలా వారికి చేయూతనివ్వడానికి గరిష్ఠంగా ఒక్కో కుటుంబానికి ఐదు ఎకరాల వరకు ప్రభుత్వ భూమిని పంపిణీ చేయవచ్చు.

Published : 30 Sep 2022 04:43 IST

అనర్హుల చేతిలో రూ. 10 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి

సర్వే నంబర్‌ 202లోని ప్రభుత్వ భూమి

కొండమల్లేపల్లి, న్యూస్‌టుడే: ప్రభుత్వ నిబంధనల ప్రకారం అసైన్డ్‌ కమిటీ సూచన మేరకు భూమి లేని నిరుపేదలు సేద్యం చేసుకుంటూ జీవనం పొందేలా వారికి చేయూతనివ్వడానికి గరిష్ఠంగా ఒక్కో కుటుంబానికి ఐదు ఎకరాల వరకు ప్రభుత్వ భూమిని పంపిణీ చేయవచ్చు. కానీ కొండమల్లేపల్లి మండలంలోని కొలుముంతలపహాడ్‌ గ్రామంలో అనర్హులకు విలువైన ప్రభుత్వ భూమిని పంపిణీ చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

కొలుముంతలపహాడ్‌లో సర్వే నంబర్‌ 202లో 295 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందులో 15 ఏళ్ల క్రితం 48 ఎకరాలను 28 కుటుంబాలకు పేదలనే కారణంతో పంపిణీ చేశారు. అప్పటి లబ్ధిదారుల్లో మూడు కుటుంబాలు ఆర్థికంగా ఉన్నప్పటికీ రాజకీయ ఒత్తిడితో ఓ కుటుంబంలో భర్తకు 5 ఎకరాలు, భార్యకు 2 ఎకరాలు, మరో రెండు కుటుంబాలకు నాలుగు ఎకరాల చొప్పున పంపిణీ చేశారు. ఈ 15 ఎకరాల విలువ ప్రస్తుతం రూ.10 కోట్లకు పైమాటే ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఇదంతా అప్పట్లో విధులు నిర్వహించిన ఓ కింది స్థాయి రెవెన్యూ ఉద్యోగి చొరవతో జరిగినట్లు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. పంపిణీ చేసిన ఆ భూమి సేద్యానికి అనుకూలంగా లేకపోవడం, రాళ్లు ఉండటంతో చాలా కుటుంబాలు నేటికీ సేద్యం చేయలేదు. కానీ ఇటీవల అందులో కొంత మంది వ్యక్తులు అప్పట్లో ప్రభుత్వం తమకు పట్టా ఇచ్చిందని చెబుతూ భూమిని స్వాధీనం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. అప్పట్లో ప్రభుత్వం రోడ్డుకు దూరంగా ఓ చోట పట్టాలు పంపిణీ చేస్తే వీరు మాత్రం రోడ్డుకు ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. స్థిరాస్తి వ్యాపారులతో కలిసి వ్యాపారం చేయటానికి పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని అనర్హులకు పంపిణీ చేసిన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు.

ప్రభుత్వ భూమిలో జరుగుతున్న నిర్మాణాలు


చర్యలు తీసుకుంటాం
- మందడి మహేందర్‌రెడ్డి, తహసీల్దార్‌, కొండమల్లేపల్లి

కొలుముంతలపహాడ్‌లో ప్రభుత్వం పంపిణీ చేసిన భూమిని, వివరాలను పరిశీలిస్తాం. అనర్హులుంటే అధికారుల సూచన మేరకు వారిపై చర్యలు తీసుకుంటాం. నిబంధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వ భూమిని పొందితే వారితో పాటు, వారికి సహకరించిన వారిపై సైతం కేసులు నమోదు చేసి భూమిని స్వాధీనం చేసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని