logo

సీఎం సారూ.. ఈ సమస్యలు పరిష్కరించరూ..

కృష్ణశిలతో నిర్మితమైన దివ్యధామం.. లక్ష్మీనారసింహులు కొలువుదీరిన భవ్య క్షేత్రం.. సీఎం కేసీఆర్‌ సంకల్పంతో నవ వైకుంఠంగా తీర్చిదిద్దారు. ఎన్ని వసతులు కల్పించినా ఇంకా చిన్నచిన్న సమస్యలతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.

Published : 30 Sep 2022 04:46 IST

- యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే

కృష్ణశిలతో నిర్మితమైన దివ్యధామం.. లక్ష్మీనారసింహులు కొలువుదీరిన భవ్య క్షేత్రం.. సీఎం కేసీఆర్‌ సంకల్పంతో నవ వైకుంఠంగా తీర్చిదిద్దారు. ఎన్ని వసతులు కల్పించినా ఇంకా చిన్నచిన్న సమస్యలతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. వీటిపై దృష్టిసారిస్తే మరిన్ని వసతులు మెరుగు కానున్నాయి. శుక్రవారం యాదాద్రి క్షేత్రానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రానున్న నేపథ్యంలో భక్తులకు కల్పించాల్సిన వసతులపై కథనం.    

రూ.కోట్ల ఖర్చుతో పునర్నిర్మించిన యాదాద్రి పుణ్యక్షేత్రంలో దైవదర్శనానికి ఆలయానికి వెళ్లే సముదాయంలో నడవ లేని వారి కోసం ఏర్పరచిన ఎస్కలేటర్‌ వినియోగంలో లేదు. ప్రత్యేక దర్శనం చేసుకోవాలని టికెట్‌ ఖరీదు చేసిన భక్తులకు ఎలా వెళ్లాలో తెలియని పరిస్థితి. గంటల కొద్దీ వేచి ఉండే రద్దీ రోజుల్లో అత్యవసర పరిస్థితుల్లో భక్తులు నానా యాతన పడుతున్నారు. ఆలయ సమీపాన మల, మూత్రశాలలు లేకపోవడంతో వారి బాధలు వర్ణనాతీతం. తాగునీటి సమస్యా నెలకొంది. అక్కడక్కడా తాగునీటి వనరులున్నా కొందరు ఇష్టపడక ఇబ్బందులు పడుతున్నారు. విశాల మాడ వీధులున్నా సేద తీరేందుకు నీడ సౌలభ్యం కానరాదు. షెడ్లు లేక వానకు తడవాల్సిందే.. ఎండకు ఎండాల్సిందే. బస్‌ బే ప్రాంగణం నుంచి ఆలయానికి చేరాలంటే ఆయాసం తప్పదు. సేద తీరి స్వామివారిని దర్శించుకునేలా సదుపాయం కల్పిస్తే భక్త జనానికి ఎంతో మేలు కాగలదని పలువురు ప్రముఖులు అంటున్నారు.


బస్సుల కోసం నిరీక్షణ

యాత్రికులకు కొండపైకి, కిందకు ఉచిత రవాణా కల్పించాలని, ఇందుకు ఆర్టీసీ సేవలు అందిస్తుందని స్వయాన సీఎం ఆలయ ఉద్ఘాటన దశలో వెల్లడించారు. కారణాలు ఏమిటో గాని ఆ సదుపాయం సన్నగిల్లింది. ప్రతి రెండు నిమిషాలకో బస్సు అని ఆదిలో చెప్పారు. ప్రస్తుతం అరగంట సేపు వేచి ఉండాల్సిందే. తమపై ఆర్థిక భారం పడుతోందని ఆలయ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ఈ కారణంగానే బస్సుల సంఖ్య తగ్గింది. 30 బస్సులకు బదులు 8 మాత్రమే నడుస్తున్నాయి. రాత్రి వేళల్లో వచ్చే యాత్రికుల కోసం రాయగిరి నుంచి యాదాద్రికి గల రహదారుల్లో ఏర్పర్చిన విద్యుత్తు దీపాల వెలుగులు కనుమరుగయ్యాయి. దీంతో ఆశయం అటకెక్కింది. విద్యుత్తు దీపాల బిల్లుల చెల్లింపుల సమస్యతో రహదారుల మధ్య కాంతులు చీకట్లుగా మారాయి. ఈ క్షేత్రాభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధ వహించిన ముఖ్యమంత్రి భక్తులకు ఎదురయ్యే ఇక్కట్లను తొలగిస్తే హర్షదాయకమే. కొండపైన ఆలయ పరిసరాల్లో కనీస వసతులపై దృష్టి పెట్టాల్సిన అవసరముంది. సామాన్య భక్తుల కోసం తగు ఏర్పాట్లు చేపట్టాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని