logo

ఆసరా అందాలంటే.. 85 కిలోమీటర్లు వెళ్లాల్సిందే..

ఈమె ఆసరా పింఛను కొత్త లబ్ధిదారు సావిత్రమ్మ. ఎక్కువ సమయం కూర్చోలేరు..  నిలబడ లేరు. ఒకరి సాయం ఉంటేనే అడుగులు వేస్తుంటారు. నకిరేకల్‌ నుంచి  దేవరకొండకు ఎలా వెళ్లి పింఛను డబ్బులు తీసుకోవాలని ఆవేదన చెందుతున్నారు.

Published : 03 Oct 2022 05:38 IST

ఈమె ఆసరా పింఛను కొత్త లబ్ధిదారు సావిత్రమ్మ. ఎక్కువ సమయం కూర్చోలేరు..  నిలబడ లేరు. ఒకరి సాయం ఉంటేనే అడుగులు వేస్తుంటారు. నకిరేకల్‌ నుంచి  దేవరకొండకు ఎలా వెళ్లి పింఛను డబ్బులు తీసుకోవాలని ఆవేదన చెందుతున్నారు.

నకిరేకల్‌, న్యూస్‌టుడే: ఏళ్లుగా ఎదురు చూస్తున్న పింఛను మంజూరైందన్న ఆనందం ఆవిరవుతోంది. జాబితాలో పేరున్నా..ఇతర లబ్ధిదారులు పింఛను డబ్బులు తెచ్చుకుంటున్నా.. వీరికి మాత్రం డబ్బులు చేతికి అందడం లేదు. పింఛను కోసం ఏళ్లుగా నిరీక్షించిన ఈ వృద్ధులు ఆ డబ్బుల కోసం రెండు నెలల నుంచి పడిగాపులు పడుతున్నారు. కొత్తగా మంజూరైన ఆసరా పింఛను డబ్బులు తీసుకునేందుకు వీరు 85 కిలోమీటర్ల దూరం వెళ్లాలని అధికారులు తాజాగా చెబుతుండటంతో వృద్ధులు హడలిపోతున్నారు. అసలు తాము పింఛను డబ్బులు కళ్లచూస్తామా? లేదా అనే ఆందోళన వారిని వెంటాడుతోంది. నకిరేకల్‌ పురపాలికకు గడిచిన ఆగస్టులో 580 కొత్త ఆసరా పింఛన్లు మంజూరయ్యాయి. వీరిలో 140 మంది వృద్ధుల పేర్లు దేవరకొండ పురపాలిక పరిధిలోకి వెళ్లడంతో నేటికీ పింఛను అందలేదు. వాటిని నకిరేకల్‌ పురపాలిక పరిధికి మార్చుచేయిస్తామని గతంలో అధికారులు లబ్ధిదారులకు చెప్పి సముదాయించారు. మార్పు అమలులో జాప్యం జరుగుతుండటంతో ఈ 140 మంది దేవరకొండకు వెళ్లి పింఛను డబ్బులు తీసుకోవాలని శనివారం పుర అధికారులు సమాచారం ఇవ్వడంతో వృద్ధుల్లో ఆందోళన మొదలైంది. నకిరేకల్‌ నుంచి దేవరకొండ 85 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాను పోను 170 కిలోమీటర్లు వృద్ధులు ప్రయాణించాల్సి ఉంటుంది. అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధులు అద్దెవాహనంలో దేవరకొండకు వెళ్లి వచ్చేందుకు రూ.వెయ్యికిపైగా ఖర్చవుతుంది. పింఛను మంజూరై రెండు నెలలవుతోంది. వరుసగా మూడునెలల పాటు పింఛను డబ్బులు తీసుకోకుంటే రద్దయ్యే ప్రమాదం ఉన్నందున ఈ సారికి దేవరకొండకు వెళ్లాల్సిందేనని అధికారులు స్పష్టం చేస్తుండటం గమనార్హం. ఇంత దూరం నుంచి దేవరకొండకు వెళ్లే తమకు అక్కడ నిరీక్షణ లేకుండా వెంటనే డబ్బులు ఇచ్చేలా పుర అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని పలువురు లబ్ధిదారులు కోరుతున్నారు.

సాంకేతిక సమస్యతోనే.. : ఎన్‌.బాలాజీ, కమిషనర్‌, పురపాలిక, నకిరేకల్‌
సాంకేతిక సమస్య కారణంగానే ఈ పురపాలికకు చెందిన 140 మంది ఆసరా అబ్ధిదారుల పేర్లు దేవరకొండ పురపాలిక పరిధిలోకి వెళ్లాయి.దీనిని సరిచేయలని డీఆర్‌డీఏ, మెప్మా అధికారులను కోరాం. దేవరకొండ, గాంధీనగర్‌ పోస్టాఫీసుల్లో వీరికి పింఛను డబ్బులు అందజేస్తారు. పనిదినాల్లో వెళ్లి తీసుకోవాలని కోరుతున్నాం. త్వరలో సమస్య పరిష్కారమవుతుంది. అక్కడ ఏమైనా సమస్య ఉంటే అక్కడి పుర అధికారులను సంప్రదించాలని సూచించాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని