logo

లక్ష్యంపై గురి ఉంటే విజయం తథ్యం

చదువుల విషయంలో తల్లిదండ్రులు కూతుళ్లపై వివక్ష చూపేవారు. పెళ్లి జరిపించి అత్తింటికి పంపించే అమ్మాయికి పెద్ద చదువులు ఎందుకనే భావన ఉండేది. కాలంతోపాటే ఇప్పుడు అది మారిపోయింది.

Updated : 03 Oct 2022 06:17 IST


చండూరు సబ్‌రిజిస్ట్రార్‌ అనూష

చండూరు, నకిరేకల్‌, న్యూస్‌టుడే: చదువుల విషయంలో తల్లిదండ్రులు కూతుళ్లపై వివక్ష చూపేవారు. పెళ్లి జరిపించి అత్తింటికి పంపించే అమ్మాయికి పెద్ద చదువులు ఎందుకనే భావన ఉండేది. కాలంతోపాటే ఇప్పుడు అది మారిపోయింది. అమ్మాయిలను ప్రోత్సహిస్తే అబ్బాయిలను మించి రాణించగలరని ఎందరో రుజువు చేశారు. కుమారులను కష్టపడి చదివిస్తే వారు ప్రయోజకులు అవుతారో లేరో కాని ఆడపిల్లలను చదివిస్తే మాత్రం వారు తప్పకుండా ఏదో ఒకటి సాధించి చూపిస్తారు. మనం చేయాల్సిందల్లా వారిని ప్రోత్సహించటమే. మేమున్నాం అని భరోసా కల్పించటమే.

ఏడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువతి
ప్రస్తుతం చండూరు సబ్‌రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న అనూష ఏకంగా ఏడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఈమెది సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం, కొండాపురం. ఈమె తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఆయనకు చదువు విలువ తెలుసు. అనూషకు అక్క, తమ్ముడు ఉన్నారు. అనూష చిన్నతనం నుంచి బాగా చదువుల్లో రాణించారు. తండ్రి ఆమెలోని ప్రతిభను గుర్తించారు. ఆమె ఇష్టానికి అనుగుణంగా ప్రోత్సహించారు. బీటెక్‌ చదివిన అనూష హైదరాబాదులో 2015లో విప్రోలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా చేరింది. కానీ ఆమె ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యం పెట్టుకుంది. ఆశయానికి తగ్గట్టుగా పట్టుదలతో చదివారు. 2016లో వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడటంతో వాటికి దరఖాస్తు చేశారు. తదేక దీక్షతో చదవడంతో స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌లో స్టెనోగ్రాఫర్‌, సివిల్‌, ఆబ్కారీ కానిస్టేబుల్‌, ఫారెస్టు రేంజర్‌, బీట్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు వచ్చాయి. కానీ అందులో ఆమె చేరలేదు. 2017లో సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగానికి ఎంపికై శిక్షణ పూర్తి చేసుకొని 2019లో త్రిపురారం మండలంలో ఎస్సైగా విధులు నిర్వర్తించారు. ఆతర్వాత గ్రూపు-2 ఫలితాల్లో సబ్‌రిజిస్ట్రార్‌ ఉద్యోగం రావటంతో ఎస్సై జాబ్‌ వదిలివేసి ప్రస్తుతం సబ్‌ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఓ ఎస్సైని వివాహం చేసుకున్నారు. ఆమెకు ఒక బాబు ఉన్నారు. ఎస్సైగా విధులు నిర్వర్తిస్తే గ్రూప్‌-1 లేదా సివిల్స్‌ లాంటి తన లక్ష్యం చేరుకోవటంలో ఆటంకం ఉంటుందని సబ్‌ రిజిస్ట్రార్‌ ఉద్యోగం చేస్తున్నానని, భవిష్యత్తు తన లక్ష్యం చేరుకుంటానని అనూష ధీమాగా ఉన్నారు. ఫలితం కోసం ఆలోచించకుండా పట్టు వదలకుండా ప్రయత్నిస్తే విజయం దానంతట అదే వరిస్తుందని అనూష చెబుతున్నారు. ఉద్యోగ ప్రయత్నం చేసే యువతీ యువకులు ముందు తమ గమ్యాన్ని పక్కగా ఎంపిక చేసుకోవాలని, ఆ తర్వాత ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగాలని సూచిస్తున్నారు. చదువుకు పెళ్లి, పేదరికం, కష్టాలు వంటివి ఏవీ అడ్డుకాదని అనుకుంటే ఏదైనా సాధ్యమే అని పేర్కొంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని