logo

ఆగిన చేనేతమిత్ర

చేనేత వృత్తిని ప్రోత్సహించేందుకు 2017లో రాష్ట్ర ప్రభుత్వం ‘చేనేత మిత్ర’ పథకాన్ని ప్రవేశపెట్టింది. చేనేత వస్త్రాల తయారీకి ఉపయోగించే నూలు, రంగులు, రసాయనాలపై ఈ పథకం ద్వారా 40 శాతం రాయితీ కల్పిస్తారు. కానీ నిబంధనలు కఠినంగా ఉండటంతో అర్హుల్లో నాలుగోవంతు మంది కూడా ఈ రాయితీ పొందడం లేదు.

Updated : 04 Oct 2022 06:26 IST

రెండున్నర నెలలుగా నిలిచిన రాయితీ దరఖాస్తులు

మగ్గం నేస్తున్న చేనేత కార్మికులు 

చౌటుప్పల్, న్యూస్‌టుడే: చేనేత వృత్తిని ప్రోత్సహించేందుకు 2017లో రాష్ట్ర ప్రభుత్వం ‘చేనేత మిత్ర’ పథకాన్ని ప్రవేశపెట్టింది. చేనేత వస్త్రాల తయారీకి ఉపయోగించే నూలు, రంగులు, రసాయనాలపై ఈ పథకం ద్వారా 40 శాతం రాయితీ కల్పిస్తారు. కానీ నిబంధనలు కఠినంగా ఉండటంతో అర్హుల్లో నాలుగోవంతు మంది కూడా ఈ రాయితీ పొందడం లేదు. చేనేతమిత్ర అమలును కార్వే టెక్నాలజీస్‌ సాంకేతికతతో అమలు చేస్తున్నారు. ఈ సంస్థ వివాదాల్లో చిక్కుకుని.. చేనేత మిత్ర వెబ్‌సైట్‌ తెరుచుకోవడం లేదు. దీంతో రెండున్నర నెలల నుంచి పథకం అమలు పూర్తిగా నిలిచిపోయింది.  

అర్హుల్లో కొందరికే గుర్తింపు

రాష్ట్ర ప్రభుత్వం ‘కార్వే’ టెక్నాలజీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని మగ్గాన్ని, దాన్ని నేసే కార్మికుడిని కలిపి జియోట్యాగింగ్‌ చేయించింది. ఆ మగ్గానికి ఒక బార్‌కోడ్, కార్మికుడికి ఒక గుర్తింపు కార్డు అందించింది. ఇంట్లో మగ్గం ఉన్నా దానిపై వస్త్రం నేయని వారిని చేనేత కార్మికులుగా గుర్తించలేదు. దీంతో రాష్ట్రంలో కేవలం 24 వేల మగ్గాలకు మాత్రమే జియోట్యాగింగ్‌ చేసి వాళ్లనే ప్రభుత్వ పథకాలకు అర్హులుగా ప్రకటించారు. ఒక మగ్గంపై వస్త్రం నేయడానికి ముందుగా అనుబంధ పనులు కుటుంబ సభ్యులంతా కలిసి చేస్తుంటారు. ‘చేనేత మిత్ర’ పథకంలో లబ్ధి పొందడానికి ఒక జియోట్యాగ్‌ మగ్గానికి ఒకరిని మాత్రమే అనుబంధ కార్మికుడిగా నమోదు చేసుకోవాలనే ఆంక్షలు విధించారు. దీంతో రాష్ట్రంలో 24 వేల మంది మగ్గం నేసే కార్మికులు, మరో 24 వేల మంది అనుబంధ పనులు చేసే సహాయకులు మాత్రమే ఈ వృత్తిదారులుగా పరిమితం చేశారు. దీంతో లక్షకు పైగా ఉన్న చేనేత వృత్తిదారుల్లో సగానికిపైగా తమను ప్రభుత్వం గుర్తించలేదనే ఆవేదనతో ఉన్నారు. 

రాయితీ పొందాలంటే..

చేనేత మిత్ర పథకంలో నూలు రాయితీ పొందే నిబంధనలు కఠినంగా ఉన్నాయి. కార్మికులు ఒక గ్రూప్‌ ఏర్పాటు చేసుకుని ఆన్‌లైన్‌లో రిజిష్టరు చేసుకోవాలి. ఎన్‌హెచ్‌డీసీ కేంద్రంలో లేదా వారి లైసెన్సు పొందిన వ్యాపారుల వద్ద ఆన్‌లైన్‌లో నగదు చెల్లించి నూలు కొనుగోలు చేయాలి. ఆ బిల్లును టీఎస్‌ హైండ్లూమ్స్‌లో కార్వే నిర్వహించే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఆ ముడి సరకుతో ఎన్ని చీరలు నేశారు, అనుబంధ కార్మికులకు ఎంత వేతనం ఇచ్చారు. మగ్గం నేసిన కార్మికుడికి ఎంత కూలి లభించిందనే వివరాలను 45 రోజుల తర్వాత చేనేత, జౌళిశాఖ జిల్లా సహాయ సంచాలకుడికి లాగిన్‌ అయి నమోదు చేయాలి. దాన్ని ఆ కార్యాలయం వారు ధ్రువీకరించాక ప్రింటు తీసి ఒరిజినల్‌ బిల్లుతో కలిసి జిల్లా కేంద్రంలోని ఏడీ కార్యాలయంలో అందజేయాలి. అక్కడి నుంచి ఓ అధికారి చేనేత కార్మికుడి ఇంటికొచ్చి  విచారణ జరిపి ఏడీకి నివేదిక సమర్పిస్తారు. అన్నీ సక్రమంగా ఉంటే నూలు రాయితీ విడుదల చేయాలని ఆయన ఆన్‌లైన్‌లో కమిషనర్‌ కార్యాలయానికి సిఫార్సు చేస్తారు. అక్కడ్నుంచి 15 రోజుల్లో రాయితీ డబ్బు చేనేత కార్మికుడి బ్యాంకు ఖాతాలో జమ చేయాలనే నిబంధన ఉంది. 6 నుంచి 8 నెలలైనా రాయితీ డబ్బు ఖాతాల్లో జమ కావడం లేదు. 

కొత్త సాఫ్ట్‌వేర్‌ తయారవుతోంది - వెంకటేశం, ఆర్‌డీడీ, చేనేత, జౌళిశాఖ

చేనేత కార్మికుల జియో ట్యాగింగ్, గుర్తింపు కార్డులు, చేనేతమిత్ర పథకం అమలు కార్వే టెక్నాలజీస్‌ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుని అమలు చేస్తున్నది. ఆ సంస్థ సమస్య వల్ల చేనేతమిత్ర సర్వర్‌ పని చేయడం లేదు. ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. కార్వే నుంచి మాస్టర్‌ డేటాను తీసుకుంటున్నాం. నిబంధనలను సులభతరం చేసి అర్హత ఉన్న చేనేత కార్మికులంతా ఈ పథకాన్ని వినియోగించుకునేలా కొత్త సాఫ్ట్‌వేర్‌ రూపొందించి టీఎస్‌ ఆన్‌లైన్‌ సంస్థ ద్వారా నిర్వహించేందుకు కసరత్తు జరుగుతోంది.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని