logo

అమ్మవారు.. అభయమిస్తూ..

సృష్టిలో తల్లిని మించిన దైవం లేదు అంటారు. అలాంటి అమ్మ రూపంలో విజయాలను అందించే విజయదుర్గగా అమ్మవారు పూజలను అందుకుంటోంది. అమ్మలగన్న అమ్మ కనకదుర్గమ్మ ప్రతి ఇంటిలో ‘అమ్మ’ రూపంలో కొలువై ఉంది.

Published : 05 Oct 2022 05:59 IST

చిట్యాల, న్యూస్‌టుడే

సృష్టిలో తల్లిని మించిన దైవం లేదు అంటారు. అలాంటి అమ్మ రూపంలో విజయాలను అందించే విజయదుర్గగా అమ్మవారు పూజలను అందుకుంటోంది. అమ్మలగన్న అమ్మ కనకదుర్గమ్మ ప్రతి ఇంటిలో ‘అమ్మ’ రూపంలో కొలువై ఉంది. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతి రోజు ఒక అవతారంగా కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తోంది. బుధవారం విజయదశమి నవరాత్రుల ముగింపు సందర్భంగా దుర్గాదేవి అవతారాలపై కథనం.


ఆకలి తీర్చేతల్లి అన్నపూర్ణ

భూమిని తల్లితో పోలుస్తారు. భూమాతకు ఓపిక ఎక్కువ అంటారు. తన పిల్లలైన ప్రజలకు శరీరాన్ని కప్పుకునే వస్త్రం నుంచి బతకడానికి అవసరమైన ఆహారం వరకు కావాల్సినవి ఏమిటో తెలుసుకనక తానే ఉత్పాదక శక్తిగా మారి సమస్త ఆహారధాన్యాన్ని, పప్పుదినుసులను, ఇతర సమస్త రకాల పంటలను ఉత్పత్తిచేసి మనకు అందిస్తుంది. ఇంట్లో చిన్నాపెద్దా ఆకలిని గుర్తెరిగి ప్రేమగా కొసరి, కొసరి వడ్డిస్తుంది. జీవన చరమాంకంలో మృత్యువుకు లొంగిపోయిన మనల్ని తుదకు తనలోనే కలుపుకుంటుంది.


జ్ఞాననేత్రి సరస్వతి

సమాజంలో, సన్మార్గంలో జీవించడానికి చక్కని జ్ఞానం అవసరం. జీవితంలో సన్మార్గంలో పయనించడానికి మంచి ఆలోచనలూ కావాలి. అలాంటి ఆలోచనలు, జ్ఞానాన్ని అందించే తల్లి సరస్వతి. ఇంట్లో అమ్మ కూడా చిన్ననాటి నుంచి విద్యాబుద్ధులతోపాటు సమాజంలో మన నడవడిక గురించి చాలా జాగ్రత్తలు నేర్పుతుంది. మనం జ్ఞాన సంపన్నులమై ఎంతో ఎత్తు ఎదగడానికి, సమాజామోదం పొందే విధానాలను, పద్ధతులను అమ్మ చిన్నప్పటినుంచే మనకు నూరిపోస్తుంది. సరస్వతి అమ్మవారి వాహనం హంస. పాలల్లో కలిసిన నీటిని వేరుచేసి పాలుమాత్రమే తాగగలిగే సామర్థ్యం ఒక్క హంసకు మాత్రమే ఉంది. మంచి, చెడును వేరు చేసి, విడమరిచి చెపుతూ అమ్మ మనల్ని సన్మార్గంలో ప్రయాణించే జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది.


సిరిలిచ్చే మహాలక్ష్మి

సిరిసంపదలను, సుఖశాంతులను కలిగిస్తుంది మహాలక్ష్మి దేవి. సిరిసంపదలు మనతో ఉండాలంటే ఇంట్లో అమ్మకే వాటిని కాపాడే బాధ్యత తెలుస్తుంది. రైతు పంటలు పండించి, మంచి దిగుబడులు సాధించి, వాటిని విక్రయించడం ద్వారా లాభాలు పొందినా, రైతుల నుంచి తాను కొనుగోలు చేసిన సరకులను మార్కెట్లో విక్రయించి వ్యాపారి లాభాలు గడించినా అది లక్ష్మిదేవి చలవే. ఇంట్లో అమ్మ కూడా లక్ష్మిదేవిరూపమే. ఆమెను అంత గౌరవంతో చూసుకోవాలి.


దన్నుగా నిలిచే మహిషాసుర మర్ధిని

చిన్నపుడు మనకు ఏ చిన్న దెబ్బ తగిలినా తనకే తగిలినంత బాధపడుతుంది అమ్మ. అలాంటి విషయాల్లో నాన్నకన్నా అమ్మే మనకోసం ముందుకు వస్తుంది. మనకు ఎలాంటి కష్టాలు వచ్చిన అడ్డంగా నిలిచి వాటిని పారదోలి మనకు రక్షణ కల్పించే అమ్మ మహిషాసుర మర్ధిని. మహిషుడు అనే రాక్షసుడిని సంహరించి అతనినుంచి ప్రజల కష్టాలను దూరం చేసినట్లే, మనం పుట్టిన నాటినుంచి జీవితంలో ఉన్నతస్థితికి ఎదిగే వరకు ఎదురయ్యే కష్టనష్టాలలో మనకు దన్నుగా నిలిచి మనల్ని ఉన్నతస్థానంలో కూర్చోబెట్టేవరకు విశ్రమించదు అమ్మ.


స్ఫూర్తినిచ్చే రాజరాజేశ్వరి

అన్ని రకాల దుష్టశక్తులపై పోరాడి విజయతీరాన్ని చేరుస్తుంది రాజరాజేశ్వరి అమ్మ. అందుకు అవసరమైన ధైర్యాన్నిస్తుంది. పరిపాలకులకు దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేసే సామర్థ్యాన్ని కలిగిస్తుంది. విద్యార్థులు విద్యాభ్యాసంలో విజయకేతనం ఎగురవేసేందుకు అవసరమైన స్ఫూర్తిని అమ్మ కలిగిస్తుంది. ఆ మేరకు విజయాల చేకూరేలా మనలో ప్రేరణను నింపుతుంది.


ఆత్మవిశ్వాసాన్ని నింపే గాయత్రి

బ్రహ్మ సృష్టించిన వాక్కు(మంత్రం)నుంచి వచ్చిన రూపమే గాయత్రిదేవి. చెడుకు భయపడకుండా, అటువైపే వెళ్లకుండా మనలో ఆత్మ సంతృప్తిని, మంచి ఆలోచనను కలిగిస్తుంది. ఇంట్లో మనలో దాగి ఉన్న ప్రతిభను మొదటగా గుర్తించేది అమ్మమాత్రమే. మన శక్తి మనకు తెలియక ఏపని చేయాలన్నా వెనుకాముందు తచ్చాడుతుంటే, నీలో దాగిఉన్న శక్తిని నీకు తెలియపరిచే శుభసూచకమైన అమ్మ రూపమే గాయత్రి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని