logo

పంటలపై అధిక వర్ష ప్రభావం

అధిక వర్షం పంటలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నీట మునిగిన పంటలను చూసి రైతులు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. వరిపైరు ఎక్కువ సేపు నీటిలో మునిగినా పండ్లు, కూరగాయలు, మెట్ట పంటల్లో నీరు నిలిచినా చీడపీడలు ఆశించడంతో పాటు పోషకాలు కోల్పోయే ప్రమాదం

Published : 05 Oct 2022 06:12 IST

సస్యరక్షణ చర్యలతో మేలు


గరిడేపల్లి: పత్తిచేనులో కొమ్మల వరకు నిలిచిన నీరు

గరిడేపల్లి, న్యూస్‌టుడే: అధిక వర్షం పంటలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నీట మునిగిన పంటలను చూసి రైతులు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. వరిపైరు ఎక్కువ సేపు నీటిలో మునిగినా పండ్లు, కూరగాయలు, మెట్ట పంటల్లో నీరు నిలిచినా చీడపీడలు ఆశించడంతో పాటు పోషకాలు కోల్పోయే ప్రమాదం ఉందని గడ్డిపల్లి కేవీకే ఉద్యాన విభాగం శాస్త్రవేత్త సీహెచ్‌ నరేశ్‌, మృత్తికా విభాగం శాస్త్రవేత్త అరిగెల కిరణ్‌ చెబుతున్నారు. వివిధ పంటల సస్యరక్షణ చర్యలను ‘న్యూస్‌టుడే’కు వివరించారు. ఈ రెండు, మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ అంచనాల మేరకు ప్రత్యేక కథనం.


మొక్కల పెరుగుదల తగ్గడం, పూతరాలడం, ఎండు తెగులు, బూజు తెగులు వంటివి ఆశిస్తాయి. దీనివల్ల పంట ఎదుగుదల ఆలస్యమవుతుంది. నాసిరకం మొక్కలతో దిగుబడి తగ్గుతుంది. దీని నివారణకు స్థూల పోషకాలు 19:19:19 లేదా 13:0:45తో పాటు సూక్ష్మపోషకాలు ఇనుము, మెగ్నీషియం, బోరాన్‌, పొటాషియం, జింకు పిచికారి చేయాలి. భూమిపై కాకుండా నేరుగా ఆకుల ద్వారా మొక్కకు బలం అందించాలి. నేల కొంత ఆరిన తర్వాత తగిన మోతాదులో రసాయన ఎరువులందించాలి. అప్పటికే తెగుళ్లు సోకితే నివారణ మందులు పిచికారి చేయాలి. లేత జామ తోటల్లో నీటిని తీసేసి గొర్రుతో దున్నాలి. తేలికగా చెట్టు చుట్టూ పాదులు తవ్వాలి. మొదళ్ల దగ్గర కాపర్‌ ఆక్సిక్లోరైడ్‌ 3 గ్రాముల మందును లీటరు నీటిలో కలిపి పాదులో పోయాలి. పొటాషియం నైట్రేట్ 10 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.


* ప్రస్తుతం వరి పంట చిరుపొట్ట, పొట్ట దశలో ఉంది. వరిపైరు నీటిలో మునిగినపుడు బురద నీరు పొట్టలోకి వెళ్తుంది. కొంతమేర ఆకులపై ఉంటుంది. దానివల్ల పొట్టకుళ్లుడు, గింజపోసుకోకపోవడం, మెడవిరుపు తెగులు, గింజమచ్చ, పాముపొడ వంటివి ఆశిస్తాయి. కంకి గింజ పోసుకోక పొట్టలోనే కుళ్లిపోతుంది. అందుకే గట్లకు గండ్లు పెట్టి అవసరమైతే జాలు కాల్వలు తీసుకుని నీటిని బయటకు పంపించాలి. వర్షం తగ్గాక ఎకరాకు 25 కిలోల యూరియా, 15 కిలోల పొటాష్‌ ఎరువులు వేసుకోవాలి. పాలిఫీడ్‌ (19:19:19) లేదా మల్టీకే (13:0:45)తో పాటు యూరియా 20 గ్రాములు కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయటం వల్ల వరి పైరు పెరుగుదలలో వేగం పుంజుకుంటుంది. కొద్దిగా నీరు వెళ్లినా మొగి కన్పించినంత మొక్క ఉంటే సూక్ష్మపోషకాలు పిచికారి చేయాలి. గింజ పోసుకుంటే తర్వాత మందులు వాడినా ప్రయోజనం ఉండదు. నేల ద్వారా ఆశించే తెగుళ్ల నివారణకు 3 గ్రాముల కాపర్‌ఆక్సిక్లోరైడ్‌ లేదా 2 గ్రాముల కార్బండిజమ్‌ మందును మ్యాంకోజెబ్‌ అనే శిలీంద్ర నాశినితో కలిపి నేల మొత్తం తడిచేలా పిచికారి చేయాలి.


తీసుకోవాల్సిన జాగ్రత్తలు

* బొప్పాయి తోటల్లో పాదుల వద్ద నీరు తీసేసి మోటాలాక్సిల్‌ 3 గ్రాములను లీటరు నీటిలో కలిపి మొదళ్ల దగ్గర పోయాలి. 2 గ్రాముల సూక్ష్మపోషకాల మిశ్రమాన్ని లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

* మామిడి తోటల్లో లేత మొక్కలు ఒరిగినా, పడిపోయినా లేపి మట్టిని ఎగదోయాలి. గాలికి విరిగిన కొమ్మలను పైభాగాన కత్తిరించి బోర్డాక్స్‌ పేస్ట్‌ రాయాలి.

Read latest Nalgonda News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని