logo

ఇంటింటి ప్రచారంపై దృష్టి

ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఇప్పటి వరకు సమీక్షలు, సమ్మేళనాలు చేసిన ప్రధాన పార్టీలు తాజాగా ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల కావడంతో ఇంటింటి ప్రచారంపై దృష్టి సారించాయి. ఇప్పటికే అన్ని పార్టీలు ఒక దఫా ప్రచారాన్ని పూర్తి చేయగా... అభ్యర్థుల వారీగా మాత్రం ఒక్క కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే గడపగడపకు తిరిగి ఓట్లు అభ్యర్థిస్తోంది.

Published : 05 Oct 2022 06:12 IST

మునుగోడులో వేగం పెంచిన ప్రధాన పార్టీలు

ఈనాడు, నల్గొండ: ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఇప్పటి వరకు సమీక్షలు, సమ్మేళనాలు చేసిన ప్రధాన పార్టీలు తాజాగా ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల కావడంతో ఇంటింటి ప్రచారంపై దృష్టి సారించాయి. ఇప్పటికే అన్ని పార్టీలు ఒక దఫా ప్రచారాన్ని పూర్తి చేయగా... అభ్యర్థుల వారీగా మాత్రం ఒక్క కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే గడపగడపకు తిరిగి ఓట్లు అభ్యర్థిస్తోంది. అధికార తెరాస ఇప్పటి వరకు మండలాల వారీగా ముఖ్య నాయకులు, కార్యకర్తలకు గెలుపు వ్యూహాలపై దిశానిర్దేశం చేయగా... బుధవారం విజయదశమి సందర్భంగా పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తారనే అంచనాల నేపథ్యంలో త్వరలోనే ఇంటింటి ప్రచారాన్ని మొదలుపెట్టనుందని తెలిసింది. ఎంపీటీసీ స్థానం వారీగా ఒక్కో ఎమ్మెల్యేకు బాధ్యతలు అప్పగించిన తెరాస... ఆ మేరకు 6వ తేదీ నుంచి సుమారు 80 మంది వరకు ఎమ్మెల్యేలు నియోజకవర్గంలోనే మకాం వేయనున్నారు. వీరికి ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు సమన్వయం చేయనున్నారు. ఒకవైపు ప్రభుత్వ పథకాలు, మరోవైపు కేంద్రం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను జనాల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జ్‌లకు ఆదేశాలు అందాయి. ఆ మేరకు మండలాల వారీగా సమీక్షలు చేసి క్షేత్రస్థాయిలో గ్రామాల్లో ప్రచారంలో పాల్గొననున్నారు.


కేంద్ర మంత్రులతో మరో బహిరంగ సభ!

ఉప ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్న భాజపా సైతం ఇప్పటి వరకు మండలాలు, గ్రామాల వారీగా ముఖ్య నాయకులు, కార్యకర్తలతో వ్యూహాలపై చర్చించింది. పార్టీ చేరికల కమిటీ ఛైర్మన్‌, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో పాటు స్టీరింగ్‌ కమిటీ ఛైర్మన్‌ వివేక్‌ నియోజకవర్గంలోనే ఉండి పరిస్థితులను సమన్వయపరుస్తున్నారు. త్వరలోనే చండూరు లేదా మునుగోడుల్లో కేంద్ర మంత్రులతో మరోసారి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనుందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత రానుంది. పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సైతం ఇంటింటి ప్రచారాన్ని రెండు మూడు రోజుల్లో ప్రారంభించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పార్టీ గెలుపు వ్యూహాలపై చర్చించేందుకు ఈ నెల 8న ఉప ఎన్నిక స్టీరింగ్‌ కమిటీ మునుగోడులో సమావేశం కానుంది. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌, జాతీయ ప్రధాన కార్యదర్శులు సునీల్‌ బన్సల్‌, తరుణ్‌చుగ్‌ హాజరుకానున్నారు.


ప్రచార వ్యూహంపై కసరత్తు

రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర ఉప ఎన్నిక పోలింగ్‌ సమయంలో రాష్ట్రంలోనే ఉండనుండటంతో ఆయనతో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయాలని టీపీసీసీ ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ మేరకు ఉప ఎన్నికల్లో పరిస్థితిపై రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఉమ్మడి జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు మంగళవారం హైదరాబాద్‌లో చర్చించారు. సంస్థాగతంగా నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ పటిష్ఠంగా ఉందని, పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులను పోలింగ్‌బూత్‌కు తీసుకువచ్చి ఓటు వేసే విధంగా క్షేత్రస్థాయి ఇన్‌ఛార్జులు కృషి చేయాలని సమావేశంలో తీర్మానించినట్లు సమాచారం. ఇప్పటి వరకు జరిగిన ప్రచార తీరును తెలుసుకొని రానున్న రోజుల్లో ప్రచారం ఎలా ఉండాలనే వ్యూహంపై పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి దిశానిర్దేశం చేశారు. స్థానిక ఎంపీ, పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సైతం ప్రచారంలో పాల్గొంటారని పాల్వాయి స్రవంతి ‘ఈనాడు’కు వెల్లడించారు.

Read latest Nalgonda News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని