logo

మునగాలలో భారీ చోరీ

మండల కేంద్రంలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగిన సంఘటన ఆదివారం అర్థరాత్రి చోటుచేసుకుంది. ఎస్సై లోకేష్‌, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం..

Published : 29 Nov 2022 06:13 IST

18 తులాల బంగారం, 5 కేజీల వెండి, 41 వేల నగదు అపహరణ
సీసీ కెమెరాల హార్డ్‌డిస్క్‌లను తీసుకెళ్లిన దొంగలు

మునగాల, న్యూస్‌టుడే: మండల కేంద్రంలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగిన సంఘటన ఆదివారం అర్థరాత్రి చోటుచేసుకుంది. ఎస్సై లోకేష్‌, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన వాసా శ్రీనివాసరావు, కళావతి దంపతులు గురువారం హైద్రాబాద్‌ నగరంలో ఉంటున్న తన కూతురు ధనలక్ష్మీ ఇంటికి వెళ్లారు. ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలకు చరవాణితో లింక్‌ ఉండటంతో ప్రతిరోజు చరవాణిలో చూసుకునేవారు. ఆదివారం రాత్రి 10.30 వరకు చరవాణిలో పరిశీలించారు. సోమవారం ఉదయం 10 గంటల సమయంలో చరవాణిలో చూడగా సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో, గ్రామంలో ఉన్న సోదరుడి కుమారుడు ధనుష్‌ను వెళ్లి చూడమని కోరారు. అతడు వెళ్లి పరిశీలించగా ఇంటి తాళాలు పగులగొట్టి చోరీ చేసినట్లు గమనించి, సమాచారాన్ని శ్రీనివాస్‌రావుకు తెలియజేశాడు. వెంటనే హైదరాబాద్‌ నుంచి మునగాలకు చేరుకొని ఇంటిని పరిశీలించి, సీఐ ఆంజనేయులుకు సమాచారాన్ని అందజేశారు. ఆయన  ఘటనా స్థలాన్ని పరిశీలించి, జిల్లా కేంద్రం నుంచి క్లూస్‌టీమ్‌ను రంగంలోకి దింపారు. సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. తెలివిగా దొంగలు వెళ్లేటప్పడు ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల హార్డ్‌డిస్క్‌ను తీసుకెళ్లారు. ఇంట్లోని పడకగది కబోర్డులోని నాలుగు స్టీలు డబ్బాల్లో ఉన్న 18 తులాల బంగారం, 5 కేజీల 265 గ్రాముల వెండి ఆభరణాలు, రూ.41 వేల నగదు చోరీకి గురైనట్లు బాధితుడు ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నట్లు ఎస్సై లోకేష్‌ తెలిపారు. బాధితుడు వాసా శ్రీనివాసరావు శివాలయ ఛైర్మన్‌గా కొద్ది సంవత్సరాలుగా పనిచేస్తున్నారు.

Read latest Nalgonda News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని