logo

సీఎం పర్యటన సందర్భంగా కాంగ్రెస్‌ ఆందోళన

సీఎం కేసీఆర్‌ యాదాద్రి పవర్‌ప్లాంటు పనుల పరిశీలనకు వచ్చిన సందర్భంగా నిరసన తెలిపిన కాంగ్రెస్‌ నాయకులను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు.

Published : 29 Nov 2022 06:18 IST

డీసీసీ అధ్యక్షుడు, నాయకుల అరెస్టు

పవర్‌ప్లాంటు సమీపంలో ఆందోళన చేస్తున్న డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌, నాయకులు

దామరచర్ల,  తిరుమలగిరి(సాగర్‌), న్యూస్‌టుడే: సీఎం కేసీఆర్‌ యాదాద్రి పవర్‌ప్లాంటు పనుల పరిశీలనకు వచ్చిన సందర్భంగా నిరసన తెలిపిన కాంగ్రెస్‌ నాయకులను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. పవర్‌ప్లాంటు వద్దకు వస్తుండగా మార్గమధ్యలో డీసీసీ అధ్యక్షుడు కేతావత్‌ శంకర్‌నాయక్‌ను అదుపులోకి తీసుకుని తిరుమలగిరి సాగర్‌ పోలీసుస్టేషన్‌కు తరలించారు. పలువురు నాయకులు, కార్యకర్తలను అడవిదేవులపల్లి, వాడపల్లి ఠాణాకు తరలించి సీఎం పర్యటన ముగిశాక విడుదల చేశారు. ప్లాంటుకు సమీపంలో దామరచర్ల-అడవిదేవులపల్లి రహదారిపై కాంగ్రెస్‌ నేతలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా శంకర్‌నాయక్‌ మాట్లాడుతూ ప్లాంటు నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు పరిహారం అందించలేదన్నారు. ప్రజాభిప్రాయ సేకరణలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని పేర్కొన్నారు. భూములు కోల్పోయిన వారికి ఉపాధి అవకాశాలు కల్పించకపోవడంతో కుటుంబాలు వీధిన పడే పరిస్థితి నెలకొందని చెప్పారు. ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తూ కేసీఆర్‌ నిజాంను తలపిస్తున్నారని విమర్శించారు. సీఎం పర్యటన అడ్డుకుంటామనే సాకుతో రాత్రి వేళ కాంగ్రెస్‌ సానుభూతిపరులు, కార్యకర్తలను పోలీసులు బెదిరించడం తగదన్నారు. పోడు భూములకు పట్టాలివ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు.  కార్యక్రమంలో దామరచర్ల, అడవిదేవులపల్లి మండల పార్టీ అధ్యక్షులు గాజులశ్రీనివాస్‌, బాలునాయక్‌, నాయకులు నాగరాజు, శారద, శివచరణ్‌, ఆనంద్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు. వాడపల్లి పోలీసులు కాంగ్రెస్‌ నాయకులు సిద్దునాయక్‌, వసంత్‌, విజయ్‌, సర్పంచి జనార్దన్‌, నర్సింహారెడ్డి తదితరులను అదుపులోకి తీసుకుని ఠాణాలో ఉంచారు.

నిర్వాసితులను అడ్డుకున్న పోలీసులు..

విద్యుత్తుప్లాంట్‌ నిర్మాణంతో నిర్వాసితులైన తాళ్లవీరప్పగూడెం గ్రామస్థులు సోమవారం కేంద్రం ప్రధాన ద్వారం వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. ఎంపీటీసీ మాజీ సభ్యురాలు కమలమ్మ, తదితరులను పోలీసులు అడ్డుకుని వాహనాల్లో అక్కడి నుంచి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని