logo

తరలివచ్చే.. వరాలిచ్చే..!

ఉమ్మడి జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల సమీక్షకు వచ్చిన మంత్రి కేటీఆర్‌ నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలకు వరాల జల్లు కురిపించారు.  

Published : 02 Dec 2022 03:25 IST

మునుగోడులో హామీల అమలుకు నిధులు ప్రకటించిన మంత్రి కేటీఆర్‌
ఈనాడు, నల్గొండ-న్యూస్‌టుడే, మునుగోడు

మునుగోడులో విలేకరులతో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌. చిత్రంలో జగదీశ్‌రెడ్డి, సత్యవతి, సునీత

ఉమ్మడి జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల సమీక్షకు వచ్చిన మంత్రి కేటీఆర్‌ నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలకు వరాల జల్లు కురిపించారు.  ఆర్‌అండ్‌బీ శాఖ నుంచి రూ.402 కోట్లు, పంచాయతీరాజ్‌ రూ.700 కోట్లు, పురపాలక శాఖ రూ.334 కోట్లు, గిరిజన సంక్షేమ శాఖ రూ.100 కోట్లు, విద్యుత్‌ శాఖ తరఫున సబ్‌స్టేషన్ల నిర్మాణానికి రూ.8 కోట్లు  మంజూరు చేస్తున్నామని, వీటిని వచ్చే ఆరేడు నెలల్లో ఖర్చు చేస్తామని ప్రకటించారు. ఇందులో ఒక్క మునుగోడు నియోకజవర్గానికే ఆర్‌అండ్‌బీ శాఖకు 100 కోట్లు, పంచాయతీరాజ్‌కు రూ.175 కోట్లు, చండూరు పురపాలికకు రూ.30 కోట్లు, చౌటుప్పల్‌కు రూ.50 కోట్లు, గిరిజన సంక్షేమ శాఖ తరఫున రూ.25 కోట్లు కేటాయించడం గమనార్హం. మునుగోడులో గురువారం ఆరు గంటల పాటు జరిగిన సమీక్షా సమావేశంలో ఆయా నియోజకవర్గాల్లోని సమస్యలను ఎమ్మెల్యేలు, సమీక్షకు వచ్చిన మంత్రుల బృందానికి ఏకరువు పెట్టారు. రహదారుల పరిస్థితి, చాలా పురపాలికల్లో ఇప్పటికీ సగం వార్డుల్లో తాగునీరు అందకపోవడంపై సంబంధిత అధికారులపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమస్యల పరిష్కారానికి తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అభివృద్ధి కార్యక్రమాలపై సంబంధిత జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.

సూర్యాపేట-శెట్టిపాలెం రహదారిని పూర్తి చేయరా?

మిర్యాలగూడ-సూర్యాపేట వయా శెట్టిపాలెం, భీమారం రహదారిని దాదాపు ఆరేళ్ల క్రితం మొదలుపెట్టారని, ఇప్పటికీ పూర్తి కాలేదని మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు సంబంధిత మంత్రి ప్రశాంత్‌రెడ్డి దృష్టికి తీసుకురాగా...భీమారం వద్ద రహదారి నిర్మించకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. నల్గొండ-మల్లేపల్లి రహదారి నిర్మాణానికి నిధులు మంజూరైనా టెండర్లు పిలవడం లేదని నల్గొండ, దేవరకొండ ఎమ్మెల్యేలు భూపాల్‌రెడ్డి, రవీందర్‌నాయక్‌ మంత్రులకు వివరించారు. నల్గొండ పురపాలిక వద్ద 4 వరసల రహదారిని జాతీయ రహదారి పేరుతో రెండు వరుసలుగా మారుస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే మంత్రి ప్రశాంత్‌రెడ్డి దృష్టికి తీసుకురాగా, దీనిపై త్వరలోనే జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. చిట్యాల - భువనగిరి వయా రామన్నపేట, వలిగొండ రహదారి తీవ్రంగా దెబ్బతిందని, అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని నకిరేకల్‌ ఎమ్మెల్యే మంత్రి దృష్టికి తీసుకురాగా, అధికారులు సమాధానం చెప్పడానికి నీళ్లు నమిలడంతో మరోసారి మంత్రి జగదీశ్‌రెడ్డి కల్పించుకొని అధికారులు పట్టించుకోవాలని ఆదేశించారు. రహదారి నిర్మాణం, మరమ్మతుల గురించి అధికారులను అడిగితే బడ్జెట్‌ లేదని ప్రచారం చేస్తున్నారని, తొలుత ఈ ప్రచారాన్ని బంద్‌ చేయాలని దేవరకొండ ఎమ్మెల్యే అధికారులపై ఆగ్రహించారు.  

* యాదాద్రి జిల్లా మీదుగా నిర్మిస్తున్న ప్రాంతీయ వలయ రహదారి ఎంత వరకు వచ్చిందని స్థానిక కలెక్టరు పమేలా సత్పతిని మంత్రి ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. మొత్తం 74 ఎకరాల భూ సేకరణకు ఇంకా 20 ఎకరాలను సేకరించాల్సి ఉందని, రైతులకు నచ్చజెబుతున్నామని, త్వరలోనే భూసేకరణ పూర్తి చేస్తామని కలెక్టరు వెల్లడించారు.

*  మూడు జిల్లాల్లో కలిపి మొత్తం 6385 రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణం పూర్తయితే సుమారు 5 వేలకు పైగా ఇళ్లను ఇంకా లబ్ధిదారులకు అందించాల్సి ఉందని అధికారులు వెల్లడించగా...తక్షణం లబ్ధిదారులను ఎంపిక చేసి వాటిని వారికి అప్పగించాలని మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఆదేశించారు.

*  నల్గొండ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై కేటీఆర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. అందుకు ఎమ్మెల్యే కంచర్ల, పుర అధ్యక్షుడు సైదిరెడ్డి, పుర కమిషనర్‌లను అభినందించారు.  

*  సుమారు 600 వరకు జనాభా ఉన్న చిన్న పంచాయతీలకు ట్రాక్టర్ల నిర్వహణ భారంగా మారిందని, వాటి కిస్తీలు ప్రభుత్వమే కట్టేలా చూడాలని హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే సైదిరెడ్డి సంబంధిత మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దృష్టికి తీసుకురాగా... ట్రాక్టర్ల వల్ల పంచాయతీల ఆదాయం పెరిగిందని, కొందరు కావాలనే ఈ వాదన తీసుకువస్తున్నారన్నారు.

*  ప్రభుత్వ విప్‌ సునీత మాట్లాడుతూ యాదగిరిగుట్టలో పలు నిర్మాణాలు జరుగుతున్నందునా మిషన్‌ భగీరథ పైప్‌లు తరచూ పగిలిపోతున్నాయని, అధికారులు సకాలంలో మరమ్మతులు చేయడం లేదని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

మునుగోడులో నిర్వహించిన ఉమ్మడి జిల్లా అభివృద్ధి, సంక్షేమ సమీక్ష సమావేశానికి హాజరైన కలెక్టర్లు వినయ్‌కృష్ణారెడ్డి, పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌, పమేలా సత్పతి, అదనపు కలెక్టర్లు, అధికారులు  

సగం పురపాలికలకు తాగునీళ్లు లేవు: ఎమ్మెల్యేలు

మునుగోడు నియోజకవర్గంలోని చండూరు, చౌటుప్పల్‌లో సగం వార్డులకు తాగునీళ్లు అందడం లేదని స్థానిక ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి మంత్రి దృష్టికి తీసుకురాగా... దేవరకొండ, కోదాడ పురపాలికలతో పాటు పోచంపల్లి, నకిరేకల్‌లోనూ ఆ సమస్య ఉందని స్థానిక ఎమ్మెల్యేలు మంత్రికి వివరించారు. దీంతో ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ సురేశ్‌ను ఈ సమస్యపై మంత్రి కేటీఆర్‌ వివరణ కోరగా...పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం ఆర్‌డబ్ల్యూఎస్‌, ప్రజారోగ్యశాఖ, పురపాలక శాఖ అధికారులు కూర్చొని సమస్యను పరిష్కరించాలని కోరారు. పట్టణ ప్రగతిలో గత ఎనిమిదేళ్లలో నల్గొండ జిల్లాలోని 8 పురపాలికలకు రూ.453.04 కోట్లు, సూర్యాపేటలోని 6 పురపాలికలకు రూ.619 కోట్లు, యాదాద్రి జిల్లాలోని 5 పురపాలికలకు రూ.283.85 కోట్లు కేటాయించామన్నారు.  

గిరిజనులకు అటవీశాఖ నుంచి ఇబ్బందులు

ప్రభుత్వం పోడు సమస్యను తీరుద్దామని సంకల్పిస్తే అటవీ శాఖ అధికారులు దానిని మరింత జఠిలం చేస్తున్నట్లు దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ సంబంధిత మంత్రి సత్యవతి దృష్టికి తీసుకువచ్చారు. పోడు పట్టాల దరఖాస్తులను అటవీశాఖ అధికారులు తిరస్కరిస్తున్నారని చెప్పగా...దరఖాస్తులను తిరస్కరించే హక్కు వారికి లేదని, గ్రామ సభ తీర్మానం ద్వారా వచ్చిన దరఖాస్తులు ప్రభుత్వం పరిశీలిస్తుందని మంత్రి వెల్లడించారు.  

ఎత్తిపోతల పథకాలపై వారం వారం సమీక్షించాలి

నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలోని నెల్లికల్‌ ఎత్తిపోతల పథకంతో పాటు మిర్యాలగూడ, హుజూర్‌నగర్‌, దేవరకొండ నియోజకవర్గాల్లో నిర్మితమవుతున్న ఎత్తిపోతల పథకాలను వీలైనంత తొందరగా పూర్తి చేయాలని మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. సీఎం కేసీఆర్‌, మంత్రి జగదీశ్‌రెడ్డి వీటిని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారని, ప్రజల ముందు తమను ఇబ్బందుల పాలు చేయొద్దని అధికారులకు సూచించారు. ప్రతి వారం అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించాలని నాగార్జునసాగర్‌ (ఎన్నెస్పీ) ఇన్‌ఛార్జ్‌ సీఈ అజయ్‌కుమార్‌ను ఆదేశించారు.

సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్‌రెడ్డి, రవీంద్రకుమార్‌, భూపాల్‌రెడ్డి, కిశోర్‌కుమార్‌, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు