logo

ఆ చూపు.. హృదయం వైపు

కూలీకి వెళితేనే పూట గడిచే కుటుంబం వీరిది.. ఉన్న ఊరిలో పనిలేక పొట్ట చేత పట్టుకుని పట్నం బాట పట్టారు. చేతికందిన 20ఏళ్ల కొడుకు కుటుంబాన్ని ఆదుకుంటాడనుకుని ఆశలు పెంచుకున్నారు.

Updated : 02 Dec 2022 07:01 IST

ఆసుపత్రిలో డయాలసిస్‌ చేయించుకుంటున్న మనోహర్‌

రాజపేట, న్యూస్‌టుడే : కూలీకి వెళితేనే పూట గడిచే కుటుంబం వీరిది.. ఉన్న ఊరిలో పనిలేక పొట్ట చేత పట్టుకుని పట్నం బాట పట్టారు. చేతికందిన 20ఏళ్ల కొడుకు కుటుంబాన్ని ఆదుకుంటాడనుకుని ఆశలు పెంచుకున్నారు. అంతలోనే కుమారుడి రెండు కిడ్నీలు చెడిపోయి మంచాన పడ్డారు. తన కిడ్నీ ఇచ్చి కుమారుడిని దక్కించుకుందామనుకున్న ఆ తండ్రికి ఆర్థిక సమస్య ఇబ్బందికరంగా మారింది. శస్త్ర చికిత్సకు అవసరమయ్యే ఖర్చులకు దాతల నుంచి సహకారం అర్థిస్తున్నారు.  యాదాద్రి జిల్లా రాజపేట మండల నెమిల గ్రామానికి చెందిన కుంచం వెంకటయ్య, ఎల్లమ్మలకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. కుమార్తెలకు వివాహం జరిపించారు. ఖర్చులు పెరిగిపోవడం, ఆర్థిక ఇబ్బందులకు తోడు ఉన్న ఊరిలో పని లభించకపోవడంతో కుమారుడు మనోహర్‌ను తీసుకుని ఆరేళ్ల క్రితం హైదరాబాద్‌కు వలస వెళ్లారు. అక్కడే డిగ్రీ చదువుతున్న కుమారుడు ఆకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యాడు. వైద్య పరీక్షల అనంతరం మనోహర్‌కు రెండు కిడ్నీలు పూర్తిగా చెడిపోయాయని వైద్యులు నిర్ధారించారు. వైద్యుల సూచనల మేరకు ప్రస్తుతం వారంలో రెండు పర్యాయాలు డయాలసిస్‌ చేయిస్తున్నారు.

ఎలాగైనా కుమారుడిని దక్కించుకోవాలనే తపనతో తన కిడ్నీని ఇవ్వడానికి ముందుకు వచ్చారు వెంకటయ్య. ఇందుకు వైద్యులు కూడా పలు పరీక్షలు నిర్వహించి అంగీకరించినట్లు వెంకటయ్య వివరించారు. ప్రైవేటు అసుపత్రిలో మనోహర్‌కు జరిపే శస్త్ర చికిత్సకు సుమారు రూ.8 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపినట్లు పేర్కొన్నారు. రోజు కూలీగా బతికే తమకు నిలువ నీడ కూడా లేదని, అంత ఖర్చు భరించలేమని ఆవేదన చెందుతున్నారు. తన కుమారుడి శస్త్ర చికిత్సకు, మెరుగైన వైద్యానికి దాతలు, స్వచ్ఛంద సంస్థలు ఆర్థిక సహకారం అందించి ఆదుకోవాలని మనోహర్‌ తల్లిదండ్రులు వెంకటయ్య, ఎల్లమ్మలు కోరుతున్నారు.

మనోహర్‌కు అన్నం తినిపిస్తున్న  తల్లిదండ్రులు ఎల్లమ్మ వెంకటయ్య

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని