logo

వణుకుతున్న అనాథలు

ఉమ్మడి నల్గొండ జిల్లాలో అనాథలకు రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, పార్కులు, పుట్‌పాత్‌లే దిక్కవుతున్నాయి. జిల్లాల్లో రోజుకూ సగటున 20 డిగ్రీల సెల్సియస్‌ ఉష్టోగ్రత నమోదవుతోంది.

Published : 04 Dec 2022 05:00 IST

ఉమ్మడి జిల్లాలోని పురపాలికల్లో రోడ్ల పక్కనే తలదాచుకుంటున్న నిరాశ్రయులు
నల్గొండ, పురపాలిక, న్యూస్‌టుడే

సూర్యాపేటలోని గణేశ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన నిరాశ్రయుల కేంద్రం

ఉమ్మడి నల్గొండ జిల్లాలో అనాథలకు రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, పార్కులు, పుట్‌పాత్‌లే దిక్కవుతున్నాయి. జిల్లాల్లో రోజుకూ సగటున 20 డిగ్రీల సెల్సియస్‌ ఉష్టోగ్రత నమోదవుతోంది. రానున్న రోజుల్లో మరింత తగ్గనుంది. దీంతో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలోని ప్రతి పురపాలికలో అనాథలకు రక్షణ కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. పురపాలికల్లో అనాథలను గుర్తించాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. దీంతో ఉమ్మడి జిల్లాలోని 19 పురపాలికల్లో గతేడాది మెప్మా అధికారులు సర్వే చేపట్టి అనాథలను గుర్తించారు. కానీ ఇప్పటికీ నిరాశ్రయుల కేంద్రాలు ఏర్పాటుకు నోచుకోలేదు.

ఉమ్మడి జిల్లాలోని పురపాలికల్లో గతేడాది మెప్మా ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. భువనగిరిలో 41, మిర్యాలగూడ 37, సూర్యాపేట 13 , దేవరకొండలో 15 మంది అనాథలు ఉన్నట్లు గుర్తించారు. భువనగిరిలో అధికంగా 41 మందిని గుర్తించారు. నల్గొండ కలెక్టరేట్‌ సమీపంలో పెద్దబండలో నిరాశ్రయ కేంద్రం ఏర్పాటు చేసినప్పటికీ అది దూరంగా ఉండటంతో అక్కడికి రావడానికి ఆసక్తి చూపట్లేదు. దీంతో వారి కోసం ప్రభుత్వ కేంద్రాసుపత్రి ఆవరణలో కొత్త భవనం నిర్మించినా.. దానిని ప్రారంభించడంలో జాప్యం జరుగుతోంది. అదే విధంగా మిర్యాలగూడలో రైల్వే స్టేషన్‌ సమీపంలో నిరాశ్రయ కేంద్రం ఏర్పాటు చేసినా.. ప్రయోజనం లేకుండా పోయింది.

భువనగిరిలో నిరాశ్రయుల కేంద్రం నిర్మించినా మున్సిపల్‌ అధికారులకు అప్పగించలేదు. దీంతో పట్టణంలో రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌, మసీదు ప్రాంతాల్లో రోడ్లపైనే ఉంటున్నారు. మిర్యాలగూడలోని ప్రకాశ్‌నగర్‌లో వసతి ఏర్పాటు చేశారు. నాలుగేళ్ల నుంచి నిధులు రావడం లేదు. సూర్యాపేటలో నిరాశ్రయుల కేంద్రంలో రోజుకు 15 మందికి పైగా ఆశ్రయం పొందుతున్నారు. మిగతా పురపాలికల్లో నిర్వహణకు ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదు.

నీలగిరిలో చలిలో రోడ్డు పక్కన కాలం వెళ్ల తీస్తున్న నిరాశ్రయుడు

పని చేయని కమిటీలు

మెప్మా ఆధ్వర్యంలో పురపాలికల్లో ఏర్పాటు చేసిన నిరాశ్రయ కేంద్రాలకు రెండు కమిటీలు ఉంటాయి. షెల్టర్‌ మేనేజ్‌మెంటు, కార్యనిర్వాహక కమిటీలు ఈ కేంద్రాలను పర్యవేక్షించాలి. కార్యనిర్వాహక కమిటీలో పుర కమిషనర్‌, పోలీసు, మెప్మా, ట్రాఫిక్‌ అధికారులు సభ్యులుగా ఉంటారు. వీరు మూడునెలలకోసారి సమావేశమై చర్చించాలి. షెల్టర్‌ మేనేజ్‌మెంటు కమిటీలో స్థానిక కౌన్సిలర్‌, షెల్టర్‌ మేనేజర్‌, నిరాశ్రయుల నుంచి ముగ్గురు ఉండాలి. వారికి కావాల్సిన వసతులు, ఇబ్బందులపై చర్చించాలి. ప్రతి నిరాశ్రయుల కేంద్రంలో భోజన వసతితోపాటు మంచినీళ్లు, మరుగుదొడ్లు, పంకాలు, టీవీలు ఏర్పాటు చేయాలి. కానీ కమిటీలు ఉన్నప్పటికీ నామమాత్రంగానే మారాయి.

నల్గొండ ఆర్టీసీ బస్‌స్టాండ్‌లో ఓ వృద్ధుడు

వివరాలు ఇలా...

నల్గొండ:51
మిర్యాలగూడ:37
దేవరకొండ15
హాలియా:5
చండూరు:3 చిట్యాల: 4
నందికొండ: 5

నిరాశ్రయుల కేంద్రం ఏర్పాటు: -శ్రీపాద రామేశ్వర్‌, పీడీ మెప్మా, నల్గొండ

ప్రస్తుతం నల్గొండ, మిర్యాలగూడ కేంద్రాల్లో మౌలిక సౌకర్యాలు అందులోబాటులో ఉన్నాయి. జిల్లా కేంద్రాసుపత్రి ఆవరణలో కొత్త భవనం అందుబాటులోకి రానుంది. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. మిగతా మున్సిపాలిటీల్లో కనీసం 20 మంది నిరాశ్రయులు ఉంటే కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపిస్తాం. నల్గొండ, మిర్యాలగూడ మినహా మిగతా పురపాలికలో ఆ స్థాయిలో లేరు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని