logo

అంతా నిద్రపోతున్న వేళ..!

రెండు నెలల క్రితం చిట్యాల మండలం వెలిమినేడు శివారులో అర్ధరాత్రి తర్వాత ట్యాంకర్‌ నుంచి ఫార్మా వ్యర్థాలను రహదారి పక్కన ఉన్న చెరువులో పారబోయడంతో చెరువులోని చేపలు మృతిచెందాయి.

Published : 04 Dec 2022 05:00 IST

జాతీయ రహదారుల పక్కన ఔషధ, జీవ వ్యర్థాలను పారబోస్తున్న వైనం

పోచంపల్లి మండలం అంతమ్మగూడెంలో రంగు మారిన నీరు ఇలా..

రెండు నెలల క్రితం చిట్యాల మండలం వెలిమినేడు శివారులో అర్ధరాత్రి తర్వాత ట్యాంకర్‌ నుంచి ఫార్మా వ్యర్థాలను రహదారి పక్కన ఉన్న చెరువులో పారబోయడంతో చెరువులోని చేపలు మృతిచెందాయి. ఆ చెరువు నీళ్లన్నీ కలుషితం అయ్యాయి. ఫిర్యాదు చేసినా.. కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులు గానీ, పోలీసులు గానీ దీనిపై లోతైన విచారణ చేయలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఈనాడు, నల్గొండ - న్యూస్‌టుడే, చిట్యాల గ్రామీణం: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారిపై పలు ప్రాంతాల్లో ఫార్మా వ్యర్థాలను ట్యాంకర్లలో తెచ్చి కొందరు రహదారి పక్కనే పారబోస్తున్నారు. రెండు నెలల నుంచి చౌటుప్పల్‌, చిట్యాల మండలాల్లో సుమారు మూడు ఘటనలు చోటు చేసుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. పరిశ్రమలో రోజంతా వచ్చిన వ్యర్థాలను ట్యాంకర్లలో నిల్వ చేసి అర్ధరాత్రి సుమారు 12 గంటల నుంచి మూడు గంటల మధ్యలో చౌటుప్పల్‌, చిట్యాల, నార్కట్‌పల్లి, కట్టంగూరు మండలాల పరిధిలోని జాతీయ రహదారి పక్కన పారబోస్తున్నారు. చౌటుప్పల్‌ శివారులో ఫార్మా వ్యర్థాల వల్ల అక్కడి చెరువు కలుషితమై జీవాలు సైతం నీళ్లు తాగలేని స్థితికి చేరుకున్నాయి. గతేడాది ఫార్మా వ్యర్థాలను వెలిమినేడు చెరువులోకి వదలడంతో కాలుష్యంతో సుమారు రూ.10 లక్షల మేర చెరువులోని చేపలు మృతిచెంది మత్స్యకారులకు తీవ్ర ఆర్థిక నష్టం జరిగింది. వీటితో పాటూ కోళ్ల పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలను సైతం రహదారి పక్కనే పారబోస్తున్నారు. దీంతో అక్కడి పరిసర ప్రాంతాలతో పాటూ రహదారిపై ప్రయాణిస్తున్న వారికి ఇది ఇబ్బందిగా మారింది.

చిట్యాల మండలంలో జాతీయ రహదారి పక్కనే
పారబోసిన వ్యర్థజలాలు (పాత చిత్రం)

* ఇంత జరుగుతున్నా సంబంధిత కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులు మాత్రం ఘటన జరిగినప్పుడు హడావుడి చేయడం, తర్వాత సదరు కంపెనీల  వారితో ‘మామూలు’గా ఉంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. చిట్యాలతో పాటూ చౌటుప్పల్‌లో రహదారి పక్కన సుమారు పది వరకు చెరువులు, నీటి కుంటలున్నాయి. వీటిని లక్ష్యంగా చేసుకొని ఈ ఫార్మా వ్యర్థాలను కంపెనీలు పారబోస్తున్నాయి. రహదారి పక్కన ఇతర ప్రాంతాల్లో వదిలితే తెలిసిపోతుందనే భయంతో కుంటల్లో వదులుతున్నారు. దీంతో ఈ ప్రాంతాల్లో నీటి గాఢత ప్రమాదకరంగా మారింది. నీటి గాఢత పరిమాణం సాధారణంగా 500 వరకు ఉంటే మనుషులు వాడుకోవచ్చు. 2000 వరకు ఉంటే వ్యవసాయానికి వాడుకోవచ్చు. కానీ, చౌటుప్పల్‌, చిట్యాల, నార్కట్‌పల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో నీటి గాఢత ప్రస్తుతం ప్రమాదకరంగా 13000 వరకు చేరుకుంది. ఈ వాతావరణంలో మనుషుల మనుగడ ప్రమాదకరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

భూగర్భజలాలు కలుషితం

కొన్ని ఫార్మా కంపెనీలు ఈ ఔషధ వ్యర్థాలను భారీ గొయ్యి తీసి భూమిలోకే వదలడంతో అక్కడి భూగర్భజలాలు కలుషితం అవుతున్నాయి. చిట్యాల మండలంలోని పిట్టంపల్లి, వెలిమినేడు,  చౌటుప్పల్‌ మండలంలోని ఆరేగూడెం, పంతంగి, లింగారెడ్డిగూడెం, నాతాళ్లగూడెం, యల్లగిరి, ధర్మోజీగూడెం, జుబ్లక్‌పల్లి భూదాన్‌పోచంపల్లి మండలంలోని దోతిగూడెం, అంతమ్మగూడెం పరిసరాల్లో భూగర్భజలాలు కలుషితం అయి పంటలు పండని దుస్థితి నెలకొంది. బీబీనగర్‌, భువనగిరి, బొమ్మలరామారం మండలాల్లోని పలు ప్రాంతాల్లోనూ ఇదే దుస్థితి. ఈ ప్రాంతాల్లోనే సుమారు 50 వరకు చిన్నా, పెద్దా ఫార్మా కంపెనీలున్నాయి. ఈ కలుషిత జలాల వల్ల ప్రజలు సైతం అంతుచిక్కని వ్యాధులతో బాధపడుతున్నారు. చౌటుప్పల్‌లోని స్థానికులు రాత్రి ఈ పరిశ్రమల నుంచి వచ్చే కంపు (వాసన) భరించలేక రాజధాని పరిసర ప్రాంతాల్లోని హయత్‌నగర్‌ పరిసరాల్లో అద్దెకు ఉంటున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంత జరుగుతున్నా పీసీబీ అధికారులు ఎలాంటి చర్యలకు ఉపక్రమించడం లేదని ఈ పరిసర ప్రాంతాల ప్రజలు ఆరోపిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని