logo

మునుగోడుకు వంద పడకల ఆసుపత్రైనా దక్కేనా!

మునుగోడు ఉప ఎన్నికలో ఇచ్చిన హామీ మేరకు నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు.

Published : 04 Dec 2022 05:00 IST

మునుగోడులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

మునుగోడు, న్యూస్‌టుడే: మునుగోడు ఉప ఎన్నికలో ఇచ్చిన హామీ మేరకు నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. అందుకు అనుకూలంగా ఏ మండలం ఉంటే అక్కడ ఏర్పాటు చేయనున్నట్లుగా ఇటీవల మునుగోడులో జరిగిన ఉమ్మడి జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. చండూరును రెవెన్యూ డివిజన్‌గా, చౌటుప్పల్‌ మండలంలో 100 ఎకరాలలో బొమ్మల పార్కు ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించబోతున్నామనే విషయం విధితమే. 100 పడకల ఆసుపత్రిని ఎక్కడ ఏర్పాటు చేస్తారో అనేది స్పష్టత ఇవ్వలేదు. ఈ ఆసుపత్రి అయినా మునుగోడులో ఏర్పాటు చేస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే మున్సిపాలిటీని నోచుకోని మునుగోడుకు రెవెన్యూ డివిజన్‌ సైతం కోల్పోయింది. మునుగోడుకు దక్కింది ఏదైనా ఉందంటే నియోజకవర్గ కేంద్రమనే పేరు మాత్రమేనన్న విమర్శలు వస్తున్నాయి. ఉద్యమాలు నిర్వహించైనా వంద పడకల ఆసుపత్రిని సాధించుకుంటామని పలు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.

ఆరు పడకలకే పరిమితమైంది...

నియోజకవర్గ కేంద్రమైన మునుగోడులో ఆరు పడకల స్థాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది. ప్రతినిత్యం ఈ ఆసుపత్రికి 100 నుంచి 200 మంది వరకు వివిధ సమస్యలతో రోగులు వస్తుంటారు. ఇక్కడ కేవలం చిన్న సమస్యలకు మాత్రమే పరీక్షలు చేస్తుంటారు. ఆరు పడకల ఆసుపత్రి కావడంతో 24 గంటల వైద్యం అందని దుస్థితి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే వైద్యాధికారులు ఉంటారు. ఆ తర్వాత ఎవరైనా రోగులు వెళ్తే స్టాప్‌ నర్సు లేక ఏఎన్‌ఎం విధుల్లో ఉంటారు. తీవ్ర ప్రమాదం జరిగితే జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిందే. 100 పడకల ఆసుపత్రి వస్తే 24 గంటల వైద్యం అందే అవకాశం ఉంటుంది. స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చైనా మునుగోడులో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని