logo

సమీపిస్తున్న గడువు సర్కారు ఆదేశాలు బుట్టదాఖలు

పల్లెల్లో సాధారణ బల్పుల స్థానంలో ఎల్‌ఈడీ దీపాలను అమర్చాలని ప్రభుత్వ ఆదేశాలు బుట్టదాఖలయ్యాయి. రెండేళ్ల క్రితమే నిర్ణయించినా ఆచరణకు నోచుకోలేదు.

Published : 05 Dec 2022 06:10 IST

నల్గొండ గ్రామీణం, న్యూస్‌టుడే: పల్లెల్లో సాధారణ బల్పుల స్థానంలో ఎల్‌ఈడీ దీపాలను అమర్చాలని ప్రభుత్వ ఆదేశాలు బుట్టదాఖలయ్యాయి. రెండేళ్ల క్రితమే నిర్ణయించినా ఆచరణకు నోచుకోలేదు. తాజాగా మరోమారు ఆగస్టులో నిర్ణయం తీసుకున్నా.. ఎక్కడి పనులు అక్కడే అన్న చందంగా మారింది. నిర్ణీత గడువు వచ్చేనెలతో ముగియనునా.. ఇప్పటి వరకు పావులావంతు గ్రామాల్లోనూ పనులు పూర్తికాలేదు.  ఇంధన సంరక్షణ పథకం కింద గ్రామాల్లో ఎల్‌ఈడీ దీపాలు అమర్చడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి. ఈ పనులను ఈఈఎస్‌ఎల్‌ (ఇంధన సామర్థ్య సేవల సంస్థ)కు అప్పగించారు. మొదటి విడతలో నల్గొండ జిల్లాలో 844 గ్రామాల్లో వచ్చే ఏడాది జనవరి లోపు ఎల్‌ఈడీ దీపాల అమర్చే పనులు పూర్తిచేయాల్సి ఉంది. జిల్లాలో విడతల వారీగా విద్యుత్‌ స్తంభాల సర్వే చేస్తూ ఎల్‌ఈడీ దీపాలు బిగిస్తున్నారు. తొలుత 9 మండలాల్లో సర్వే చేస్తున్నారు. వీటిలో చింతపల్లి, మర్రిగూడ, చిట్యాల, కట్టాంగూర్‌, శాలిగౌరారంతో పాటు మరో నాలుగు మండలాలలోని అనుబంధగ్రామాలున్నాయి. వీటిలో 10 రోజలుగా సర్వే చేసి ఎల్‌ఈడీ దీపాలు అమరుస్తున్నారు. పనుల్లో వేగం లేకపోవడంతో నిర్ణీత గడువులోగా పూర్తిచేయడం కష్టమే.  

ఏడేళ్లపాటు నిర్వహణ

ఎల్‌ఈడీ విద్యుద్ధీపాల నిర్వహణ బాధ్యతను తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ రెడ్కో)కు అప్పగించారు. ఏడేళ్లపాటు నిర్వహణ బాధ్యత ఆ సంస్థదే. అందుకు ప్రభుత్వం గ్రామపంచాయతీ నిధుల నుంచి సంస్థకు నిర్వహణ కోసం నిధులు బదిలీ చేయనుంది. ఇంధన సంరక్షణ పథకం అమలు కారణంగా పంచాయతీలపై భారం సగం వరకు తగ్గనుంది. గతంలో ఒక బల్పుపై ఏడాదికి రూ.110 బిల్లు రాగా.. ఎల్‌ఈడీ బల్పు అయితే రూ. 38 విద్యుత్తు బిల్లు అవుతుంది.


ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా..
సూర్యనారాయణ, జిల్లా మేనేజర్‌, టీఎస్‌రెడ్‌కో

ఎల్‌ఈడీ వీధి దీపాల ఏర్పాటుపై ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ముందుకెళ్తున్నాం. గ్రామాల వారీగా నల్గొండ జిల్లాలో సర్వేచేసి ఎల్‌ఈడీ దీపాలు బిగిస్తున్నాం. పనుల్లో వేగాన్ని పెంచి సకాలంలో పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని