logo

నిబంధనలు తొక్కేస్తూ.. భవనాలు కట్టేస్తూ..!

తెలంగాణ ప్రభుత్వం నవంబరు 2020 నుంచి భవన నిర్మాణాల అనుమతులను టీఎస్‌ బీపాస్‌ పద్ధతిలో మంజూరు చేస్తోంది. గతంలో దరఖాస్తులను భౌతికంగా పరిశీలించి అనుమతులు జారీ చేసే వారు.

Published : 05 Dec 2022 06:10 IST

టీఎస్‌బీపాస్‌ అనుమతుల్లో అయోమయం

భువనగిరి పట్టణం

న్యూస్‌టుడే- భువనగిరి పట్టణం: తెలంగాణ ప్రభుత్వం నవంబరు 2020 నుంచి భవన నిర్మాణాల అనుమతులను టీఎస్‌ బీపాస్‌ పద్ధతిలో మంజూరు చేస్తోంది. గతంలో దరఖాస్తులను భౌతికంగా పరిశీలించి అనుమతులు జారీ చేసే వారు. ప్రస్తుతం మూడంచెల పరిశీలన అనంతరం ఆన్‌లైన్‌లో నిర్మాణాలకు మంజూరు పత్రాలు జారీ చేస్తున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులతో దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నా యజమానులు భవనాల నిర్మాణాలను చేపడుతుండటంతో ప్రభుత్వం భారీగా ఆదాయం కోల్పోతోంది.

తిరస్కరణకు కారణాలు..

పట్టణాల్లోని పాత ఆవాస ప్రాంతాల్లో గతంలో చిన్నచిన్న వీధుల్లో ఇళ్లను నిర్మించుకున్నారు. పాత ఇళ్లను కూల్చి కొత్త నిర్మాణాలు చేపట్టేందుకు దరఖాస్తు చేసుకున్న పక్షంలో టీఎస్‌బీపాస్‌ నిబంధనల మేరకు స్థలం లింక్‌ దస్తావేజులు లేకపోవడంతో పాటు రోడ్డు ఎఫెక్ట్‌ ఏరియా, సెట్‌బ్యాక్‌ లేకపోవడంతో దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి. అనుమతులకు దరఖాస్తు చేసుకుని ఫీజు చెల్లించామన్న ధీమాతో దరఖాస్తుదారులు ఇళ్ల నిర్మాణాలను చేపడుతుండటం గమనార్హం.

* పట్టణాల్లో ప్రస్తుతం అదనపు అంతస్తుల నిర్మాణాలకు పూర్తి స్థాయిలో అనుమతులు లభించడం లేదు. గతంలో మాన్యువల్‌ పద్ధతిలో ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేశారు. అప్పటి సెట్‌బ్యాక్‌ నిబంధనలు తక్కువ విస్తీర్ణంలో ఉన్నాయి. ప్రస్తుతం మీటరు సెట్‌బ్యాక్‌ వదిలి నిర్మాణం చేపట్టాల్సి ఉంది. గతంలో అనుమతించిన ప్లానుకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టడంతో ప్రస్తుతం టీఎస్‌బీపాస్‌ కింద అనుమతులు లభించడం లేదు. పలువురికి అనుమతులు లభించనప్పటికీ నిర్మాణాలు చేపడుతుండటం గమనార్హం.

* కొత్త వెంచర్‌లో నిర్మాణాలకు అందిన దరఖాస్తులు అన్ని సవ్యంగా ఉండటంతో అధికారులు నిర్మాణ అనుమతులు జారీ చేస్తున్నారు. పాత ఆవాస ప్రాంతాల్లో స్థలం దస్తావేజులు సరిగా లేకపోవడం, సెట్‌బ్యాక్‌, రోడ్‌ ఎఫెక్ట్‌ ఏరియా నిబంధనల మేరకు లేకపోవడంతో దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి. నిర్మాణ అనంతరం మున్సిపల్‌ అధికారులు పూర్తి జరిమానాతో ఆయా నిర్మాణాలకు ఆస్తి పన్ను మదిస్తుండటం గమనార్హం. ఇప్పటికైనా నిబంధనలు సడలించిన పక్షంలో అనుమతులు లభించడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం సమకూరే అవకాశం ఉంది.

ప్రక్రియ ఇలా..

ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని పాత పురపాలక సంఘాల్లో నవంబరు 2020 నుంచి 2022 వరకు భవన నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేయాలని 6,288 దరఖాస్తులు అధికారులకు అందాయి. ఇందులో 510 తిరస్కరణకు గురయ్యాయి. సూర్యాపేటలో 351, భువనగిరిలో 299, కోదాడలో 122 దరఖాస్తులు తిరస్కరణకు గురికావడం గమనార్హం. ఉమ్మడి జిల్లా పరిధిలో దరఖాస్తు చేసుకోకుండా చేపట్టిన నిర్మాణాలు వేలల్లో ఉంటాయన్నది అంచనా. ఇటీవల భువనగిరిలో చేపట్టిన సర్వేలో 200 అక్రమ నిర్మాణాలు గుర్తించడం పై ఆరోపణలకు బలాన్ని చేకూర్చుతోంది. దరఖాస్తు అందిన వెంటనే ప్రాథమిక దశలో ఇంజినీరింగ్‌ అధికారి ప్రాథమికంగా నిర్మించే స్థలాన్ని, సెట్‌బ్యాక్‌, రోడ్‌ ఎఫెక్ట్‌ లేని పక్షంలో దరఖాస్తును పట్టణ ప్రణాళిక అధికారులకు అప్‌లోడ్‌ చేస్తారు. పట్టణ ప్రణాళిక అధికారులు తమ లాగిన్‌లోకి వచ్చిన దరఖాస్తును దస్తావేజులు, ప్లాన్‌ను పరిశీలించి తుది ఉత్తర్వు జారీ కోసం కమిషనర్‌ లాగిన్‌లోకి పంపిస్తారు. అన్ని సవ్యంగా ఉన్న పక్షంలో కమిషనర్‌ నిర్మాణానికి ఉత్తర్వులను జారీ చేస్తారు.

* ఈ విషయమై భువనగిరి మున్సిపల్‌ కమిషనర్‌ నాగిరెడ్డిని వివరణ కోరగా.. టీఎస్‌బీపాస్‌ నిబంధలన మేరకు నిర్మాణాల అనుమతులు మంజూరు చేస్తున్నామని అన్నారు. అనుమతులు లేని నిర్మాణాలపై చర్యలు చేపడుతున్నామని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని