logo

మాతృ మరణాలు ఆపడమే లక్ష్యం

యాదాద్రి జిల్లాలో ప్రసవ సమయంలో మాతృ మరణాలు ఆపడం, గర్భిణుల్లో రక్త హీనత సమస్యను అరికట్టడం తమ ప్రధాన లక్ష్యాలుగా నిర్దేశించుకున్నామని గర్భిణుల ఆరోగ్య, పోషకాహార పథకం జిల్లా అధికారి డాక్టర్‌ ఎల్‌.యశోద తెలిపారు.

Published : 05 Dec 2022 06:16 IST

గర్భిణుల ఆరోగ్య, పోషకాహార పథకం జిల్లా అధికారి డాక్టర్‌ ఎల్‌.యశోద

చౌటుప్పల్‌, న్యూస్‌టుడే: యాదాద్రి జిల్లాలో ప్రసవ సమయంలో మాతృ మరణాలు ఆపడం, గర్భిణుల్లో రక్త హీనత సమస్యను అరికట్టడం తమ ప్రధాన లక్ష్యాలుగా నిర్దేశించుకున్నామని గర్భిణుల ఆరోగ్య, పోషకాహార పథకం జిల్లా అధికారి డాక్టర్‌ ఎల్‌.యశోద తెలిపారు. ‘న్యూస్‌టుడే’తో ముఖాముఖిలో గర్భిణుల ఆరోగ్యం, పోషకాహారంపై అమలు చేస్తున్న కార్యక్రమాలను శనివారం వివరించారు.

ప్రశ్న: జిల్లాలో గర్భిణుల ఆరోగ్యం కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు?

డాక్టర్‌ యశోద: క్షేత్ర స్థాయిలోని ఆరోగ్య, ఆశ కార్యకర్తలు ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 9405 మంది గర్భిణులను నమోదు చేసుకున్నారు. పిండం ఎదుగుదలకు ఐరన్‌ ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలు 180, కాల్షియం మాత్రలు 180 ఇస్తారు. వాటిని వాడడం వల్ల జరిగే లాభాలను వివరిస్తున్నారు. గతంలో 70 శాతం ఉన్న రక్తహీనత సమస్య 38 శాతానికి తగ్గింది.

ప్రశ్న: ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే సహజ ప్రసవాలు చేయించాలనే లక్ష్యం చేరారా?  

డాక్టర్‌ యశోద: గర్భిణులను ప్రతి నెలా సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి వైద్యాధికారితో ఆరోగ్య పరీక్షలు చేయించడం, ఆరు, ఏడు, ఎనమిది నెలల గర్భిణులను సామాజిక, జిల్లా కేంద్ర ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించాలని క్షేత్ర స్థాయి సిబ్బందికి ఆదేశాలిచ్చాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలపై అవగాహన కల్పిస్తున్నాం. ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో 2468, ప్రైవేటు ఆసుపత్రుల్లో 3023 ప్రసవాలు జరిగాయి. వీటిలో 26 శాతమే సహజ ప్రసవాలు, 74 శాతం శస్త్రచికిత్సతో ప్రసవాలు అయ్యాయి.

ప్రశ్న: పోషకాహార లోపం సమస్యను ఎలా అధిగమిస్తున్నారు?

డాక్టర్‌ యశోద: జిల్లా కలెక్టర్‌ జిల్లాలో శుక్రవారం సభలను అన్ని అంగన్‌వాడి కేంద్రాల్లో ప్రవేశపెట్టారు. ఆ రోజున గర్భిణులను, బాలింతలను సమావేశపర్చి ఆరోగ్యం, పోషకాహారంపై అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో ఈ యేడు అయిదు మాతృ మరణాలు జరిగాయి. దానికి దారితీసిన పరిస్థితులపై ఈ సభల్లో అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో కొత్తగా ఏర్పాటైన 62 పల్లె దవాఖానాల, ఆయుష్‌ కేంద్రాల వైద్యులను ఇందులో భాగస్వాములను చేస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని