logo

‘రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వాలు’

వ్యవసాయ సంక్షేమానికి అవసరమైన పథకాలు అమలు చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని అఖిల భారత కిసాన్‌సభ జాతీయ కార్యదర్శి కృష్ణప్రసాద్‌ అన్నారు.

Published : 06 Dec 2022 04:09 IST

నల్గొండలో నిర్వహించిన ర్యాలీలో రైతు సంఘం నాయకులు

నీలగిరి, న్యూస్‌టుడే:  వ్యవసాయ సంక్షేమానికి అవసరమైన పథకాలు అమలు చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని అఖిల భారత కిసాన్‌సభ జాతీయ కార్యదర్శి కృష్ణప్రసాద్‌ అన్నారు. కేరళలో జరిగే 35వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ సోమవారం కడివెండి గ్రామంలోని దొడ్డికొమురయ్య స్తూపం నుంచి ప్రారంభమైన అమరవీరుల జ్యోతి యాత్ర నల్గొండకు చేరిన సందర్భంగా పెద్దగడియారం చౌరస్తాలో నిర్వహించిన సభలో ఆయన  మాట్లాడారు. దున్నేవానికి భూమి కావాలని పోరాడగా ..నేడు రైతుల నుంచి బలవంతంగా భూములు గుంజుకుంటున్నా పాలకులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. రైతులు పోరాటం చేయకుండా భూములు దక్కించుకోలేమన్నారు. స్వామినాథన్‌ కమిషన్‌ నివేదిక అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణలో పోడు భూములకు పట్టాలివ్వలేదన్నారు. రైతులకు రుణమాఫీ చేయలేదన్నారు. నల్గొండకు చేరుకున్న ర్యాలీకి స్వాగతం పలుకుతూ మర్రిగూడ బైపాస్‌ నుంచి పెద్దగడియారం చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఏఐకేఎస్‌ జాతీయ సహాయ కార్యదర్శి రాకేశ్‌మాస్టర్‌, రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పోతినేని సుదర్శన్‌, టి.సాగర్‌, నాయకులు శోభన్‌,  బండ శ్రీశైలం, ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, కూన్‌రెడ్డి నాగిరెడ్డి, కందాల ప్రమీల, తదితరులు పాల్గొన్నారు.

చిట్యాల గ్రామీణం:   జాతీయ ఉద్యమ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ‘అఖిల భారత కిసాన్‌ సభ’ వ్యవసాయ రంగంలో వస్తున్న సమస్యలపై సమరశీల పోరాటాలు చేస్తుందని అఖిల భారత రైతు సంఘం జాతీయ కోశాధికారి టి.కృష్ణప్రసాద్‌ అన్నారు. చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో సోమవారం అమరవీరుల స్మారక స్తూపం వద్ద జోహార్లు అర్పించారు. జమీందారు, జాగీర్ధార్‌, వెట్టిచాకిరి విముక్తి కోసం రైతులు, పేదలు కలిసి తెలంగాణలో జరిపిన మహత్తర పోరాట ఘట్టాలకు పుట్టినిల్లు నల్గొండ, ఖమ్మం జిల్లాలు అని అన్నారు. రాష్ట్ర కార్యదర్శి టి.సాగర్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జూలకంటి రంగారెడ్డి మాట్లాడారు. అరూరి శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రకాశ్‌ మాస్టర్‌, పోతినేని సుదర్శన్‌, బొంతల చంద్రారెడ్డి, బండ శ్రీశైలం, పి.జంగారెడ్డి, మూడ శోభన్‌, కందాల ప్రమీల, తదితరులు పాల్గొన్నారు.

Read latest Nalgonda News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు