logo

డబ్బులు ఎప్పుడిస్తారో..!

పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చేందుకు.. బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా ప్రకటించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణంలో నిధుల కొరత లబ్ధిదారుల పాలిట శాపంగా మారింది.

Updated : 06 Dec 2022 06:18 IST

మరుగుదొడ్లు నిర్మించుకున్నా జరగని బిల్లుల చెల్లింపులు

స్వచ్ఛ భారత్‌ కింద నిర్మించిన మరుగుదొడ్డి

భువనగిరి, న్యూస్‌టుడే: పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చేందుకు.. బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా ప్రకటించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణంలో నిధుల కొరత లబ్ధిదారుల పాలిట శాపంగా మారింది. ఆవాస ప్రాంతాల్లో ఇంటింటా వ్యక్తిగత మరుగుదొడ్లు ఉండాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీలో ఈ పథకాన్ని చేపట్టింది. 2014 అక్టోబరులో గాంధీజయంతి రోజున స్వచ్ఛభారత్‌ కింద ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. విస్తృతస్థాయిలో ప్రచారం చేసి మరుగుదొడ్లు నిర్మించుకోవాలని లబ్ధిదారుల వెంట పడ్డారు. జిల్లాలో ఉద్యమంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా ప్రకటించారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో గ్రామీణ పేదలు ఉత్సాహంగా మరుగుదొడ్లు నిర్మించుకున్నా.. బిల్లుల చెల్లింపులో గత మూడేళ్లుగా తీవ్ర జాప్యం జరుగుతోంది. ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా 11,436 మంది బిల్లుల చెల్లింపుల కోసం ఎదురుచూస్తున్నారు. సుమారు రూ.12.42 కోట్ల బకాయిలను చెల్లించాల్సి ఉంది.

మూడేళ్లుగా నిలిచిన చెల్లింపులు

ప్రభుత్వ ప్రచారం, అధికారుల ఒత్తిడితో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకుని మూడేళ్లు గడిచినా..బిల్లులు రాక లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. అధికారుల చుట్టూ తిరుగుతున్నా చెల్లింపుల ప్రస్తావనే రావడం లేదు. 2014కు ముందు గ్రామీణ ఉపాధిహామీ పథకంలో వీటి నిర్మాణాలు చేపట్టారు. స్వచ్ఛ భారత్‌ మిషన్‌ కింద నిధులు విడుదల చేశారు. ఎంపిక చేసిన లబ్ధిదారులకు రూ.12 వేలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. బిల్లులను రెండు విడతల్లో ఇవ్వాల్సి ఉంది. 2019 సెప్టెంబరు నుంచి బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. నిర్మితమైన మరుగుదొడ్ల ఫొటోలు, బిల్లులను అధికారులకు ఇచ్చి బిల్లులు చెల్లించాలని కోరుతున్నా ప్రభుత్వంలో స్పందన లేదు. అప్పులు చేసి నిర్మించుకున్న పేదలు బిల్లులు రాక గగ్గోలు పెడుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అడ్డగూడూరు, నారాయణపురం వలిగొండ మండలాల్లో బిల్లులు పొందని లబ్ధిదారులు ఎక్కువమంది ఉన్నారు.  


ప్రభుత్వానికి నివేదించాం
- మందడి ఉపేందర్‌రెడ్డి, డీఆర్డీవో, యాదాద్రి భువనగిరి

2019 నుంచి లబ్ధిదారులకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చాం. రెండు నెలల క్రితం గ్రామీణ పారిశుద్ధ్య కమిటీల అకౌంట్ల వివరాలను పూర్తిస్థాయిలో సేకరించి ప్రభుత్వానికి పంపాం. ప్రభుత్వం నిధులు విడుదల చేయగానే చెల్లింపుల ప్రక్రియ సాగుతుంది. ప్రభుత్వం వివరాలు కోరినందున త్వరలోనే నిధులు విడుదల చేసే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని