logo

డబ్బు పోగేస్తూ.. సమస్యలపై స్పందిస్తూ..!

వాట్సప్‌ను సమాచారం కోసం వినియోగిస్తుంటారు. కానీ దేవరకొండ యువకులు సేవ చేయడానికి వాడుతున్నారు. నియోజకవర్గంలోని యువత గ్రూప్‌ సభ్యులుగా మారారు.

Updated : 06 Dec 2022 06:13 IST

సూర్యాపేటలో ఏలేటి ఆశ్రమ పాఠశాలకు దుస్తులు పంపిణీ చేస్తున్న హెల్పింగ్‌ హ్యాండ్స్‌ అసోసియేషన్‌ సభ్యులు

దేవరకొండ, న్యూస్‌టుడే: వాట్సప్‌ను సమాచారం కోసం వినియోగిస్తుంటారు. కానీ దేవరకొండ యువకులు సేవ చేయడానికి వాడుతున్నారు. నియోజకవర్గంలోని యువత గ్రూప్‌ సభ్యులుగా మారారు. హెల్పింగ్‌ హ్యాండ్స్‌గా నామకరణం చేసుకున్నారు.  సుమారు రూ.10 లక్షలకు పైగా పేద వారికి ఆర్థిక సాయం చేశారు. ప్రతినెల ఎనిమిదో తేదీ లోపు ప్రతి గ్రూపు సభ్యుడు రూ.100 జమ చేస్తాడు. వాటిని ఆపదలో ఉన్న వారికి సాయం చేస్తుంటారు. ఈ గ్రూపులో అనేక వృత్తుల వారు, ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులు ఉన్నారు.చేయి చేయి కలిపి ముందడుగు వేస్తున్నారు.

చేసిన  కార్యక్రమాలు ఇవే..

*  తలసేమియాతో బాధపడే చిన్నారులకు దేవరకొండ, హైదరాబాద్‌లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి హెల్పింగ్‌ హ్యాండ్స్‌ సొంత ఖర్చులతో ఆసుపత్రికి వెళ్లి రక్తం అందజేస్తున్నారు.

*  కరోనా  సమయంలోనూ హెల్పింగ్‌ హ్యాండ్స్‌ గ్రూపు సభ్యులు ఇంటింటికి వెళ్లి దాదాపు 100 మందికి భోజనం అందించారు.

*  నిజామాబాద్‌ జిల్లాకు చెందిన శ్రీనిజకు గుజరాత్‌ యూనివర్సిటిలో బీటెక్‌లో సీటు వచ్చింది. పేదరికంతో బాధపడుతున్న ఆమెకు రూ.70 వేల ఆర్థిక సాయం అందించారు.

*  నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేటకు చెందిన గృహిణి భర్తను కోల్పోయారు. ఆమెకు ఇద్దరు చిన్నారులు ఉండడంతో రూ.50వేల సాయాన్ని అందించారు.

*  సూర్యాపేటలో ఆలేటి ఆశ్రమ పాఠశాలకు దుస్తులు అందజేశారు.

*  హయత్‌నగర్‌ సుధీర్‌ ఫౌండేషన్‌లోని ఇద్దరు అనాథ పిల్లలను దత్తత తీసుకొని చదివిస్తున్నారు.


గ్రూప్‌ సభ్యుల సహకారంతో..
- అన్వేష్‌రెడ్డి, నిర్వాహకులు

హెల్పింగ్‌హ్యాండ్స్‌ను 2019లో 17 మందితో ప్రారంభించాం. ఎంత దూరమైనా గ్రూపు సభ్యులతో కలిసి బాధితుని వద్దకు వెళ్లి సాయం అందిస్తున్నాం. ఇప్పటి వరకు సుమారు రూ.10 లక్షలకు పైగా ఆర్థికసాయం చేశాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని