logo

తొలి వీధి దీపం వెలిగిందిక్కడే

నిజాం నవాబులు తొలిసారి జనరేటర్‌తో వీధి దీపం వెలిగించింది గుర్రంపోడు మండలం సుల్తాన్‌పురంలోనే.

Updated : 22 Dec 2022 05:56 IST

నిజాం నవాబులు తొలిసారి జనరేటర్‌తో వీధి దీపం వెలిగించింది గుర్రంపోడు మండలం సుల్తాన్‌పురంలోనే. ఆనాటి నిజాం సుల్తానుకు కేంద్ర కార్యాలయం వారు లేఖ రాస్తూ.. వీధి దీపాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అయితే ఇక్కడే ఓ చిన్న పొరపాటు దొర్లింది. హైదరాబాద్‌లోని సుల్తాన్‌బజార్‌కు బదులుగా సుల్తాన్‌పురం అని లేఖలో తప్పుగా అచ్చయింది. నిజాం అధికారులు సుల్తాన్‌పురం ఎక్కడ ఉందో ఆరా తీసి చింతపల్లి సమితి పరిధిలో (ప్రస్తుతం గుర్రంపోడు మండలం) సుల్తాన్‌పురం ఉన్నట్లుగా గుర్తించి  వెంటనే ఇసుపస్తంభాలు తెప్పించి గ్రామంలో అన్నివీధుల్లో పాతించారు. డీజిల్‌ జనరేటర్‌ను సుల్తాన్‌పురం పంపించి బిగించారు. డ్రమ్ముల కొద్దీ డీజిల్‌ కూడా తెప్పించారు. విద్యుత్తు దీపాలు కూడా ఏర్పాటు చేసి జనరేటర్‌ సాయంతో వెలిగించారు. ఆ రోజుల్లో  జనం వచ్చి ఈ దీపాలను చూసి ఆశ్చర్యపోయారట. అయితే జరిగిన తప్పిదం తెలుసుకొన్న అధికారులు ఇక్కడి జనరేటర్‌, ఇసుప స్తంభాలు, వీధిదీపాలను తీసుకెెళ్లేందుకు  సుల్తాన్‌పురం రాగా ఇక్కడ జనం అడ్డుకున్నారు. దీంతో అధికారులు వెనక్కు వెళ్లిపోయి సుల్తాన్‌బజార్‌లో కరెంటు దీపాల ఏర్పాటు చేశారు. సుమారు మూడు నెలల పాటు జనరేటర్‌ సాయంతో దీపాల వెలుగులు కొనసాగాయని, కొంతకాలం తర్వాత అధికారులు వచ్చి జనరేటర్‌ను తీసుకువెళ్లారని గ్రామస్థులు చెబుతున్నారు. ఆనాడు పాతిన కరెంటు ఇనుపస్తంభాలు నాటి సంఘటనకు గుర్తుగా గ్రామవీధుల్లోనే ఉన్నాయి.

గ్రామంలో ఆనాటి ఇసుప కరెంటు స్తంభం ఇది

న్యూస్‌టుడే, గుర్రంపోడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని