logo

లక్ష్య సాధకులు

పుష్కరకాలం పాటూ జర్నలిస్టుగా పనిచేసి వ్యవసాయంపై ఉన్న మక్కువతో అందులో వస్తున్న నూతన సాంకేతికతను గ్రామీణ ప్రాంతంలోని రైతులకు అందించాలనే ఉద్దేశంతో యూట్యూబర్‌గా మారారు జూలకంటి రాజేందర్‌రెడ్డి.

Published : 12 Jan 2023 05:57 IST

‘ మీకు సాయం చేస్తున్న వారిని మరువకండి’..అన్న సూక్తిని పాటించి ఒకరు.. ‘ లక్ష్యంపై ఉన్న శ్రద్ధ, ఆసక్తి లక్ష్య సాధనలో సైతం చూపించాలి..’..అన్న నినాదంతో మరొకరు..‘ఓడిపోతాననే భయంతో ప్రయత్నించకపోవడం కంటే.. ప్రయత్నంచి ఓడిపోవడం మేలు..’..అన్న మంచి మాటలతో ఇంకొకరు..‘ మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి..’..అనే మంచి పదాలు స్వీకరించిన పలువురు యువతీయువకులు తమ జీవితానికి ఓ గమ్యాన్ని నిర్దేశించుకున్నారు.. అందుకు తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని.. వడివడిగా అడగులు వేస్తున్నారు.. ఈ పయనంలో పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు.. పురస్కారాలు పొందుతున్నారు..అంతకుమించి అంతులేని సంతృప్తిని అనుభవిస్తున్నారు.

న్యూస్‌టుడే, సూర్యాపేట పట్టణం


సాంకేతిక సాగుబడిలో..!

‘ తెలుగు రైతుబడి ’కి లక్ష ఫాలోవర్స్‌ దాటిన సందర్భంగా యూట్యూబ్‌ ఇచ్చిన మెమొంటోతో రాజేందర్‌రెడ్డి

ఈనాడు, నల్గొండ: పుష్కరకాలం పాటూ జర్నలిస్టుగా పనిచేసి వ్యవసాయంపై ఉన్న మక్కువతో అందులో వస్తున్న నూతన సాంకేతికతను గ్రామీణ ప్రాంతంలోని రైతులకు అందించాలనే ఉద్దేశంతో యూట్యూబర్‌గా మారారు జూలకంటి రాజేందర్‌రెడ్డి. ప్రస్తుతం ‘తెలుగు రైతుబడి’ యూట్యూబ్‌ ఛానెల్‌ అంటే రెండు రాష్ట్రాల్లోనూ వ్యవసాయ రంగంలో తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. రైతులు తాము సాగులో అవలంభిస్తున్న నూతన పద్ధతులు, అత్యాధునిక సాంకేతికతను వారితోనే చెప్పిస్తూ మిగతా రైతులకు వారితో పలు సలహాలు, సూచనలు అందిస్తున్నారు. కేవలం రెండున్నరేళ్లలో యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో పది లక్షల మందికి పైగా ఫాలోవర్స్‌ను సొంతం చేసుకొని తెలుగులో టాప్‌ - 100 యూట్యూబర్‌ల లిస్టులో చోటు దక్కించుకున్నారు. మూడు మాధ్యమాల్లో కలిపి ఇప్పటి వరకు 35 కోట్లకు పైగా వ్యూస్‌ వచ్చాయి. తాను చేసిన వీడియోలకు ప్రస్తుతం రోజుకు సగటున 6 లక్షల వ్యూస్‌ వస్తున్నాయంటే అవి క్షేత్రస్థాయికి ఎంతగా చేరుకున్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రతి నెలా సగటున 15 వీడియోలు చేస్తున్న ఆయన ఇప్పటి వరకు వ్యవసాయంలో వస్తున్న అత్యాధునిక సాంకేతిక పరికరాలు, పంటలపై 450 వీడియోలు, వందకు పైగా షార్ట్‌ రీల్స్‌ చేశారు.


సమాజ సేవకు పునరంకితం..!

రక్తదానం చేస్తున్న యువకుడు

భువనగిరి, భువనగిరి పట్టణం: సమాజం నుంచి పొందింది తిరిగి సమాజానికి ఇవ్వాలన్న అంశంపై యువతలో అవగాహన కల్పించేందుకు భువనగిరి పట్టణానికి చెందిన కొందరు యువకులు యువ టీం పేరుతో సంఘటితమయ్యారు. సామాజిక సేవా దృక్పథంతో ముందుకు సాగుతున్నారు.  పట్టణంలోని ప్రజల సామాజిక, ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేసిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సూదగాని రాజు 2009లో వంద మందిని సంఘటితం చేసి యువ టీంను ఏర్పాటు చేశారు. విద్యార్థులు, సాప్ట్‌వేర్‌ ఇంజినీర్లు, ప్రవాస భారతీయులు, ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నారు. ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా కొనసాగుతున్న సూదగాని రాజు ఇన్ఫోసిస్‌ సంస్థ మమత ట్రస్ట్‌లో సభ్యుడిగా కొనసాగుతున్నారు. యువ టీం సభ్యులు, మమత ట్రస్ట్‌ అందిస్తున్న ఆర్థిక సహకారంతో సామాజిక సేవ కార్యక్రమాలు ప్రతి ఏటా చేపడున్నారు. గత రెండు సంవత్సరాలుగా పలు ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న 22 మంది పేద విద్యార్థులకు ఇప్పటి వరకు రూ.2.50 లక్షల ఫీజు చెల్లించి చదివిస్తున్నారు. గత ఐదేళ్లుగా ఇద్దరు పేద విద్యార్థులను దత్తత తీసుకుని రూ.30వేలు ఉపకార వేతనాలు ఇస్తూ చదివిస్తున్నారు. గత ఆరు సంవత్సరాలుగా పట్టణంలోని 250 మంది పదో తరగతి విద్యార్థులకు సుమారు లక్ష రూపాలయల విలువైన స్టడీ మెటీరియల్‌ పంపిణీ చేశారు.


వివేకానందుడి స్ఫూర్తితో..

మిర్యాలగూడ: పేదలు విద్యకు దూరమవుతున్నపుడు..విద్యయే పేదవారి వద్దకు వెళ్లాలి.. అన్న స్వామి వివేకానందుడి బోధనల స్ఫూర్తితో కస్తూరి ఫౌండేషన్‌ సంస్థ ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా కార్యక్రమాలు చేపడుతుంది. 2017 జూన్‌ 22న కొందరు యువకులతో ఏర్పాటు చేసిన కస్తూరి ఫౌండేషన్‌ కార్యక్రమాలు చేపడుతూ తెలంగాణ, ఏపీలో తమవంతు సామాజిక బాధ్యతను నెరవేర్చుతున్నారు.  పలు ప్రభుత్వ పాఠశాలలకు ఇప్పటి వరకు రూ.50 లక్షల విలువచేసే ఎల్‌ఈడీ ప్రొజెక్టర్లు అందించారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బ్యాగులు, నీటి బాటిళ్లు, నోటుపుస్తకాలు అందించారు. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేకంగా స్టడీ మెటీరియల్‌ అందించడంతో పాటుగా 10 జీపీఏ సాధించిన వారికి రూ.10వేలు ఆర్థిక సాయం అందించారు. వాడపల్లికి చెందిన నిరుపేద విద్యార్థిని బైకాని అపర్ణ , బకాల్‌వాడ పాఠశాలకు చెందిన అఫ్రోజ్‌బేగం, వైద్యం వైష్ణవిల ఉన్నత చదువులకు సాయం అందిస్తున్నారు.


ప్రజాహితం.. యువకుల అభిమతం

పెదవీడులో తలసేమియా బాధితుల కోసం రక్తదానం చేసిన ‘ప్రజాహితం’ యువజన సంఘం సభ్యులు

మఠంపల్లి: ఆ గ్రామంలో యువకులంతా ఒక్కటయ్యారు. ప్రజావసరాలను గుర్తించి వాటిని సమకూర్చడంతో పాటు అనారోగ్య బాధితులకు ఆపన్న హస్తం అందించాలని భావించారు.. అక్కడి యువ ఉద్యోగులూ ఆర్థిక సహకారం అందించేందుకు ముందుకు వచ్చారు. వారంతా ‘ప్రజాహితం’.. పేరుతో ఓ యువజన సంఘాన్ని ఏర్పాటు చేసి మూడేళ్లుగా స్వచ్ఛంద సేవలందిస్తున్నారు. పెదవీడులో 2,000 సంవత్సరంలో ఈ సంఘం ప్రారంభమైంది. 2021, 22 సంవత్సరాల్లో తలసేమియా బాధితుల కోసం ప్రత్యేకంగా 150 మంది యువకులు 150 యూనిట్ల రక్తాన్ని ఖమ్మంలోని ఓ ఆసుపత్రికి అందజేశారు. కొవిడ్‌-19 ఉద్ధృతంగా ఉన్న సమయంలో గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో బాధితుల కోసం 40రోజులు ఐసోలేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఉచితంగా భోజన వసతులు, మందులు సమకూర్చారు.


పురస్కారాల వికీపీడియన్‌

అసెంబ్లీ మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి నుంచి అవార్డు స్వీకరిస్తున్న ప్రణయ్‌రాజ్‌ వంగరి

మోత్కూరు: అంతర్జాలంలో అతిపెద్ద విజ్ఞాన సర్వస్వమైన తెలుగు వికీపీడియా 19 సంవత్సరాలు పూర్తిచేసుకుని 20వ వసంతంలోకి అడుగుపెట్టింది. మోత్కూరుకు చెందిన ప్రణయ్‌రాజ్‌ వంగరి వికీపీడియన్‌గా రోజుకొకటి చొప్పున 2017లో ఏడాది పాటు వరుసగా 365 కథనాలు రాసి ప్రపంచ స్థాయి గుర్తింపు పొందారు. 2022లో మొత్తంగా 850 వ్యాసాలు రాసి వికీపీడియాలో పొందుపరుస్తూ తన రికార్డును తానే అధిగమించారు. ఈయన 2016 నుంచి తెలుగు వికీపీడియాలో రోజుకో వ్యాసం రాస్తున్నారు. 2016 జూన్‌లో ఇటలీలో జరిగిన అంతర్జాతీయ స్థాయి వికీపీడియన్‌ సదస్సుకు అధికారికంగా హాజరయ్యారు. 2016 సెప్టెంబరులో మన దేశంలోని చండీగఢ్‌లో జరిగిన ప్రపంచ స్థాయి సదస్సుకు అధికారికంగా హాజరై పలువురి ప్రశంసలు, అవార్డులందుకున్నారు. ‘2022 డిసెంబరు నాటికి 80 వేలకు పైగా తెలుగు వ్యాసాలు వికీపీడియాలోకి చేరాయ’ని ప్రణయ్‌రాజ్‌ చెప్పారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన 26,811 గ్రామాలు, 1,277 మండలాలకు చెందిన పేజీలు ఉన్నాయని పేర్కొన్నారు.


అంతర్జాతీయ స్థాయిలో.. అదర గొడుతూ

నల్గొండ క్రీడావిభాగం: కట్టంగూర్‌ మండలం బొల్లేపల్లి గ్రామం. తండ్రి వ్యవసాయం చేస్తుంటాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఐశ్వర్య చిన్ననాటి నుంచే వాలీబాల్‌ క్రీడపై మక్కువ పెంచుకుంది. పాఠశాల స్థాయిలోనే ఈ ఆటలో శిక్షణ పొంది పాల్గొన్న ప్రతి పోటీల్లో విజయాలు సాధిస్తూ ముందుకు సాగింది. ఈ విద్యార్థిని ప్రస్తుతం నల్గొండ నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కళాశాలలో నిత్యం శిక్షకుల పర్యవేక్షణలో సాధన చేస్తూ తన ఆటను మరింత మెరుగుపర్చుకుంటుంది. గతేడాది సెప్టెంబర్‌ నెలలో థాయిలాండ్‌లో జరిగిన అంతర్జాతీయ స్థాయి బీచ్‌ వాలీబాల్‌ పోటీల్లో పాల్గొని అత్యుత్తమ ప్రదర్శన చేసి బహుమతితో పాటు ప్రశంసాపత్రం అందుకుంది. ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో 10 సార్లు, రాష్ట్ర స్థాయిలో 11 సార్లు ఆడి ఎన్నో బహుమతులు, ప్రశంస పత్రాలు అందుకుంది. ఒక వైపు చదువులో ఉత్తమ ఫలితాలు సాధిస్తూనే...క్రీడల్లో సత్తా చాటుతూ ఇతర విద్యార్థులకు ఐశ్వర్య ఆదర్శంగా మారింది.


వైకల్యం ఉన్నా.. వైద్య విభాగాల్లో రాణిస్తూ..

ఆరోగ్యమిత్రగా ప్రసందల, ఫార్మాసిస్ట్‌గా ఆయేషా

రాజపేట: అంగవైకల్యం కలిగి ఉన్నప్పటికీ కుంగిపోకుండా.. ఎంచుకున్న వృత్తిలో రాణిస్తూ ఉన్నతాధికారుల మన్ననలు పొందుతున్నారు ఈ మహిళా ఉద్యోగులు.  

అవకాశం అందుకొని..

రాజపేట మండలం పారుపల్లికి చెందిన చాడ ప్రసందల పోలియో కారణంగా పుట్టుకతో అంగవైకల్యం కలిగి ఉన్నప్పటికీ చదువుపైన ఇష్టంతో బీఏ, బీఈడీ పూర్తి చేసింది. ఉపాధ్యాయ వృత్తిని కొద్దిలో పోగొట్టుకున్నప్పటికీ కుంగిపోలేదు. తనకు అందివచ్చిన అవకాశంగా భావిస్తూ స్థానికంగా ప్రాథమిక ఆరోగ్యకేంద్రం పరిధిలో పద్నాలుగు సంవత్సరాల క్రితం ఆరోగ్యమిత్రగా విధుల్లో చేరారు. పనిపట్ల ఉన్న అంకిత భావానికి శాఖాపరంగా అనేక పర్యాయాలు ప్రశంసలు అందుకున్నారు. రానున్న రోజుల్లో మరింత సేవ చేయాలనే తలంపుతో ఉన్నట్లు ప్రసందల వివరించారు.

యునానీ ఆసుపత్రిలో..

పోలియో మహమ్మారి కారణంగా తనకు కలిగిన వైకల్యానికి కుంగిపోకుండా ఆయుష్‌ పరిధిలో నిర్వహించే రాజపేట యునానీ ఆసుపత్రిలో ఫార్మాసిస్ట్‌గా విధులు చేపడుతున్నారు ఆయేషా. పేదరికం కారణంగా చదువును ఇంటర్‌తోనే ముగించినప్పటికీ ఫార్మాసిస్ట్‌గా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పరచుకున్నారు ఆయేషా. ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్‌ లేని మందుల వినియోగంపై స్థానికులకు పలు దఫాలుగా సమావేశాల ద్వారా అవగాహన కల్పిస్తుండటం ఈవిడ ప్రత్యేకత. అనునిత్యం ఈవిడ చేపడుతున్న కార్యక్రమాలకు, క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న విధులకు శాఖాపరంగా ఉన్నతాధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పలు పర్యాయాలు అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని