logo

అట్లాస్‌లో ఇట్లున్నం..!

గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలోనే అత్యధికంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే రైతులు మరణించారని ‘రాష్ట్ర గణాంకాల నివేదిక - అట్లాస్‌’ వెల్లడించింది.

Updated : 27 Jan 2023 06:15 IST

రైతు మరణాలు అధికం
పంటల సాగు, రహదారుల్లో అగ్రస్థానం

ఈనాడు, నల్గొండ : గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలోనే అత్యధికంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే రైతులు మరణించారని ‘రాష్ట్ర గణాంకాల నివేదిక - అట్లాస్‌’ వెల్లడించింది. పంటల సాగుతో పాటూ జాతీయ, పంచాయతీ, రహదారులు భవనాల శాఖ ఆధ్వర్యంలో ఉన్న రహదారులు ఎక్కువగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే ఉన్నాయని నివేదిక పేర్కొంది.

* ముగిసిన 2021 - 22 ఏడాదిలో రాష్ట్రంలోనే అత్యధికంగా వరి, పత్తిని సూర్యాపేట, నల్గొండ జిల్లాలోనే పండించడం గమనార్హం. సూర్యాపేట జిల్లాలో రెండు సీజన్లు కలిపి 9.07 లక్షల ఎకరాల్లో వరి సాగవగా..నల్గొండ జిల్లాలో 8.96 లక్షల ఎకరాల్లో అన్నదాతలు వరిని సాగు చేశారు. యాదాద్రి జిల్లాలో 4.21 లక్షల ఎకరాలతో పంటల సాగులో రాష్ట్రంలో 8వ స్థానంలో నిలిచింది. విభాజ్య నల్గొండ జిల్లాలో గతేడాది 6.53 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. యాదాద్రిలో 1.25 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పత్తి పంటను సాగు చేశారు.

* ఒకప్పుడు భూగర్భజలాలు లేక అల్లాడిన ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పుడు అన్ని మండలాల్లోనూ భూగర్భ జలలభ్యత ఆశాజనకంగా ఉంది. నల్గొండ జిల్లాలోని 32 మండలాల్లో 26 మండలాల్లో నీటి లభ్యత మెరుగ్గా ఉండగా..ఆరు మండలాల్లో రానున్న రోజుల్లో కొంత ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి నెలకొందని నివేదిక పేర్కొంది. సూర్యాపేటలో మొత్తం 23 మండలాలకు 21 మండలాల్లో భూగర్భజలాలు గణనీయంగా ఉండగా..రెండు మాత్రమే సెమి క్రిటికల్‌ మండలాలున్నాయి. యాదాద్రిలోని మొత్తం 17 మండలాల్లోనూ నీటి లభ్యత ఆశాజనకంగా ఉన్నట్లు ‘అట్లాస్‌’ నివేదిక పేర్కొంది.

* ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాల శాతం నల్గొండ జిల్లాలో మెరుగ్గా ఉంది. సూర్యాపేటలోనూ పరిస్థితి కొంత ఫర్వాలేకున్నా యాదాద్రిలో నిరుత్సాహంగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ఈ ఏడాది (2022 - 23) ఆగస్టు వరకు నల్గొండ జిల్లాలో 4,267 కేసీఆర్‌ కిట్లను ప్రభుత్వం పంపిణీ చేయగా...సూర్యాపేటలో 2,354, యాదాద్రి జిల్లాలో 1,313 కిట్లను పంపిణీ చేసింది.  


నివేదికలోని ముఖ్యాంశాలు

* 2018 నుంచి 2022 మార్చి వరకు నల్గొండ జిల్లాలో 5673 మంది రైతులు వివిధ కారణాలతో మరణించగా.. వారందరికీ ప్రభుత్వం రైతుబీమా కింద ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేసింది. ఇందులో అత్యధికంగా 39 నుంచి 48 ఏళ్ల వారే 2035 ఉండగా...18 ఏళ్ల నుంచి 28 ఏళ్ల వరకున్న యువరైతులు 221 మంది మరణించడం గమనార్హం. గతంలోనే రైతు ఆత్మహత్యల్లో నల్గొండ జిల్లా ప్రథమ స్థానంలో ఉండగా, ఇప్పుడు ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలోనూ ఈ విషయం స్పష్టం కావడం ఆందోళనకర పరిణామం. సూర్యాపేటలో 2989 మంది రైతులు మరణించగా.. వారి కుటుంబాలకు రైతు బీమాను ప్రభుత్వం అందజేసింది. యాదాద్రిలో 2474 కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందింది.


* జాతీయ రహదారులతో పాటూ పంచాయతీరాజ్‌, రహదారులు భవనాల శాఖ (ఆర్‌అండ్‌బీ) ఆధ్వర్యంలోని రహదారుల్లో ఉమ్మడి జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా నుంచి రాష్ట్రంలోనే రద్దీ రహదారి అయిన హైదరాబాద్‌ - విజయవాడ, హైదరాబాద్‌ - వరంగల్‌, కోదాడ - జడ్చర్ల, సిరోంచ - రేణిగుంట రహదారులతో పాటూ సుమారు ఏడు వరకు జాతీయ రహదారులు వెళుతుండగా, ప్రస్తుతం కొన్ని నిర్మాణంలో ఉన్నాయి.


* రాష్ట్రంలోనే అత్యధికంగా సూర్యాపేట జిల్లాలో ఉపాధి కూలీలు ఎక్కువగా పనిచేస్తున్నారు. మొత్తం జాబ్‌కార్డులున్న వారిలో 47 శాతం ప్రజలు కూలీ పని చేస్తున్నట్లు నివేదిక పేర్కొంది. పేరు నమోదు చేసుకొని పని చేస్తున్న వారు నల్గొండ జిల్లాలో 30 శాతం మాత్రమే ఉండగా...యాదాద్రిలో 28 శాతం ఉంది.


* ఫ్లోరైడ్‌ పీడిత నల్గొండ జిల్లాకు ఇంటింటికీ తాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మిషన్‌ భగీరథ పథకం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలోని అన్ని గ్రామీణ ఆవాసాలకు నూరు శాతం మంచినీరు అందుతుందని నివేదిక వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని