logo

సమగ్రాభివృద్ధితో ముందుకు..

అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన పథకాలు, ప్రణాళికలను అమలు చేస్తూ జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళతామని కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం కలెక్టరేట్‌ ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు.

Published : 27 Jan 2023 06:11 IST

ఇంటింటికి మిషన్‌ భగీరథ నీరు
పరిశ్రమల స్థాపనతో నిరుద్యోగులకు ఉపాధి
రూ. 399 కోట్లతో రెండు వరుసల రహదారులు
పురపాలికల్లో చురుకుగా అభివృద్ధి పనులు
నిరాడంబరంగా గణతంత్ర వేడుక
జెండాకు వందనం చేస్తున్న కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి

నల్గొండ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన పథకాలు, ప్రణాళికలను అమలు చేస్తూ జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళతామని కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం కలెక్టరేట్‌ ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆయన అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ సారథ్యంలో ప్రజాసంక్షేమానికి వినూత్న పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఈ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.ఈ పథకాలన్నీ ప్రతి పేద వ్యక్తిని అభ్యుదయ పథంలో నడిపించేలా అమలు జరుగుతున్నాయన్నారు. వాటి పురోగతిని ఆయన  ప్రస్తావించారు. వేడుకలకు జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి, అదనపు కలెక్టర్లు భాస్కర్‌రావు, ఖుష్భూగుప్త, జడ్పీ ఛైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రేగట్టె మల్లిఖార్జున్‌రెడ్డి, పుర చైర్మన్‌ సైదిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.  

కలెక్టర్‌ మీడియాకు అందించిన ప్రసంగ పాఠమిలా..

రూ.504 కోట్లు పంపిణీ.. రైతుబంధు పథకం కింద యాసంగి 2022 సీజన్లలో 4.79 లక్షల మంది రైతులకు రూ.595 కోట్లు పంపిణీకీ నిర్దేశించగా ఇప్పటి వరకు 4.60 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.504 కోట్లు జమ అయ్యాయి. రైతుబీమా పథకం కింద జిల్లాలో మరణించిన 409 మంది రైతుల కుటుంబాలకు రూ.20.45 కోట్లు ఎల్‌ఐసీ ద్వారా జమ అయ్యాయి.యాసంగి సీజన్‌కు సంబంధించి 60.77 వేల మెట్రిక్‌ టన్నుల  ఎరువులు రైతులకు అందుబాటులో ఉంచాం.

గొర్రెల పంపిణీకి రూ. 356 కోట్లు ఖర్చు.. జిల్లాలో ఇప్పటి వరకు 28,234 యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేశాం. దీనికి రూ.356 కోట్లు ఖర్చు చేశాం. జిల్లాలో వంద శాతం రాయితీతో 1005 చెరువుల్లో రూ.5.61 కోట్ల విలువైన చేప పిల్లలను వదిలాం. పాడి రైతులకు 28.94 కోట్ల ఖర్చుతో పాడి పశువులను పంపిణీ చేశాం.

1718 ఆవాసాలకు మిషన్‌ భగీరథ తాగునీరు.. జిల్లాలో మిషన్‌ భగీరథ పథకం ప్రతి గ్రామంలో ఇంటింటికీ తలకు 100 లీటర్ల చొప్పున, పురపాలిక, నగర పంచాయతీల్లో 135 లీటర్ల చొప్పున రక్షిత మంచినీరు సరఫరా జరుగుతోంది.  

844 ఓడీఎఫ్‌ గ్రామాలు.. జిల్లాలో స్వచ్ఛభారత్‌ మిషన్‌ పథకం కింద 15,673 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేశాం. ఓడీఎఫ్‌ కింద ఇప్పటి వరకు 844 గ్రామాలు ఆరుబయట మల విసర్జన రహితంగా  ప్రకటించాం. గృహ నిర్మాణ పథకంలో భాగంగా 2,981 రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి 210 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశాం.

నల్గొండ కలెక్టరేట్‌లో జెండాకు వందనం చేస్తున్న కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, ఎస్పీ రెమారాజేశ్వరి, అదనపు కలెక్టర్లు భాస్కర్‌రావు, ఖుష్భూగుప్తా, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, తదితరులు

పరిశ్రమల స్థాపనతో ఉపాధి.. టీఎస్‌ ఐపాస్‌ ద్వారా ఇప్పటి వరకు 85 పరిశ్రమల ఏర్పాటుకు 147 అనుమతులు ఇప్పించాం. తద్వారా రూ.413.71 కోట్ల పెట్టుబడి లభించి 1447 మందికి ఉపాధి పొందుతున్నారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద 2022-23 సంవత్సరంలో ఇప్పటి వరకు 110 ప్రాజెక్టులకు రూ.3.51 కోట్ల రాయితీతో మంజూరు చేశాం.

రహదారులు.. రెండు వరుసల రహదారి సౌకర్యం లేని మండలాలను జిల్లా కేంద్రంతో అనుసంధానానికి, ఇతర ప్రధాన రహదారులను రెండు వరుసల రహదారులుగా అభివృద్ధి చేసేందుకు రూ.399 కోట్లు మంజూరు చేశాం. ఇందులో  290 కి.మీ. రహదారి పనులు పూర్తయ్యాయి.

పురపాలికల్లో అభివృద్ధి.. నల్గొండ పురపాలికలో అభివృద్ధి పనులకు రూ.702.76 లక్షలు మంజూరయ్యాయి. ఆ పనులు పురోగతిలో ఉన్నాయి. మిర్యాలగూడ పురపాలికలో వివిధ పథకాల కింద రూ.115 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. దేవరకొండ, హాలియా, చండూరు, చిట్యాల, నందికొండ, నకిరేకల్‌ పురపాలికలకు ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో అభివృద్ధి కార్యక్రమాలు చురుకుగా సాగుతున్నాయి.

దళితబంధుకు రూ.47.29 కోట్ల ఖర్చు.. జిల్లాలో దళితబంధు పథకం కింద 517 లబ్ధిదారుల కుటుంబాలకు ఆర్థిక లక్ష్యంగా రూ.51.17 కోట్లు కేటాయించాం.  ఇప్పటి వరకు రూ.47.29 కోట్లతో   యూనిట్లు పంపిణీ చేశాం.

కంటి వెలుగు కార్యక్రమం.. జిల్లాలో 844 గ్రామ పంచాయతీల్లో 1026 శిబిరాల ద్వారా వంద రోజుల్లో కంటి పరీక్షలు నిర్వహించే కార్యక్రమం కొనసాగుతోంది. కేసీఆర్‌ కిట్‌ పథకంలో భాగంగా 4 విడతలుగా గర్భిణులకు రూ.27.30 కోట్ల నగదు ప్రోత్సాహకం అందజేశాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు