logo

నిధులు మంజూరైనా నిర్లక్ష్యమే!

బొమ్మలరామారం మండలం హాజీపూర్‌ -మాచనపల్లి, బండకాడిపల్లి-మునిరాబాద్‌ గ్రామాల మధ్యగల శామీర్‌పేట వాగులపై వంతెనలు లేకపోవడంతో దశాబ్దాల కాలంగా పరిసర గ్రామాల ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

Published : 29 Jan 2023 04:34 IST

శామీర్‌పేట వాగుపై హాజీపూర్‌-మాచనపల్లి మధ్య వంతెన నిర్మించాల్సిన ప్రాంతం

ఆలేరు, బొమ్మలరామారం, న్యూస్‌టుడే: బొమ్మలరామారం మండలం హాజీపూర్‌ -మాచనపల్లి, బండకాడిపల్లి-మునిరాబాద్‌ గ్రామాల మధ్యగల శామీర్‌పేట వాగులపై వంతెనలు లేకపోవడంతో దశాబ్దాల కాలంగా పరిసర గ్రామాల ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను గుర్తించిన ప్రభుత్వం హాజీపూర్‌-మాచనపల్లి మధ్యఉన్న వాగుపై వంతెన నిర్మాణానికి రూ.6.31 కోట్లు, బండకాడిపల్లి-మునిరాబాద్‌ మధ్యగల వాగుపై వంతెన నిర్మాణానికి రూ.1.61కోట్లు మంజూరు చేసింది. టెండర్లు కూడా ఖరారయ్యాయి. పనులు ప్రారంభానికి నోచుకోవడం లేదు.

ఇవీ.. ఇబ్బందులు..

శామీర్‌పేట వాగు ప్రవహించే సమయంలో వాగుకు అవతల ఉన్న మునిరాబాద్‌కు రాకపోకలు నిలిచిపోతాయి. విద్యార్థులు జలాల్‌పురంలోని పాఠశాలకు వెళ్లలేకపోతున్నారు. సూచనపల్లి, మర్యాల, నాయకునితండా, చౌదర్‌పల్లి గ్రామాల విద్యార్థులు మండల కేంద్రంలోని పాఠశాలలకు హాజరుకాలేక పోతున్నారు. వాగుకారణంగా 20 కి.మీ దూరం తిరిగి వెళ్తేకానీ పాఠశాలలకు వెళ్లలేని పరిస్థితి. ఆయా గ్రామాల ప్రజలు పనుల నిమిత్తం మండల కేంద్రానికి, హైదరాబాద్‌, భువనగిరి, యాదాద్రిలకు వెళ్లాలన్నా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.

వంతెనల నిర్మాణం జరిగితే...

హాజీపూర్‌- మాచనపల్లి. బండకాడిపల్లి- మునీరాబాద్‌ గ్రామాల మధ్య షామీర్‌పేట వాగుపై వంతెనలు నిర్మిస్తే మండలంలోని సగం గ్రామాలకు ప్రయోజనం కలుగుతుంది. మండల కేంద్రానికి హైదరాబాద్‌, జిల్లా కేంద్రమైన భువనగిరి, యాదాద్రిలకు వెళ్లేందుకు సౌకర్యంగా ఉంటుంది. ధాన్యం, కూరగాయులు విక్రయించేందుకు, ప్రయాణించే దూరం తగ్గుతుంది. వ్యవసాయ బావులు, బోర్లలో నీటి సామర్థ్యం పెరుగుతుంది.  


చర్యలు తీసుకుంటాం

-వెంకటేశ్వర్లు, డీఈ, పీఆర్‌, యాదాద్రి భువనగిరి 

హాజీపూర్‌-మాచనపల్లి గ్రామాల మధ్యలో ఉన్న షామీర్‌పేట వాగు బ్రిడ్జి నిర్మించేందుకు ప్రధాన మంత్రి సడక్‌ యోజనలో నిధులు మంజూరయ్యాయి. టెండర్లు దక్కించుకున్న గుత్తేదారులకు నోటీసులు జారీచేశాం. త్వరలో పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు