logo

జలఆశయం.. దూరం.. దూరం..!

ఫ్లోరైడ్‌ పీడిత ఉమ్మడి నల్గొండ జిల్లాకు కృష్ణా జలాలను అందించాలనే లక్ష్యంతో ఆరేళ్ల క్రితం తలపెట్టిన డిండి ఎత్తిపోతల పథకం, శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ)లో భాగంగా నిర్మిస్తున్న నక్కలగండి, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టులో భాగంగా లక్ష ఎకరాలకు సాగునీరు అందించే ఉదయసముద్రం బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టులు నిధుల కేటాయింపులు లేకపోవడంతో నీరసిస్తున్నాయి.

Published : 29 Jan 2023 04:34 IST

నిధుల్లేక నీరసిస్తున్న ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు
ఈసారైనా బడ్జెట్‌లో కేటా‘యింపు’లు చేస్తేనే కల సాకారం
ఈనాడు, నల్గొండ

బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టులో మోటార్లు బిగించడానికి తవ్విన సర్జ్‌పూల్‌

ఫ్లోరైడ్‌ పీడిత ఉమ్మడి నల్గొండ జిల్లాకు కృష్ణా జలాలను అందించాలనే లక్ష్యంతో ఆరేళ్ల క్రితం తలపెట్టిన డిండి ఎత్తిపోతల పథకం, శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ)లో భాగంగా నిర్మిస్తున్న నక్కలగండి, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టులో భాగంగా లక్ష ఎకరాలకు సాగునీరు అందించే ఉదయసముద్రం బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టులు నిధుల కేటాయింపులు లేకపోవడంతో నీరసిస్తున్నాయి. వీటితో పాటు రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు, 560 గ్రామాలకు తాగునీరు అందించే ఏఎమ్మార్పీ కాల్వ లైనింగ్‌, తుంగుతుర్తి, సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాలకు సాగునీరు అందిస్తున్న ఎస్సారెస్పీ రెండో దశ కాల్వల డిశ్చార్చిలెవల్‌ పెంచడం, సీసీ లైనింగ్‌లకు భారీగా నిధుల అవసరం కానుంది. ఈ బడ్జెట్‌లో నిధుల కేటాయింపు, పరిహారం అందజేత, నిర్వాసితులకు పునరావాసం వేగిరపరిస్తేనే ఈ ప్రాజెక్టులు పూర్తయ్యే అవకాశం ఉంది.

డిండికి కావాలి.. దండిగా నిధి

పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా  దేవరకొండ, మునుగోడు, నల్గొండ నియోజకవర్గాల్లోని దాదాపు 3 లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందించాలనే లక్ష్యంతో నిర్మిస్తున్న డిండి ఎత్తిపోతల పథకంలో జిల్లాలో ఐదు జలాశయాలు నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు గతేడాది బడ్జెట్‌లో రూ.300 కోట్లు కేటాయించగా..రూ.200 కోట్ల వరకు నిధులను ప్రభుత్వం విడుదల చేసిందని తెలిసింది. అంతకుముందు ఏడాది రూ.545 కోట్లు కేటాయించినా విడుదల మాత్రం సగం కూడా లేకపోవడం గమనార్హం. ప్రాజెక్టు శంకుస్థాపన వేళ  రూ.6వేల కోట్లతో పరిపాలన అనుమతులు మంజూరు చేసిన ప్రభుత్వం ఇప్పటి వరకు దాదాపు రూ.3500 కోట్ల వరకు ఖర్చు చేసింది.  భూ సేకరణ సమస్య  ప్రహసనంగా మారింది. ఐదు జలాశయాల పరిధిలో దాదాపు రూ.300 కోట్ల వరకు బిల్లులు గుత్తేదారులకు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఈ ఎత్తిపోతల పథకంపై ఇటీవలే ప్రభుత్వానికి భారీగా జరిమానా విధిస్తూ జాతీయ హరిత ట్రైబ్యూనల్‌ (ఎన్జీటీ) తీర్పు విడుదల చేసింది. ఈ ఎత్తిపోతల నిర్మాణంలో భాగంగా పాలమూరు జిల్లాలో ఎక్కడ నుంచి నీటిని మళ్లించాలనే అంశంపైనా ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.

రెండేళ్లుగా ఆగిన.. నక్కలగండి

శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) ద్వారా జలాశయం వెనకజలాలను ఆధారంగా చేసుకొని ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మారుమూల చందంపేట మండలంలో నిర్మిస్తున్న నక్కలగండి ప్రాజెక్టు సైతం చివరి దశలో ఉంది. 3 లక్షల ఎకరాల ఆయకట్టు, 7.25 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ప్రస్తుతం క్రస్టుగేట్ల నిర్మాణం పూర్తి చేసుకుంది. దాదాపు రూ.430 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు ఇప్పటి వరకు రూ.350 కోట్ల వరకు ఖర్చుచేయగా.. ఇందులో రూ.100 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. రెండేళ్లుగా నిధుల విడుదల లేకపోవడంతో గుత్తేదారు పనులను ఆపివేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన నిర్వాసితులకు ఇంకా పునరావాసం చెల్లించాల్సి ఉంది.

కాలువ లైనింగ్‌ ఎన్నడో?

ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వకు లైనింగ్‌ కోసం నిధులు కేటాయించాలని  అధికారులు ఏళ్లుగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతూనే ఉన్నారు. మూడేళ్ల క్రితమే రూ.350 కోట్ల వరకు అవసరమని ప్రతిపాదనలు పంపగా...తాజాగా అవి రూ.500 కోట్లకు చేరాయి. గతేడాది సైతం ఈ ప్రాజెక్టు నిర్వహణకు అరకొర నిధులే కేటాయించారు. జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతో పాటు నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని ఉదయసముద్రం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ను ఈ ప్రధాన కాల్వ ద్వారానే నింపుతారు. ఈ ఏడాది నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు పూర్తిగా నిండటంతో ఈ కాల్వ కింద ఉన్న ఆయకట్టుకు నీళ్లందించడంతో పాటు ఉదయ సముద్రానికి గరిష్ఠంగా నీళ్లను వదులుతున్నారు. దీంతో 90 కి.మీ. మేర పొడవు ఉన్న ఈ కాల్వ లీకేజీలకు గురవుతోంది. ఈ బడ్జెట్‌లోనైనా కాల్వ లైనింగ్‌కు నిధులు కేటాయిస్తే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది.

చివరి దశలో.. ఉదయ సముద్రం చతికిల

నల్గొండ, నార్కట్‌పల్లి, చిట్యాల, కట్టంగూరు, నకిరేకల్‌, రామన్నపేట మండలాల్లోని లక్ష ఎకరాలకు సాగునీరు, మరికొన్ని గ్రామాలకు తాగునీరు అందించే ఉదయ సముద్రం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌కు అనుబంధంగా నిర్మిస్తున్న బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టు చివరి దశలో ఉంది. పదమూడేళ్ల క్రితం ప్రారంభించిన ఈ ప్రాజెక్టుకు రూ. 699 కోట్లతో అప్పటి ప్రభుత్వం పరిపాలన అనుమతులను మంజూరు చేసింది.   ఈ ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన 11.6 కి.మీ. సొరంగ మార్గంలో దాదాపు 11 కి.మీ మేర పనులు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు రూ.500 కోట్లకు పైగా ఖర్చు చేసి, 80 శాతం మేర పనులు పూర్తి చేశారు. కాల్వలు, భూ సేకరణకు మరో రూ.400 కోట్ల వరకు అవసరమని సంబంధిత అధికార వర్గాలు వెల్లడించాయి. కొంతకాలం నుంచి నిధులు లేకపోవడంతో గుత్తేదారు పనులను చురుగ్గా కొనసాగించడం లేదు. 2020 జనవరిలోనే ఈ ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టుకు నీళ్లందించాలని గడువు విధించుకున్నా విజయవంతం కాలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు