logo

కేసీఆర్‌ నాయకత్వాన్ని నిలబెట్టుకుందాం: మంత్రి

ఉద్యమ సమయంలో చెప్పిన ప్రతి మాటను కేసీఆర్‌ నిజం చేశారని విద్యుత్తుశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.

Published : 29 Jan 2023 04:34 IST

సూర్యాపేటలో కల్యాణలక్ష్మి చెక్కు లబ్ధిదారుకు పంపిణీ చేస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి

సూర్యాపేట (తాళ్లగడ్డ), న్యూస్‌టుడే: ఉద్యమ సమయంలో చెప్పిన ప్రతి మాటను కేసీఆర్‌ నిజం చేశారని విద్యుత్తుశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం నియోజకవర్గానికి చెందిన 424 మంది లబ్ధిదారులకు రూ.4.24 కోట్ల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు రూ. ఏడు వేల కోట్ల అభివృద్ధి పనులు పూర్తి చేసినట్లు చెప్పారు. తెలంగాణ తరహాలో అభివృద్ధిని దేశవ్యాప్తం చేసేందుకే భారాస ఆవిర్భవించిందని పేర్కొన్నారు. కేసీఆర్‌కు అండగా ఉండి ఆయన నాయకత్వాన్ని నిలబెట్టుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కేసీఆర్‌ చేపడుతున్న సంక్షేమ పథకాలను చూసి కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ప్రజలు సైతం తమను తెలంగాణలో కలపాలని డిమాండ్‌ చేస్తున్నారని చెప్పారు. సమావేశంలో ఆర్డీవో రాజేంద్రకుమార్‌, తహసీల్దార్‌ వెంకన్న, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

పెన్‌పహాడ్‌: రైతుల సంక్షేమమే భారాస ప్రభుత్వ లక్ష్యమని మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. మండలంలో శుభకార్యాలకు వెళుతూ మార్గమధ్యలో అనాజీపురం వద్ద రైతులతో మాట్లాడి వ్యవసాయాభివృద్ధిపై సమీక్షించారు. వరితో పాటు కూరగాయలు, తదితర పంటలు పండించి అదనపు ఆదాయాన్ని పొందాలన్నారు. మంత్రి వెంట ఎంపీపీ నెమ్మాది భిక్షం, సూర్యాపేట జడ్పీటీసీ సభ్యుడు జీడి భిక్షం, అనాజీపురం సర్పంచి చెన్ను శ్రీనివాస్‌రెడ్డి, భారాస మండల యూత్‌ అధ్యక్షుడు అనంతుల శ్రీనివాస్‌గౌడ్‌ పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని