logo

ఆర్టీసీలో సత్వర పార్సిల్‌ రవాణా

ఆర్టీసీ ఆదాయ అన్వేషణలో భాగంగా ఏర్పాటు చేసిన కార్గో సర్వీసును మరింత అభివృద్ధి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Published : 29 Jan 2023 04:34 IST

‘ఏఎం 2 పీఎం’ పేరుతో నూతన సేవలు

మిర్యాలగూడలోని లాజిస్టిక్స్‌ డెలివరీ కేంద్రం

మిర్యాలగూడ పట్టణం, న్యూస్‌టుడే: ఆర్టీసీ ఆదాయ అన్వేషణలో భాగంగా ఏర్పాటు చేసిన కార్గో సర్వీసును మరింత అభివృద్ధి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే సేవలను దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు కార్గో నుంచి లాజిస్టిక్స్‌గా పేరు మార్చారు. ఇక తాజాగా పార్సిళ్లను సత్వరమే రవాణా చేసేందుకు ‘ఏఎం 2 పీఎం’ పేరుతో నూతన సేవలను సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ ప్రారంభించారు. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన 99 లాజిస్టిక్స్‌ కేంద్రాల నుంచి రూ.99కే.. మధ్యాహ్న 12 గంటల లోపు పార్సిల్‌ బుక్‌ చేస్తే రాత్రి 9 గంటలకు.. రాత్రి 9 గంటల లోపు బుక్‌ చేస్తే మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు గమ్యస్థానానికి చేరవేయనున్నారు.

ఉమ్మడి జిల్లాలో మూడు డిపోల నుంచి..

రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన 99 కేంద్రాలలో ఉమ్మడి జిల్లా నుంచి నల్గొండ, మిర్యాలగూడ, సూర్యాపేట డిపోల నుంచి ‘ఏఎం 2 పీఎం’ సేవలు ప్రారంభమయ్యాయి. నల్గొండ డిపో నుంచి దిల్‌సుఖ్‌నగర్‌, ఎంజీబీఎస్‌, మిర్యాలగూడ, సూర్యాపేటకు; మిర్యాలగూడ డిపో నుంచి దిల్‌సుఖ్‌నగర్‌, ఎంజీబీఎస్‌, నల్గొండ, సూర్యాపేటకు; సూర్యాపేట డిపో నుంచి నల్గొండకు, సూర్యాపేట హైటెక్‌ బస్టాండ్‌ నుంచి ఎంజీబీఎస్‌కు ఎక్స్‌ప్రెస్‌ పార్సిల్‌ సేవలు అందించనున్నారు. ఇక హైదరాబాద్‌ ఆటోనగర్‌ నుంచి నల్గొండకు, దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి మిర్యాలగూడ, నల్గొండలకు, ఖమ్మం నుంచి కోదాడకు, ఎంజీబీఎస్‌ నుంచి నల్గొండకు సత్వర పార్సిల్‌ సర్వీసు అందుబాటులోకి వచ్చింది. 

బరువు కిలో లోపే ఉండాలి..

‘ఏఎం 2 పీఎం’లో భాగంగా బుక్‌ చేసే పార్సిల్‌ బరువు కిలోకు మించకుండా..విలువ రూ.5వేల లోపు మాత్రమే ఉండాలి. బుక్‌ చేసిన వారికి..డెలివరీ తీసుకునే వారికి సంక్షిప్త సందేశాలు పంపిస్తారు. ఇతర రాష్ట్రాల్లోని నగరాలకు ఐదు కిలోల బరువున్న పార్సిళ్లను రవాణా చేయనున్నారు.


సద్వినియోగం చేసుకోండి

-గిరి మహేష్‌, నల్గొండ, మహబూబ్‌నగర్‌ రీజియన్ల లాజిస్టిక్స్‌ అధికారి

వినియోగదారులకు సత్వర సేవలు అందించడమే లక్ష్యంగా ‘ఏఎం 2 పీఎం’ సేవలను పరిచయం చేస్తున్నాం. తద్వారా పార్సిల్‌ బుక్‌ చేసిన తర్వాత గరిష్ఠంగా 9 గంటల లోపు గమ్య స్థానానికి చేర్చడంతో పాటు ఆ పార్సిల్‌పై అనుక్షణం పర్యవేక్షణ చేయనున్నాం. ప్రస్తుతం ఒక కిలో వరకే అనుమతి ఉన్నప్పటికీ భవిష్యత్తులు గమ్యస్థానాలు, బుకింగ్‌ కేంద్రాలు పార్సిళ్ల బరువు సైతం పెంచే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని