logo

చిరుద్యోగులకు భవిష్యనిధి వరం

ఉద్యోగులకు భవిష్య నిధి (ఈపీఎఫ్‌) ఎంతో సహాయకారిగా ఉంటుంది. బర్కత్‌పుర ప్రాంతీయ కార్యాలయం పరిధిలో 33,714 సంస్థల ద్వారా 9,20,594 మంది ఈ పథకంలో లబ్ధి పొందుతున్నారు.

Published : 29 Jan 2023 04:34 IST

‘న్యూస్‌టుడే’తో సంస్థ సహాయ కమిషనర్‌ దామెర్ల శ్రీకాంత్‌
-చౌటుప్పల్‌, న్యూస్‌టుడే

ఉద్యోగులకు భవిష్య నిధి (ఈపీఎఫ్‌) ఎంతో సహాయకారిగా ఉంటుంది. బర్కత్‌పుర ప్రాంతీయ కార్యాలయం పరిధిలో 33,714 సంస్థల ద్వారా 9,20,594 మంది ఈ పథకంలో లబ్ధి పొందుతున్నారు. అవగాహన కల్పించి, సమస్యలు పరిష్కరించడానికి ప్రతినెలా సదస్సులు నిర్వహిస్తున్నామని ఉద్యోగ భవిష్యనిధి సంస్థ సహాయ కమిషనర్‌ దామెర్ల శ్రీకాంత్‌ చౌటుప్పల్‌లో ‘న్యూస్‌టుడే’ ముఖాముఖిలో తెలిపారు.

ప్రశ్న: ఉద్యోగ భవిష్య నిధిలో ఎలా చేరాలి?
సమాధానం:
20 అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న సంస్థలు, పరిశ్రమలు, అయిదుగురికంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న సినిమాహాళ్ల యజమానులు ఆన్‌లైన్‌లో epfindia.gov.in వెబ్‌సైట్‌లో రిజిష్టరు చేసుకుంటే కోడ్‌ నంబరు కేటాయిస్తారు. ఈ నంబరుతో భవిష్యనిధిలో పొదుపు చేసుకోవచ్చు.

ప్రశ్న: దీని వల్ల ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయి?
సమాధానం:
నెలకు రూ.15వేలు, అంతకు లోపు వేతనమున్న ఉద్యోగులు ఈ పథకంలో చేరవచ్చు. ఈ పథకంలో చేరితే ఉద్యోగి మూల వేతనంలో 12 శాతం, పరిశ్రమలు, సంస్థల యాజమాన్యాలు తమ వాటా 12 శాతం కలిపి పీఎఫ్‌ పథకంలో జమ చేయాలి. మా సంస్థ ఈ మొత్తం నుంచి 8.33 శాతం డబ్బును పింఛన్‌ నిధికి మళ్లిస్తుంది. మిగతా 15.67 శాతం ఉద్యోగి ఖాతాలో జమ అవుతుంది. ఈ డబ్బును 58 ఏళ్లకు ఉద్యోగ విరమణ పొందాక చక్ర వడ్డీతో ఉద్యోగికి చెల్లిస్తారు. కనీసం పది సంవత్సరాల సర్వీసు ఉన్న ఉద్యోగులకు పదవీవిరమణ తర్వాత పింఛను లభిస్తుంది. సర్వీసులో ఉండగా మరణిస్తే రూ.2.5-7లక్షల వరకు బీమా మొత్తాన్ని కుటుంబ సభ్యులకు అందజేస్తారు. భార్యకు, ఇద్దరు పిల్లలు 25 ఏళ్ల వయసు వచ్చే వరకు పింఛను మంజూరవుతుంది.

ప్రశ్న: పీఎఫ్‌ సదుపాయాలు అంతరాయం లేకుండా పొందాలంటే ఏం చేయాలి?
సమాధానం:
పీఎఫ్‌లో సమస్యలు రాకుండా ఉండాలంటే వారికి కేటాయించిన యూనివర్సల్‌ అకౌంట్‌ నెంబరు (యూఏఎన్‌)కు ఆధార్‌, ఫోన్‌, బ్యాంకు ఖాతా నెంబర్లను అనుసంధానం చేయాలి. ఏమైనా పొరపాట్లుంటే ఉద్యోగి, సంస్థల యాజమాన్యాలు సంయుక్త ప్రకటన ద్వారా సరి చేసుకోవాల్సి ఉంటుంది. బర్కత్‌పురలోని మా ప్రాంతీయ కార్యాలయం పరిధిలో యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ రంగారెడ్డి జిల్లాలున్నాయి. ఇక్కడికి వచ్చి సమస్యలను పరిష్కరించుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని