logo

ఉత్తుత్తి బ్యాంకులు.. నకిలీ పూచీకత్తులు

నకిలీ బ్యాంకు పూచీకత్తు పత్రాలతో మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును హైదరాబాద్‌ నగర సీసీఎస్‌ పోలీసులు బట్టబయలు చేశారు.

Published : 29 Jan 2023 04:24 IST

ఈనాడు, హైదరాబాద్‌: నకిలీ బ్యాంకు పూచీకత్తు పత్రాలతో మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును హైదరాబాద్‌ నగర సీసీఎస్‌ పోలీసులు బట్టబయలు చేశారు. నలుగురు నిందితులను అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో శనివారం సీసీఎస్‌ ఏసీపీ ఎస్‌.మోహన్‌కుమార్‌ మీడియాకు వివరాలు వెల్లడించారు. వరంగల్‌కు చెందిన జి.నాగరాజు(45) న్యాయవాది, లోన్‌ ఏజెంట్‌. హర్షిత ఇన్‌ఫ్రా సంస్థ ప్రతినిధులు ప్రజ్వల్‌, సందీప్‌రెడ్డికి గతంలో బ్యాంకు రుణం మంజూరుకు సహకరించాడు. కరీంనగర్‌ స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ చేపట్టిన బయో మైనింగ్‌ కాంట్రాక్టును హర్షిత ఇన్‌ఫ్రా దక్కించుకుంది. దీని కోసం సెక్యూరిటీగా రూ.2.5 కోట్లకు బ్యాంకు పూచీకత్తు అవసరమైంది. సంస్థ ప్రతినిధులు నాగరాజును సంప్రదించి సహకరించమని కోరారు. రూ.47 లక్షల కమీషన్‌ ఇచ్చారు. రాజస్థాన్‌కు చెందిన నరేష్‌శర్మ(52) నగరంలో బేరింగ్‌ల వ్యాపారం చేస్తూ ఇక్కడే స్థిరపడ్డాడు. ఇతడి ద్వారా నాగరాజు కోల్‌కత్తాకు చెందిన ఇద్దరి సహకారంతో అక్కడి ఓ బ్యాంకు బ్రాంచి ఇచ్చినట్లుగా రూ.3.25 కోట్ల విలువైన పూచీకత్తు పత్రాలు సేకరించాడు. వాటిని హర్షిత ఇన్‌ఫ్రా ప్రతినిధులు అధికారులకు అందజేశారు. అవి అనుమానాస్పదంగా ఉండటంతో అధికారులు చేపట్టిన విచారణలో నకిలీవని తేలింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంట్రాక్టులు రద్దు.. కరీంనగర్‌ స్మార్ట్‌ సిటీ పథకంలో హర్షిత్‌ ఇన్‌ఫ్రా 40 శాతం పనులు పూర్తిచేసింది. పలుచోట్ల నకిలీ పూచీకత్తు పత్రాలు దాఖలు చేసినట్లు తేలడంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నందికొండ, హుజూర్‌నగర్‌, దేవరకొండ, నేరేడుచర్ల, నల్గొండ, చిట్యాల పురపాలికల్లో ఈ సంస్థ కాంట్రాక్టులను ప్రభుత్వం రద్దు చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు