logo

మెట్ల బావికి పర్యాటక శోభ

ప్రాచీన ప్రాశస్తం గల రాయగిరిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ మెట్ల బావికి పూర్వ వైభవం తెచ్చే పనులు చురుగ్గా సాగుతున్నాయి.

Published : 30 Jan 2023 05:45 IST

ముమ్మరంగా పునరుద్ధరణ పనులు
పూర్వ వైభవం తెస్తున్నామని మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌

రాయగిరిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోని మెట్లబావి (కోనేరు)  

భువనగిరి, న్యూస్‌టుడే: ప్రాచీన ప్రాశస్తం గల రాయగిరిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ మెట్ల బావికి పూర్వ వైభవం తెచ్చే పనులు చురుగ్గా సాగుతున్నాయి. వారసత్వ సంపదను త్వరలో పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చేందుకు జిల్లా యంత్రాంగం కార్యాచరణ మొదలెట్టింది. కలెక్టర్‌ పమేలా సత్పతి ప్రత్యేక చొరవతో రూ.33 లక్షల అంచనా వ్యయంతో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పునరుద్ధరణ పనులు చకచకా జరుగుతున్నాయి. యాదాద్రికి కేవలం ఐదు కిమీ దూరంలో ఉంది. 600 సంవత్సరాల క్రితం అద్భుత కట్టడాలతో నిర్మితమైన ఈ ప్రాచీన దేవాలయం భువనగిరి మండలం రాయగిరి రైల్వే స్టేషన్‌ సమీపంలో ఉంది. రైల్వే ట్రాక్‌కు ఒక వైపు గుట్టపైన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం, మరో పక్కన యాదాద్రి వైపు మెట్లబావి (కోనేరు) చతురస్ర ఆకారంలో ఉంది. పైన మంటపం ఉంది. దేవాలయానికి చెందిన సుమారు 10 ఎకరాల భూమి కూడా ఉంది. కాకతీయులు, రెడ్డిరాజుల కాలంలో ఈ ఆలయం నిర్మించిన్నట్లు చరిత్ర చెబుతోంది. ప్రతి యేటా ఫిబ్రవరి మాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఆ బావిలోనే స్వామి వారికి చక్రతీర్థం జరుపుతాయాయి. బ్రహ్మోత్సవాల సమయంలో తప్ప పట్టించుకోరు. దేవుని భూమి ఉన్నప్పటికీ ఏళ్ల తరబడి ఆలయ నిరాధరణకు గురైంది. అప్పుడే చక్కటి కళా నైపుణ్యంతో శిలలతో ఆకర్శణీయంగా చతురస్ర ఆకారంలో మెట్ల బావిని నిర్మించారు. స్వామి వారి చక్రతీర్థం అక్కడే నిర్వహిస్తారు. ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో క్రమంగా శిథిలావస్థకు చేరుకుంది. ఆలయ కమిటీ సభ్యులు పట్టించుకుని బ్రహ్మోత్సవాల సమయంలో సున్నం, రంగులు మాత్రం వేయిస్తూ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నా ఇప్పటి వరకు ప్రభుత్వ పరంగా ఎలాంటి సహకారం లభించలేదు. ఆలయ అభివృద్ధి, పరిరక్షణకు చర్యలు తీసుకోలేదు.

కొనసాగుతున్న పూడికతీత పనులు


చకాచకా పనులు  

మున్సిపల్‌ కమిషనర్‌ చొరవతో ఈ ప్రాంగణాన్ని సందర్శించిన కలెక్టర్‌ పమేలా సత్పతి మెట్ల బావిని పర్యాటకంగా తీర్చిదిద్దాలని మున్సిపల్‌ కమిషనర్‌ను ఆదేశించారు. ఈ మేరకు రూ.33 లక్షలతో పనులు చేపట్టారు. ఫిబ్రవరి 4 నుంచి 8వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతుండటంతో మెట్లబావి పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారు. చౌటుప్పల్‌ పైలాన్‌ పనులు చేపట్టిన సంస్థకే ఈ పనులు అప్పగించారు. బావిలో పూడిక తీత, కొత్తగా బోరు వేయించడం, మెట్ల సుందరీకరణ, గోడలు, మంటపానికి రంగులు వేసే పనులు జరుగుతున్నాయి. పది ఎకరాల ఖాళీ ప్రదేశం చుట్టూ మొక్కలు నాటడం, నడక దారి, మంచినీటి సదుపాయం, వాష్‌ రూంలు, రెండు హైమాస్క్‌ లైట్లు, వీధి దీపాల ఏర్పాటు చేస్తున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ నాగిరెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యే నాటికి పూడికతీత, రంగులు వేయడం, వీధి దీపాల పనులు పూర్తవుతాయని చెప్పారు. మిగిలిన పనులు 10 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. చారిత్రాత్మక కట్టడాల పూర్వవైభవం తెచ్చేందుకు ఇదే సరైన సమయం అంటూ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. మెట్లబావి సుందరీకరణ పనులు చేపట్టినట్లు అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి ఫొటోతో సహా ట్వీట్‌కు మంత్రి స్పందిస్తూ తిరిగి ట్విట్‌ చేశారు.


మరిన్ని నిధులు కేటాయించాలి..

-చింతల కిష్టయ్య, మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌

యాదాద్రికి సమీపంలో ఉన్న దేవాలయానికి పూర్వ వైభవం తేచ్చేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలి. మున్సిపాలిటీ కేటాయించిన నిధులు రూ.33 లక్షలు సరిపోవు. అరుదైన వారసత్వ సంపదను పరిరక్షించి మెట్లబావిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి. భావితరాలకు మన ప్రాచీన కళా వైభవాన్ని చాటేందకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని