logo

ఆసక్తి పెంచేలా.. సృజనకు పదును పెట్టేలా..!

నూతన అవకాశాలను అన్వేషించడం.. ఆధునిక కాలంలో వినియోగం, ప్రాథమిక స్థాయిలో ఆసక్తి పెంచడమే లక్ష్యంగా రాష్ట్రస్థాయి సైన్స్‌ సదస్సు నిర్వహణకు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్టీ) సిద్ధమైంది.

Published : 01 Feb 2023 05:33 IST

పరిశోధన పత్రాల ఆహ్వానం.. రేపటి వరకు గడువు

ఎస్‌సీఈఆర్టీ వెబ్‌సైట్‌ ముఖ చిత్రం

ఆలేరు, న్యూస్‌టుడే: నూతన అవకాశాలను అన్వేషించడం.. ఆధునిక కాలంలో వినియోగం, ప్రాథమిక స్థాయిలో ఆసక్తి పెంచడమే లక్ష్యంగా రాష్ట్రస్థాయి సైన్స్‌ సదస్సు నిర్వహణకు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్టీ) సిద్ధమైంది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలోని సైన్స్‌ ఉపాధ్యాయుల నుంచి పరిశోధన పత్రాల దరఖాస్తులను ఎస్‌సీఈఆర్టీ ఆహ్వానిస్తోంది. ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్‌ దినోత్సవాన్ని పురస్కరిచుకుని ఏటా ఎస్‌సీఈఆర్టీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

పాల్గొనేందుకు అర్హతలు.. అంశాలు..

అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, ప్రైవేటు బీఈడీ, డీఈడీ టీచర్‌ ఎడ్యుకేటర్లు, ఎన్‌జీవోలు, సైన్స్‌ ఎడ్యుకేషన్‌కు సంబంధించిన వారు ఇందులో పాల్గొనొచ్చు. ఇలాంటి వారు జిల్లాలో పది వేలకు పైగా ఉన్నారు. వీరితో పాటు సైన్స్‌ ఎడ్యుకేటర్లు, క్షేత్రస్థాయిలో పని చేసే పరిశోధకులు ఉన్నారు. వీరంతా సదస్సును సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ సారి సదస్సుకు సంబంధించి ప్రధాన అంశం ‘దేశాన్ని స్వావలంబనగా మార్చడానికి సైన్స్‌ సంస్కృతిని ప్రోత్సహించడం’ కాగా, మరో ఐదు ఉప అంశాలున్నాయి. వీటి ఆధారంగా ఉపాధ్యాయులు వారి అనుభవాలను పరిశోధన పత్రాల రూపంలో పంపాల్సి ఉంటుంది.

వెయ్యి పదాలకు మించకుండా..

ఆసక్తిగల సైన్స్‌ ఉపాధ్యాయులు తమ పరిశోధన పత్రాలను గురువారం నాటికి పంపాల్సి ఉంటుంది. వెయ్యి పదాలకు మించకుండా నాలుగు పేజీలలో రాసి పంపాలి. ఆంగ్లం, తెలుగు భాషల్లో ఏదైనా ఒకదాన్ని ఎంచుకోవాలి. పీడీఎఫ్‌ రూపంలో tgscertmathsscience@gmail.com అనే మెయిల్‌ ఐడీకి పంపాలి. పరిశోధన పత్రాలను సమర్పించిన పత్రాలను ఎస్‌సీఈఆన్‌టీ పరిశీలించి ఎంపికైన వారికి ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్‌ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సదస్సులో పాల్గొనే అవకాశం కల్పిస్తారు. ఉత్తమ అంశాలను క్షేత్రస్థాయిలో అమలు పరిచేలా చర్యలు తీసుకుంటారు. సదస్సుకు ఎంపికైన వారికి టీఏ, డీఏ చెల్లిస్తారు.


సద్వినియోగం చేసుకోవాలి
- భరణి కుమార్‌, జిల్లా సైన్స్‌ అధికారి, యాదాద్రి భువనగిరి

ఈ అవకాశాన్ని సైన్స్‌ ఉపాధ్యాయులు, అధ్యాపకులు సద్వినియోగం చేసుకోవాలి. ఆలోచనలు, అనుభవాలను తెలిపేందుకు భాగస్వాములు కావాలి. సైన్స్‌ బోధనా విధానంలో మార్పులను తీసుకొచ్చేందుకు ఏటా సదస్సు నిర్వహిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని