logo

వచ్చేస్తోంది.. మహా జాతర

శ్రీ లింగమంతుల స్వామి జాతరకు మరో ఐదు రోజులు మాత్రమే గడువు ఉంది. జాతరకు లక్షల మంది హాజరయ్యేందుకు అవకాశం ఉంది. దీంతో వివిధ రకాల వ్యాపారాలకు ఇది నెలవు కానుంది.

Published : 01 Feb 2023 05:33 IST

గట్టు జాతర వద్ద గాజులు విక్రయిస్తున్న మహిళలు (పాతచిత్రం)

సూర్యాపేట కలెక్టరేట్, చివ్వెంల, న్యూస్‌టుడే: శ్రీ లింగమంతుల స్వామి జాతరకు మరో ఐదు రోజులు మాత్రమే గడువు ఉంది. జాతరకు లక్షల మంది హాజరయ్యేందుకు అవకాశం ఉంది. దీంతో వివిధ రకాల వ్యాపారాలకు ఇది నెలవు కానుంది. ఏటా వివిధ రకాల వ్యాపారాలు నెలకొల్పి రూ.లక్షల్లో ఆదాయం పొందుతున్నారు. గుట్ట సమీపంలో వ్యాపారాలు నెలకొల్పేందుకు రూ.వేలల్లో వేలం పాటలు పాడి మరీ దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు ఎదురు చూస్తుంటారు.జాతరలో ముఖ్యంగా మహిళలకు కావాల్సిన గాజులు, చిన్నారులకు బొమ్మలు, ఆట వస్తువులు, కుటుంబ సభ్యులు సరదాగా గడిపేందుకు ఎగ్జిబిషన్‌ వంటివి అందుబాటులో ఉంటాయి. అన్నీ కలిపి రూ.కోట్లలో వ్యాపారం జరుగనుంది.

ఆకర్షణగా ఎగ్జిబిషన్‌..

జాతరకు వచ్చిన భక్తులు ముందుగా దేవుడి దర్శనం కోసం వెళ్తారు. ఆ తర్వాత ఎగ్జిబిషన్‌కు ప్రాధాన్యం ఇస్తారు. ఎగ్జిబిషన్‌లో వివిధ రకాల ఆట వస్తువులు, సాహసాలు చేసేవి, జాయింట్ వీల్‌ తదితర వస్తువులు ఉంటాయి. గత జాతరలో రూ.50 నుంచి రూ.80 లక్షల ఆదాయం పొందినట్లు అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం మరో అయిదు రోజుల్లో ప్రారంభమయ్యే జాతరకు ఇప్పటికే ఎగ్జిబిషన్‌ ఏర్పాట్లు సాగుతున్నాయి.

ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌

గాజుల విక్రయం..

జాతరలో గాజులకు ప్రత్యేక స్థానం ఉంటుంది. చేతికి అలంకార ప్రాయంగా కాకుండా సంప్రదాయంగా వీటిని భావిస్తుంటారు. సంప్రదాయానికి ప్రతీకగా తమ ఇంటి ఆడపడుచులకు గాజులు తొడిగేందుకు ఆసక్తి చూపుతారు. దేవుడి దగ్గర గాజులు కొనుగోలు చేసేందుకు ప్రాధ్యాన్యం ఇస్తుండటంతో జాతర సమయంలో గట్టు చుట్టూ గాజులు దుకాణాలు దర్శనమిస్తుంటాయి. గతంలో గాజుల వ్యాపారం మీద రూ.లక్షల్లో ఆదాయం పొందారు. ఇప్పటి నుంచే వ్యాపారులు దుకాణాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

అందుబాటులో అన్ని రకాల ఆట వస్తువులు

జాతరకు తల్లిదండ్రులతో కలిసి చిన్నారులు కూడా వస్తుంటారు. వారికి నచ్చిన అన్ని రకాల ఆట వస్తువులు లభిస్తుండటంతో కొనుగోలు చేసేందుకు శ్రద్ధ చూపుతారు.  ఇక్కడ అన్ని రకాల ఆట వస్తువులను ప్రధాన రహదారి నుంచి మొదలు గుట్ట వరకు ఏర్పాటు చేస్తారు. ఈ ఆట వస్తువుల మీద రూ.వేలల్లో ఆదాయం పొందుతారు.


మాంసం వ్యాపారులకు ఆదాయం..

గట్టు వద్ద విక్రయిస్తున్న కుండలు

రెండేళ్లకోసారి జరిగే జాతర కావడంతో ప్రత్యేకంగా మొక్కులు తీర్చేందుకు భక్తులు ఎదురు చూస్తుంటారు.యాదవుల కుల దైవమైన లింగమంతుల స్వామి జాతరకు  ఇక్కడ స్థానికంగా ఉండేవారు వారు బంధువులు, స్నేహితులను  పిలుచుకుని ఘనంగా నిర్వహిస్తుంటారు. జాతర వద్ద బోనమెత్తిన అనంతరం జీవాలను బలిచ్చి సంప్రదాయయంగా జరుపుకుంటారు. అప్పటికప్పుడు కావాల్సిన వారి కోసం ప్రత్యేకంగా నాటు కోళ్ల దుకాణాలు సైతం ఏర్పాటు చేస్తారు. గొర్రె పోతులు కావాల్సిన వారికి అక్కడే అందుబాటులో లభిస్తుండటంతో వాటిని కొనుగోలు చేస్తుంటారు. ఈ వ్యాపారం మీద వారు ప్రతిసారి రూ.వేలల్లో ఆదాయం పొందుతారు. బోనమెత్తేందుకు కుండల అవసరం కావడంతో వాటిని కూడా అక్కడికే తెచ్చి విక్రయిస్తుంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని