logo

పోడుస్తోంది..!

పోడు భూములు సాగు చేస్తున్న వారికి ఆ భూములపై హక్కు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2021 నవంబరులో దరఖాస్తులు స్వీకరించింది.

Published : 01 Feb 2023 05:39 IST

ఏడాదిగా నిరీక్షిస్తున్న దరఖాస్తుదారులు

పోడుభూముల కోసం దరఖాస్తు చేసుకునేందుకు చందంపేట తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చిన గిరిజనులు (పాతచిత్రం)

నల్గ్గొండ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: పోడు భూములు సాగు చేస్తున్న వారికి ఆ భూములపై హక్కు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2021 నవంబరులో దరఖాస్తులు స్వీకరించింది. పోడు సమస్యను పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం అర్హులైన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. గిరిజనులు, గిరిజనేతరులు హక్కుపత్రాల జారీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గ్రామాల వారీగా అటవీ హక్కుల కమిటీలను ఏర్పాటు చేసి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. వాటిని పూర్తిస్థాయిలో క్రోడీకరించారు.  

క్షేత్ర స్థాయిలో ఇలా..

దరఖాస్తుల పరిశీలనను ఎఫ్‌ఆర్‌సీల ఆధ్వర్యంలో చేపట్టారు. క్షేత్రస్థాయి పరిశీలనలో వారితో పాటు రెవెన్యూ, అటవీ అధికారులు పాల్గొన్నారు. ముఖ్యంగా పోడు ఏ సంవత్సరం నుంచి చేస్తున్నారో నిర్ధరించడం కోసం కార్టోశాట్‌(ఉపగ్రహ) చిత్రాలను వినియోగించారు. పోడు భూముల దరఖాస్తులు వచ్చిన గ్రామాల్లో గ్రామసభల ద్వారా సర్వేను నిర్వహించారు. జిల్లా కమిటీ సభ్యులు అర్హుల జాబితాను తయారు చేసి ప్రభుత్వానికి నివేదించారు. అర్హులైనవారి పేరున పట్టాదారు పాసుపుస్తకాలు ముద్రించి సిద్దంగా పెట్టుకోవాలని జిల్లా అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.

63 పంచాయతీల్లో..

నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ, దేవరకొండ రెవెన్యూ డివిజన్ల పరిధిలో 13 మండలాల్లోని 63 గ్రామ పంచాయతీల పరిధిలో పోడు భూములు ఉన్నాయి. రెండు డివిజన్లలో సుమారు 13,700 ఎకరాల్లో పోడు సాగు జరుగుతున్నట్లు అధికారులు అంచనా వేశారు. అయితే అధికారుల అంచనాకు మించి దాదాపు 43 వేల ఎకరాల వరకు పోడు భూములకు సంబంధించి రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. దేవరకొండ డివిజన్‌లో 20791 ఎకరాల విస్తీర్ణంలో 4884 మంది గిరిజన రైతులు, 2744 మంది గిరిజనేతరులు దరఖాస్తులు సమర్పించారు. మిర్యాలగూడ డివిజన్‌లో దాదాపు 22 వేల ఎకరాల విస్తీర్ణంలో 8032 మంది గిరిజన రైతులు, 1761 మంది గిరిజనేతరులు దరఖాస్తు చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని