logo

ప్లాట్ల కేటాయింపు పూర్తి

నృసింహసాగర్‌ జలాశయంలో ముంపునకు గురవుతున్న బీఎన్‌ తిమ్మాపూర్‌ గ్రామస్థులకు ప్లాట్ల కేటాయింపు ప్రక్రియ బుధవారం ముగిసింది.

Published : 02 Feb 2023 05:27 IST

 గొడవ ప్రారంభమై.. ప్రశాంతంగా ముగిసింది 

1048 మందికి లబ్ధి

నిర్వాసితులకు ప్లాటు కేటాయింపు పత్రం అందజేస్తున్న దృశ్యం

భువనగిరి,న్యూస్‌టుడే: నృసింహసాగర్‌ జలాశయంలో ముంపునకు గురవుతున్న బీఎన్‌ తిమ్మాపూర్‌ గ్రామస్థులకు ప్లాట్ల కేటాయింపు ప్రక్రియ బుధవారం ముగిసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 16వ ప్యాకేజీలో బస్వాపూర్‌లో 11.39 టీఎంసీల సామర్థ్యంతో జలాశయం నిర్మిస్తున్న విషయం విధితమే. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, కలెక్టర్‌ ప్రమేలా సత్పతి ప్రత్యేక చొరవతో ప్లాట్ల కేటాయింపు పూర్తి చేశారు. రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో లాటరీ పద్ధతిన 1048 మంది నిర్వాసితులకు  కేటాయించారు. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీలో భాగంగా భువనగిరి మున్సిపల్‌ పరిధిలోని హుస్సేనాబాద్‌ గ్రామ శివారులోని ప్రభుత్వ భూమి సర్వే నెంబర్‌ 107లో 94 ఎకరాల స్థలంలో లేవుట్‌ను చేశారు. సుమారుగా రూ.30 కోట్లతో మౌలిక సదుపాయాలతో లేఅవుట్‌ను అభివృద్ధి చేస్తున్నారు.  

డ్రాపైన వాదోపవాదనలు..

ప్లాట్ల కేటాయించాలని మంగళవారం కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో కలెక్టర్‌, ఎమ్మెల్యే నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గ్రామ ప్రజా ప్రతినిధులు, ప్రజలకు సమాచారం ఇచ్చారు. లే-అవుట్‌లో పూర్తి స్థాయిలో సౌకర్యాలు సమకూర్చనందున డ్రా వాయిదా వేయాలని కొందరు అభ్యంతరం చెప్పారు. గ్రామంలో ఉదయం సమావేశమైనిర్వాసితులో చాలామంది అభ్యంతరం చెప్పారు. మాకు చెప్పకుండా అంగీకరించారని ఎమ్పీటీసీ, ఉపసర్పంచిని అడ్డుకున్నారు. వాదోపవాదాల అనంతరం గ్రామస్థులు డ్రా తీసే వేదిక వద్దకు ఒక్కొక్కరిగా రావడం మొదలు పెట్టారు. వచ్చిన కొందరు ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డితో వాదనకు దిగారు. పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించకముందే ప్లాట్లు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. పక్షం రోజుల్లో సౌకర్యాలన్నీ కల్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చాక శాంతించారు. గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు అందరూ వచ్చాక ప్లాట్ల కేటాయింపు ప్రక్రియను మొదలు పెట్టారు.
*  ప్లాట్లు కేటాయించినందుకు ఇళ్ల నిర్మాణాలు వెంటనే చేపట్టుకోవచ్చుని అధికారులు తెలిపారు. నిర్మాణం ప్రారంభించే వారికి విద్యుత్‌, నీటి సదుపాయం తాత్కాలికంగా కల్పిస్తామని చెప్పారు.
*    ఉదయం 10గంటలకు ప్రారంభం కావల్సి ఉండగా గ్రామస్థులు ఆలస్యం రావడంతో మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 6.15 గంటలకు సాఫీగా ముగిసింది. వేదిక వద్ద ప్రతి ఒక్కరూ లాటరీని వీక్షించే విధంగా మూడు పెద్ద ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేశారు. నీటి, భోజన వసతి ఏర్పాటు చేశారు. గ్రామ ఎమ్పీటీసీ సభ్యురాలు శారద, సర్పంచి లత పాల్గొన్నారు. ఒక డబ్బాలో పేర్లు, మరో డబ్బాలో ప్లాట్ల నెంబర్లు వేసి లాటరీ తీశారు. పు±నరావాసం డబ్బులు, పునర్‌ నిర్మాణానికి ప్లాట్లు కేటాయించడంతో ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ప్రధాన ఘట్టం ముగిసింది. ఇక గ్రామంలో నిర్మాణాలు, ఇళ్ల స్థలాకు పరిహారం, భూనిర్వాసితులకు రూ.195 కోట్లు చెల్లిస్తే బీఎన్‌ తిమ్మాపూర్‌కు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ పూర్తవుతుంది.  కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవో భూపాల్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు బీరుమల్లయ్య, ఎంపీపీ నరాల నిర్మల, తహసీల్దార్‌ వెంకట్‌రెడ్డి, పంచాయతీరాజ్‌ డీఈఈ గిరిధర్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని