logo

గల్లీ నుంచి గమ్యం వైపు..!

క్రికెట్‌పై యువకులే కాకుండా యువతులూ దృష్టిసారిస్తున్నారు. గల్లీలో ఆడపాదడపా ఆడి ఆటపై మక్కువ పెంచుకుంటున్నారు.

Updated : 02 Feb 2023 06:20 IST

అండర్‌-15 క్రికెట్‌ జట్టుకు సూర్యాపేట బాలిక శ్రావణి ఎంపిక

సూర్యాపేట (తాళ్లగడ్డ), న్యూస్‌టుడే: క్రికెట్‌పై యువకులే కాకుండా యువతులూ దృష్టిసారిస్తున్నారు. గల్లీలో ఆడపాదడపా ఆడి ఆటపై మక్కువ పెంచుకుంటున్నారు. పాఠశాల స్థాయిలో జరిగే వివిధ పోటీల్లో ప్రతిభ చాటుతున్నారు. పిల్లల అభిరుచులను తల్లిదండ్రులు గమనించి మరింతగా ప్రోత్సహిస్తున్నారు. ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించి జిల్లా, రాష్ట్ర స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దుతున్నారు. సూర్యాపేటకు చెందిన ధరావత్‌ శ్రావణి క్రికెట్‌లో మరింతగా రాణించి అండర్‌-15 రాష్ట్ర స్థాయి జట్టుకు ఎంపికైంది.  శ్రావణి చిన్నప్పటి నుంచి చదువుతోపాటు ఆటల్లోనూ దిట్ట. ఓ సారి టీవీలో మహిళా క్రికెట్‌ పోటీలో సీనియర్‌ క్రీడాకారిణి మిథాలీరాజ్‌ ఆట చూసి ఇష్టం పెంచుకుంది. తన ఇష్టాన్ని కెరీర్‌గా మార్చుకోవాలని నిర్ణయించుకుంది. తల్లిదండ్రులు ధరావత్‌ శ్రీనివాస్‌, యమున బాలిక ఆసక్తిని గమనించి హైదరాబాద్‌లోని మేడిపల్లి ఎం.ఎస్‌.డి క్రికెట్‌ శిక్షణ కేంద్రంలో చేర్పించారు. అక్కడ కోచ్‌ల పర్యవేక్షణలో రెండేళ్లలో తన ఆటను మెరుగుపర్చుకుంది.  ప్రస్తుతం ఆమె రాజధానిలో పదో తరగతి చదువుతోంది.  హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియం నిర్వహించిన ఎంపికలో అండర్‌-15 బాలికల జట్టుకు ఇటీవల శ్రావణి ఎంపికైంది. రాష్ట్ర ప్రాబబుల్స్‌ మ్యాచ్‌లో 25 పరుగులు, 2 వికెట్లు, మరో మ్యాచ్‌లో 30 పరుగులతోపాటు 5 వికెట్లు తీసి నాటౌట్‌గా నిలిచింది. దీంతో హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ తరఫున అండర్‌-15 రాష్ట్ర జట్టులో స్థానం దక్కింది.


భారత జట్టులో ఆడాలని ఉంది
-శ్రావణి, అండర్‌-15 క్రికెట్‌ క్రీడాకారిణి

క్రికెట్‌ అంటే ప్రాణం. చిన్నప్పటి నుంచి ఇంటి దగ్గర స్నేహితులతో కలిసి ఆడుకునేదాన్ని. పాఠశాలలో నిర్వహించిన పోటీల్లో పాల్గొనడంతో ఆటపై మరింత శ్రద్ధ పెరిగింది. క్రీడాకారిణి మిథాలీరాజ్‌ ఆటను చూసి ఆమె స్ఫూర్తితో సాధన చేస్తున్నా. భవిష్యత్తులో భారత మహిళల జట్టులో ఆడాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నాను.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని