logo

యాప్‌లో.. పల్లె ప్రగతి

గ్రామాల సమగ్ర వికాసానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పల్లె ప్రగతి కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేస్తోంది. వివిధ రకాల అభివృద్ధి పనులు చేపడుతున్నారు.

Published : 04 Feb 2023 05:22 IST

ఆలేరు, న్యూస్‌టుడే

ఆలేరు మండలం మంతపురిలోని కంపోస్ట్‌ యార్డు

గ్రామాల సమగ్ర వికాసానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పల్లె ప్రగతి కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేస్తోంది. వివిధ రకాల అభివృద్ధి పనులు చేపడుతున్నారు. పనుల ప్రగతి, నిర్వహణ తీరును పక్కాగా తెలుసుకునేలా, పారదర్శకత పెంపునకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. చేపట్టిన పనుల వివరాలను పూర్తి స్థాయిలో ఛాయాచిత్రాలు తీసి అంతర్జాలంలో నిక్షిప్తం చేయాలని ఆదేశించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 71 మండలాల్లో 1,740 గ్రామ పంచాయతీలు, అనుబంధ గ్రామాలలో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ముఖ్యంగా పల్లె ప్రకృతి వనాలు, బృహత్‌ ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు, డంపింగ్‌ యార్డులు, తెలంగాణ క్రీడా ప్రాంగణాలు. నర్సరీలు, ఎవెన్యూ, మల్టీలెవెల్‌ ప్లాంటేషన్‌ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసేలా ప్రత్యేకంగా యాప్‌ రూపొందించారు.

ఛాయా చిత్రాలు తీసి...

పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో చేపట్టిన ఏడు అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలను, ఫొటోలు తీసి యాప్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. హరితహారంలో నాటిన మొక్కలు, వాటి పరిస్థితి, ఇంకా నాటించాల్సిన మొక్కల లక్ష్యం, వైకుంఠ ధామాల్లో వసతులు, విద్యుత్తు సరఫరా ఉందా, బోరుమోటారు పరిస్థితి, క్రీడా ప్రాంగణాలలో పరికరాలు ఎలా ఉన్నాయి.. లాంటి వివరాల ఛాయా చిత్రాలు తీయాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన వివిధ ప్రశ్నలను యాప్‌లో జతచేశారు. ఈ బాధ్యతలను సంబంధిత పంచాయతీ కార్యదర్శులకు అప్పగించారు. మండల స్థాయిలో ఎంపీడీవోలు, ఎంపీవోలు పర్యవేక్షిస్తున్నారు.

ప్రభుత్వం రూపొందించిన పల్లెప్రగతి యాప్‌


నిర్వహణ పకడ్బందీగా చేసేలా..

- ఎం.ఉపేందర్‌రెడ్డి, డీఆర్డీవో, యాదాద్రి

పల్లెప్రగతిలో చేపట్టిన ఏడు పనులకు సంబంధించిన పూర్తి వివరాల ఫొటోలతో పాటు, సంబంధిత ప్రశ్నలతో రూపొందించిన యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. నిర్వహణ పకడ్బందీగా చేపట్టేలా, పారదర్శకత కోసం ఈ విధానం అమల్లోకి తెచ్చారు. క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నాం. పక్కాగా పనులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని