logo

కాసులుంటేనే ధ్రువపత్రం చేతికి..!

సూర్యాపేట రెవెన్యూ కార్యాలయంలో అవినీతి అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కుటుంబ సభ్యుల ధ్రువపత్రం కావాలంటే దరఖాస్తుదారుల నుంచి డబ్బులు గుంజుతున్నారు.

Updated : 05 Feb 2023 06:30 IST

‘పేట’ తహసీల్‌ కార్యాలయంలో అక్రమాలు

సూర్యాపేట నేరవిభాగం: సూర్యాపేట రెవెన్యూ కార్యాలయంలో అవినీతి అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కుటుంబ సభ్యుల ధ్రువపత్రం కావాలంటే దరఖాస్తుదారుల నుంచి డబ్బులు గుంజుతున్నారు. ఇటీవల సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పలువురు బాధితులు ఇందుకోసం నానా తంటాలు పడాల్సి వస్తోంది. డబ్బులు ఎందుకివ్వాలని ప్రశ్నిస్తే దరఖాస్తుదారులకు చుక్కలు చూపుతున్నారు. ఏదో ఒక నిబంధన పేచీ పెట్టి కొన్ని నెలలపాటు కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారు. కుటుంబ పెద్ద మృతిచెందిన సందర్భంలో.. ఆయన పేరున ఉన్న ఆస్తిని వారసులు తమ పేరుపైకి బదిలీ చేసుకోవాలంటే సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో మరణ ధ్రువీకరణ పత్రంతోపాటు.. కుటుంబ సభ్యుల ధ్రువపత్రాన్ని జత చేయాల్సి ఉంటుంది. మరణ ధ్రువీకరణ పత్రాన్ని పురపాలిక శాఖ అధికారులు, కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రాన్ని రెవెన్యూ అధికారులు జారీ చేస్తారు. ఈ అవకాశాన్ని ఆసరాగా చేసుకొని కొంత మంది రెవెన్యూ అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఉన్నతాధికారులకు తెలిసినా ‘చూసీ’చూడనట్లుగా వ్యవహరిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది.


నలుగురు కుటుంబ సభ్యుల పేర్లతో ధ్రువపత్రం

సూర్యాపేట పట్టణంలోని చంద్రన్నకుంటకు చెందిన చెంచెల నర్సమ్మ ఏడాదిన్నర క్రితం మృతిచెందారు. ఆమె కొడుకు, కోడలు(కొడుకు భార్య) సూర్యాపేట తహసీల్‌ కార్యాలయంలో వేర్వేరుగా కుటుంబ సభ్యుల (ఫ్యామిలీ మెంబర్‌) ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు విచారించి ధ్రువ పత్రం జారీ చేయాల్సి ఉంది. కానీ, కుటుంబ సభ్యుల వివరాలను తప్పుగా నమోదు చేశారు. మొదటి దరఖాస్తుదారుల ధ్రువపత్రంలో నలుగురు కుటుంబ సభ్యులుగా.. రెండోదాంట్లో ఐదుగురు కుటుంబ సభ్యులుగా నమోదు చేశారు. ఇలా వేర్వేరుగా ధ్రువపత్రాలు జారీ చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


సూర్యాపేటలోని శ్రీరాంనగర్‌కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి నాలుగు నెలల క్రితం అనారోగ్యంతో మృతిచెందారు. ఆస్తులను తమ పేరుమీదకు మార్చుకునేందుకు కుటుంబ సభ్యుల ధ్రువపత్రం కోసం నిబంధనల ప్రకారం మీసేవ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. మీసేవ సిబ్బంది సూచన మేరకు బాధితులు సూర్యాపేట తహసీల్‌ కార్యాలయంలో సంప్రదించారు. అధికారి మాత్రం రూ.10 వేలు ఇస్తేనే ధ్రువపత్రం జారీ చేస్తామని తెగేసి చెప్పాడు. కార్యాలయంలో తలాకొంత ఇవ్వాల్సి ఉంటుందని సెలవిచ్చాడు. చివరకు రూ.8 వేలకు బేరం కుదుర్చుకొని ధ్రువపత్రాన్ని పొందారు.


ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం
- వెంకన్న, తహసీల్దార్‌, సూర్యాపేట

నిబంధనల ప్రకారమే ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నాం. మా సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నట్లు నా దృష్టికి రాలేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే విచారణ నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని