logo

సకల జనుల మేలెంచి.. పద్దు మాలలో కూర్చి..!

మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో దళిత బంధుకు అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. సొంతింటి కలను నిజం చేసేందుకు సాయం అందిస్తామని ప్రకటించారు.

Published : 07 Feb 2023 06:22 IST

ఈ ఏడాదిలోనే యాదాద్రి థర్మల్‌ విద్యుత్కేంద్రం నుంచి ఉత్పత్తి ప్రారంభం
-ఈనాడు, నల్గొండ

మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో దళిత బంధుకు అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. సొంతింటి కలను నిజం చేసేందుకు సాయం అందిస్తామని ప్రకటించారు. యాదాద్రి థర్మల్‌ ప్లాంటు నుంచి ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఉత్పత్తి ప్రారంభిస్తామని వెల్లడించారు.
సకలజన సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర బడ్జెట్‌ను రూపొందించారు.

*   సూక్ష్మ, మధ్య, చిన్నతరహా పరిశ్రమలకు సంబంధించి రాష్ట్రంలోనే తొలిసారిగా యాదాద్రి జిల్లా దండుమల్కాపూర్‌లో నిర్మించిన ఎంఎస్‌ఎంఈ గ్రీన్‌ ఇండస్త్ట్రియల్‌ పార్కుతో 15 వేల మందికి ప్రస్తుతం ఉపాధి లభిస్తుంది. 570 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ పార్కులో 400 ఎంఎస్‌ఎంఈలు రూ.1200 కోట్ల పెట్టుబడులు పెట్టాయి.  

*   యాదాద్రి ఆలయ అభివృద్ధి ప్రాధికార సంస్థ (వైటీడీఏ - యాడా)కు ఈ బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయించారు. ప్రధానాలయంతో పాటూ ఆలయ నగరిలో చేపట్టే వివిధ పనులకు ఈ నిధులను ఖర్చు చేయనున్నారు.  

*   యాదాద్రి జిల్లా తుర్కపల్లి, యాదగిరిగుట్ట, భువనగిరి, వలిగొండ, చౌటుప్పల్‌ గుండా ఆర్‌ఆర్‌ఆర్‌ రహదారి వెళ్తోంది. ఈ మండలాల పరిధిలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు మెరుగైన పరిహారం ఇవ్వాలని ఇటీవల కొంత కాలం నుంచి ఆందోళన కార్యక్రామలు చేస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌కు రూ.500 కోట్లు కేటాయించారు.


పోగు బతుకులు.. అతికేలా..

ఇప్పటికే నేతన్నకు భరోసా కింద నేత కార్మికులకు ఆర్థికసాయం అందజేస్తున్న ప్రభుత్వం.. కార్మికులకు బీమా సౌకర్యాన్నీ కల్పిస్తోంది. చేనేత మిత్ర పథకంలో నూలు, రసాయనాలను 50 శాతం రాయితీతో అందిస్తున్నారు. లక్షలోపు రుణాలున్న చేనేతలకు రుణమాఫీని సైతం అమలు చేయనున్నట్లు మంత్రి బడ్జెట్‌ ప్రసంగంలో వెల్లడించారు. దీంతో రాష్ట్రంలోనే నేతన్నలు ఎక్కువగా ఉండే ఉమ్మడి నల్గొండ జిల్లాలో దాదాపు 9 వేల మందికి పైగా కార్మికులకు భరోసా దక్కనుంది.


ఇంటికి.. ‘లక్ష’ణమైన కేటాయింపు

సొంత జాగా ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి ఈ బడ్జెట్‌ నుంచే రూ.3 లక్షల మేర ఆర్థికసాయం చేస్తామని బడ్జెట్‌లో ప్రకటించారు. నియోజకవర్గానికి 2 వేల మందికి చొప్పున ఉమ్మడి జిల్లాలో ఈ పథకం ద్వారా 24 వేల మందికి లబ్ధి చేకూరనుంది. రెండు పడక గదుల ఇళ్లకు ఈ బడ్జెట్‌లో రూ. 12,000 కోట్లు కేటాయించారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు 17,199 ఇళ్లు మంజూరయ్యాయి.


దళిత బంధువై..

పథకానికి రూ.17 వేల కోట్లను కేటాయించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఈ పథకం కింద యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలోని 76 కుటుంబాలు లబ్ధిపొందగా..తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలంలోని అన్ని కుటుంబాలతో పాటూ ఉమ్మడి జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాల్లోని 100 కుటుంబాల చొప్పున తొలి దశలో 1500 కుటుంబాలకు ఈ పథకం కింద రూ.10 లక్షల ఆర్థికసాయం చేశారు. నియోజకవర్గానికి 100 చొప్పున రెండో దశలోనూ సాయం అందించారు. ఇప్పటి వరకు మొత్తంగా ఉమ్మడి జిల్లాలో 5 వేలకు పైగా కుటుంబాలకు ఈ పథకం కింద ఆర్థిక సాయం దక్కగా...ఇందులో కొంత మంది ఇప్పటికే యూనిట్లను స్థాపించి ఉపాధి పొందుతున్నారు. ఈ ఏడాది బడ్జెట్‌లో నియోజకవర్గానికి 1100 చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేసి సాయం చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఉమ్మడి జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాలకు గానూ 13,200 మందికి ఈ పథకం అందనుంది.


ఏరువాక.. జోరువాకే..

ఎప్పటిలాగే ఈ పద్దులోనూ వ్యవసాయానికి అగ్రతాంబూలం వేసి రూ.26,831 కోట్లు కేటాయించారు. రైతుబీమా, రైతుబంధు పథకాల లబ్ధిదారులు అత్యధికంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే ఉండటం విశేషం. సాగు భూమిలోనూ ఉమ్మడి నల్గొండ జిల్లానే అగ్రస్థానంలో ఉంది. అధికారుల లెక్కల ప్రకారమే నల్గొండ 14 లక్షల ఎకరాల సాగు భూమి ఉండగా, సూర్యాపేటలో 6.25 లక్షల ఎకరాలు, యాదాద్రిలో 7.38 లక్షల ఎకరాలు ఉంది.


దామరచర్ల నుంచి కొత్త వెలుగులు

రాష్ట్రంలో మిగులు విద్యుత్తే లక్ష్యంగా దామరచర్లలో రూ.30 వేల కోట్లతో నిర్మిస్తున్న 4 వేల మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ కేంద్ర నిర్మాణం ఇప్పటికే తుది దశకు చేరుకుందని ఆర్థికమంత్రి ప్రకటించారు. గతేడాది చివరలో నిర్మాణ పనులను సీఎం కేసీఆర్‌ పరిశీలించారు. ఈ ఏడాదే ఈ ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభిస్తామని వెల్లడించారు. మొత్తం 5 యూనిట్లలో.. ఒక్కో యూనిట్‌లో 800 మెగావాట్ల చొప్పున నిర్మిస్తున్న ఈ కేంద్రం పనులు ప్రస్తుతం 70 శాతానికి పైగా పూర్తయ్యాయి. త్వరలోనే విష్ణుపురం నుంచి ప్రాజెక్టు స్థలం అయిన వీర్లపాలెం వరకు రైల్వే మార్గాన్ని టీఎస్‌ జెన్‌కో నిర్మించనుంది.


డిండికి.. దండిగా..

మునుగోడు, దేవరకొండతో పాటూ ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అచ్చంపేట, కల్వకుర్తిలోని అయిదు మండలాల్లోని 3.41 లక్షల ఎకరాలకు సాగునీరందించే ఆర్‌. విద్యాసాగర్‌ రావు -డిండి ఎత్తిపోతల పథకానికి ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.250 కోట్లు కేటాయించింది. రూ.6,190 కోట్లతో ఐదేళ్ల క్రితం చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు నిధుల లేమి, ఎన్జీటీ కోర్టుల్లో కేసుల వల్ల చురుగ్గా సాగడం లేదు. గతేడాది ఈ పథకానికి రూ.300 కోట్లు కేటాయించగా, సవరించిన అంచనాల మేరకు అది రూ.347.44 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.


దివ్యక్షేత్రంగా.. యాదాద్రి

సనాతన వైదిక ధర్మాన్ని ఆచరించడంతో పాటూ దానికి పూర్వ వైభవం తీసుకురావాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్‌ యాదాద్రిని భూలోక వైకుంఠంగా తీర్చిదిద్దుతున్నారని మంత్రి వెల్లడించారు. గతేడాది మహాకుంభసంప్రోక్షణ చేసుకున్నామని గుర్తుచేశారు. రోజురోజుకూ యాదాద్రి దేవాలయాన్ని సందర్శించే భక్తుల సంఖ్య పెరుగుతోందని, ఈ ఆలయ పునర్నిర్మాణం చేసిన సీఎం చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతారని వెల్లడించారు.

*  ప్రాచీన కాలం నుంచీ తెలంగాణ బౌద్ధ, జైన మతాలకు కేంద్రగా విలసిల్లిందన్న హరీశ్‌రావు,  ఆచార్య నాగార్జునుడు నడయాడిన నాగర్జునసాగర్‌లో 274 ఎకరాల విస్తీర్ణంలో రూ.71 కోట్లతో బుద్ధవనం ప్రాజెక్టును అభివృద్ధి చేసిందన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బౌద్ధులను, పర్యాటకులను ఈ ప్రాజెక్టు పెద్ద ఎత్తున ఆకర్షింస్తుందన్నారు.


ఉద్యోగులకుఆరోగ్యం

ఎంప్లాయి హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ ద్వారా కొత్త ఈహెచ్‌ఎస్‌ (ఎంప్లాయ్‌ హెల్త్‌ స్కీం)ను ప్రవేశపెట్టనున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించారు. విధి విధానాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. దీని వల్ల ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులు కలిపి మొత్తం 70 వేల మంది వరకు లబ్ధి చేకూరనుంది.


అవీ ఇవీ..

*   ఈ ఏడాదే నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న ఐటీ టవర్‌ను ప్రారంభిస్తామని మంత్రి బడ్జెట్‌లో ప్రస్తావించారు.  

*  సెర్ఫ్‌ ఉద్యోగులకు వేతన సవరణ చేస్తామని మంత్రి ప్రకటించగా.. ఉమ్మడి జిల్లాలో సెర్ఫ్‌లో పనిచేస్తున్న 500 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.

*  ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి కాంట్రాక్ట్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించనుండగా..ఉమ్మడి జిల్లాలో సుమారు 6 వేల మందికి పైగా ఉద్యోగులు లబ్ధిపొందనున్నారు.

*   మధ్యాహ్న భోజన కార్మికుల వేతనం రూ.3 వేలకు పెంచడం వల్ల ఉమ్మడి జిల్లాలో ఐదున్నర వేల మందికి లబ్ధి చేకూరనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని