logo

పట్టు పట్టారు.. పరీక్షలో నెగ్గారు

ప్రతిభావంతులైన పేద విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో విద్యకు దూరం కాకుండా చదువుల్లో మరింతగా రాణించేందుకు ఏటా కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రతిభా ఉపకార వేతనం (నేషనల్‌ మీన్స్‌ కం మెరిట్‌ స్కాలర్‌షిప్‌-ఎన్‌ఎంఎంఎస్‌) అందజేస్తోంది.

Published : 21 Mar 2023 05:24 IST

 ఎన్‌ఎంఎంఎస్‌లో ‘పేట’ నంబరు-2 పాఠశాల విద్యార్థుల ప్రతిభ

సూర్యాపేట, (మహాత్మాగాంధీరోడ్డు), న్యూస్‌టుడే: ప్రతిభావంతులైన పేద విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో విద్యకు దూరం కాకుండా చదువుల్లో మరింతగా రాణించేందుకు ఏటా కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రతిభా ఉపకార వేతనం (నేషనల్‌ మీన్స్‌ కం మెరిట్‌ స్కాలర్‌షిప్‌-ఎన్‌ఎంఎంఎస్‌) అందజేస్తోంది. ఈ ఉపకార వేతనం అందుకోవాలంటే ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్షలో ప్రతిభ చాటాలి. ఎంపికైన విద్యార్థులకు ఏటా రూ.12 వేల చొప్పున నాలుగేళ్లపాటు అందిస్తుంది. సూర్యాపేట పట్టణంలోని నంబరు-2 ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు జాతీయ ప్రతిభా పరీక్షలో నాలుగేళ్ల నుంచి ఎంపికవుతున్నారు. ఇక్కడ చదువుతున్న తమ పిల్లల గురించి తల్లిదండ్రులు చాలా గొప్పగా చెబుతున్నారు.


సన్నద్ధత ఇలా..

ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చొరవతో ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ ఉపకార వేతన పరీక్షలో నెగ్గేలా ప్రత్యేకంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. రోజూ గంటన్నర పాటు అదనపు తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులతో నోట్స్‌ రాయిస్తున్నారు. పాఠ్యపుస్తకాల్లోని పాఠం చివర ఉన్న ప్రశ్నలను సాధన చేయిస్తున్నారు. ఓఎంఆర్‌ షీట్స్‌పై తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలే కాకుండా కొత్తగా ఎలాంటివి వస్తాయే ఉపాధ్యాయులు అంచనా వేసి చెబుతుండటంతో అనుకున్న ఫలితాలు సాధిస్తున్నారు. ఇటీవల వెలువడిన ఫలితాల్లోనూ ఈ పాఠశాల నుంచి నలుగురు విద్యార్థులు ఎంపిక కావడం విశేషం. విజేతల మనోగతం వారి మాటల్లో..


జిల్లాలో పదో ర్యాంకు సాధించా
- ఎం.రీతికారెడ్డి, విద్యార్థిని

రోజూ పాఠశాలలో బోధించిన అంశాలపై నోట్స్‌గా తయారు చేసుకొని చదివాను. అదనపు తరగతులు నిర్వహించడం వల్ల ఉత్తమ ఫలితాలు సాధించాం. నాతో పాటు మిగిలిన విద్యార్థులూ ఉపాధ్యాయులు తయారు చేసిన నోట్స్‌ ఆధారంగా సన్నద్ధమయ్యారు. నాకు 180 మార్కులకు గాను 125 వచ్చాయి. జిల్లాలో పదో ర్యాంకు కైవసం చేసుకున్నాను. ఇంటర్‌ వరకు ఏటా అందే ఉపకార వేతనం నా చదువుకు ఎంతో ఉపయోగపడుతుంది.


రోజూ పునఃశ్చరణ చేసుకున్నా..
- పి.తేజ, విద్యార్థి

ఈసారి నిర్వహించిన జాతీయ ప్రతిభా పరీక్షలో 93 మార్కులు సాధించాను. సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులు బోధించిన ప్రతి అంశాన్ని రోజూ చదివాను. పునఃశ్చరణ చేసుకోవడం వల్ల పరీక్షల్లో ప్రతిభ చూపాను.


సమష్టి కృషితోనే ఉత్తమ ఫలితాలు
- అంకటి వెంకన్న, ప్రధానోపాధ్యాయుడు, నంబరు-2 ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సూర్యాపేట

ఉపాధ్యాయుల సమష్టి కృషితోనే జాతీయ ప్రతిభ ఉపకార వేతనాల్లో అనుకున్న ఫలితాలు సాధిస్తున్నాం. సబ్జెక్ట్‌ ఉపాధ్యాయులు సొంతంగా నోట్స్‌ తయారు చేసి విద్యార్థులకు అందిస్తున్నారు. నాలుగేళ్ల నుంచి మా పాఠశాల విద్యార్థులు ఎన్‌ఎంఎంఎస్‌లో అర్హత సాధిస్తున్నందుకు ఆనందంగా ఉంది.


తల్లిదండ్రుల ప్రోత్సాహంతో..
- ఆర్‌.రిషికేశవ, విద్యార్థి

జాతీయ ఉపకార వేతనాలకు అర్హత సాధిస్తే నాలుగేళ్లుగా ఆర్థికసాయం అందుతుందని మా నాన్న అవగాహన కల్పించారు. రోజూ ఇంటి వద్ద సన్నద్ధమయ్యేలా ప్రోత్సహించారు. ఉపాధ్యాయుల సూచనలతో ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకొని చదివాను.. సందేహాలను పాఠశాలలో ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకున్నా. 180 మార్కులకు గాను 103 మార్కులు సాధించాను.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని