logo

పదాలలో కదిలేది.. హృదయాలను కదిలించేది.. కవిత్వం

జానపదుల నోటి నుంచి అలవోకగా దూకిన పాట మొదలు ఈనాటి కొంగొత్త ప్రక్రియల వరకు ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూనే వస్తుంది తెలుగు కవిత్వం. పద్యం, గేయం, వచనం ఇలా..

Published : 21 Mar 2023 05:24 IST

నేడు ప్రపంచ కవితా దినోత్సవం

మోత్కూరులో ప్రజాభారతి ఆధ్వర్యంలో ఇటీవల మోదుగురేకులు గ్రంథావిష్కరణలో పాల్గొన్న కవులు

మోత్కూరు, న్యూస్‌టుడే: జానపదుల నోటి నుంచి అలవోకగా దూకిన పాట మొదలు ఈనాటి కొంగొత్త ప్రక్రియల వరకు ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూనే వస్తుంది తెలుగు కవిత్వం. పద్యం, గేయం, వచనం ఇలా.. ముప్పేట అల్లుకుంది తెలుగు కవిత్వం. ముఖ్యంగా ఆధునిక తెలుగు కవిత్వం భిన్న పాయలుగా పారుతూ బీడు భూముల వంటి మస్తిష్కాలను ఉత్తేజపరుస్తోంది. ఇటీవల వాట్సాప్‌ మాధ్యమం ద్వారా ప్రచారంలోకి వచ్చిన ‘ఏకవాక్య కవిత్వం’ కూడా తనదైన గొంతుకను వినిపిస్తోంది.


సామాజిక చైతన్య వేదికలు...

మారుతున్న కాలానికి అనుగుణంగా.. సామాజిక మాధ్యమాలు కవితలకు, సాహిత్య వ్యాప్తికి చక్కని వేదికలుగా మారాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వాట్సాప్‌, ట్విటర్‌,  ఫేస్‌బుక్‌ వేదికలుగా చేసుకుని వందలాది మంది కవులు అనునిత్యం తమ కవితలను వెదజల్లుతున్నారు. కరోనా సమయంలో వాట్సాప్‌ వేదికలుగా కవితా పోటీలను కూడా నిర్వహించడం విశేషం. ప్రతీరోజు వందలాది కవితలు, వాట్సాప్‌ గ్రూపుల్లో తెలుగు సాహిత్య పరిమళాలను వెదజల్లుతుంటే వీటిని చూసి ప్రశంసించేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కొత్త కవులకూ ఈ సామాజిక మాధ్యమాలు రాచబాట వేస్తున్నాయి.


సాహిత్య సేవలో..

తెలుగు సాహిత్య సేవలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అనేక సాహితీ సంస్థలు, కవులు, రచయితలు తెలుగుకు వెలుగునిస్తున్నారు. రాష్ట్రస్థాయిలో కవి దిగ్గజాలుగా పేరొందిన అనేక సాహితీమూర్తులకు వేదిక ఈ నల్గొండ జిల్లా. డాక్టర్‌ ఎన్‌.గోపి,  డాక్టర్‌ దేవరాజు మహారాజు, డాక్టర్‌ రవ్వా శ్రీహరి, సీవీ కృష్ణారావు, డాక్టర్‌ ముదిగంటి సుజాతరెడ్డి, డాక్టర్‌ రావి ప్రేమలత, డాక్టర్‌ శ్రీరంగచార్య, డాక్టర్‌ ఎన్‌.లక్ష్మణమూర్తి, డాక్టర్‌ కూరెళ్ల విఠలాచార్యులు, డాక్టర్‌ తూర్పు మల్లారెడ్డి, డాక్టర్‌ కాసుల లింగారెడ్డి, అలుగుబెల్లి రాంచంద్రారెడ్డి, డాక్టర్‌ తిరునగరి, డాక్టర్‌ ఎన్‌.రఘు, వేణు సంకోజు, డాక్టర్‌ లింగ అరుణమ్మ, డాక్టర్‌ సుంకిరెడ్డి నారాయణరెడ్డి, డాక్టర్‌ ఏనుగు నర్సింహారెడ్డి, డాక్టర్‌ లింగంపల్లి రామచంద్ర, డాక్టర్‌  పోరెడ్డి రంగయ్య, లెక్కల మల్లారెడ్డి, వనం సావిత్రినాథ్‌, దాసోజు పద్మావతి, నిఖిలేశ్వర్‌, కాసుల ప్రతాపరెడ్డి, బందారు సుజాతా శేఖర్‌, గంజి భాగ్యలక్ష్మీ, ఉప్పల పద్మ, బండారు జయశ్రీ, మర్రి జయశ్రీ, వల్లాల విజయలక్ష్మీ ఇలా.. వందలాదిమంది కవులు తమ సాహిత్యంతో జిల్లాకు పేరు తెచ్చిపెడుతున్నారు.

*  జిల్లాలోని అనేక సాహితీ సంస్థలు తెలుగు వైభవాన్ని చాటేందుకు తమదైన తీరులో కృషి చేస్తున్నాయి. భారతి సాహిత్య సాంస్కృతిక వేదిక, సృజన సాహితి, నీలగిరి, కోమలి కళాసమితి, నీలగిరి కళాసమితి, అక్షర కళాభారతి, తేజ ఆర్ట్స్‌ క్రియేషన్స్‌, ప్రజాభారతి, మల్లెల భారతి, భువనభారతి, జయమిత్ర, చైతన్య కళా శ్రవంతి, సాహితీ స్నేహితులు... ఇలా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సూర్యాపేట, దేవరకొండ, నకిరేకల్‌, మిర్యాలగూడ, భువనగిరి, ఆలేరు, మోత్కూరు తదితర ప్రాంతాల్లో తరుచూ సాహిత్య కార్యక్రమాలు, ఉగాది కవి సమ్మేళనాలు, పుస్తకావిష్కరణలు, పురస్కారాల ప్రదానం.. ఇలా అనేక కార్యక్రమాలతో తెలుగు సాహిత్యానికి జీవం పోస్తున్నాయి.

నానీల రూపశిల్పి డాక్టర్‌ ఎన్‌.గోపి


త్రిపదలు సృష్టికర్త డాక్టర్‌ కూరెళ్ల విఠలాచార్యులు


ఏకవాక్య ప్రక్రియను ఆవిష్కరించిన దేవినేని అరవిందరాయుడు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని