logo

ఆర్టీసీ బస్సు ఢీకొని న్యాయవాది దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో న్యాయవాది మృతి చెందిన ఘటన యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురం శివారులో చోటుచేసుకుంది.

Published : 21 Mar 2023 05:24 IST

సముద్రాల పృథ్వీ చక్రవర్తి

చౌటుప్పల్‌గ్రామీణం, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో న్యాయవాది మృతి చెందిన ఘటన యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురం శివారులో చోటుచేసుకుంది. ఎస్సై ప్రభాకర్‌ తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌కు చెందిన సముద్రాల పృథ్వీ చక్రవర్తి(53) ఆదివారం ఉదయం సూర్యాపేట జిల్లా తుంగతుర్తికి వెళ్లారు. స్నేహితుని తండ్రి దశదిన కర్మ ఉండటంతో కారులో తోటి స్నేహితులతో కలిసి వెళ్లి రాత్రి హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు. దండుమల్కాపురం పారిశ్రామిక పార్కు వద్దకు రాగానే మూత్రవిసర్జన కోసం జాతీయరహదారి పక్కనే కారును నిలిపారు. కారు ఎక్కే క్రమంలో సూర్యాపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్‌ వైపు వెళ్తూ పృథ్వీ చక్రవర్తిని ఢీకొట్టడంతో మృతి చెందాడు. చౌటుప్పల్‌ ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడు హైకోర్టు సీనియర్‌ న్యాయవాది. న్యాయవాదిగా మానవ హక్కుల కోసం పని చేశాడు. జువైనల్‌ రిసెర్చ్‌ ఫోరంను స్థాపించి బాలల హక్కుల పరిరక్షణకు కృషి చేశాడు. మృతుని బావ కృష్ణన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.


నీటి సంపులో పడి చిన్నారి మృతి

రామన్నపేట, న్యూస్‌టుడే: నీటి సంపులో పడి ఓ చిన్నారి మృతి చెందిన ఘటన సోమవారం సాయంత్రం రామన్నపేటలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... రామన్నపేటకు చెందిన కందుల వేణు, శ్రవంతిల దంపతుల 18 నెలల కుమారుడు నిహాల్‌ సోమవారం సాయంత్రం ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు సంపులో పడ్డాడు. కొద్ది సేపటి తర్వాత గుర్తించిన కుటుంబ సభ్యులు బాలుడిని వెంటనే స్థానిక ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని